మంగళవారం 31 మార్చి 2020
Medchal - Feb 08, 2020 , 01:55:37

రెండో రోజు 552 నామినేషన్లు..

రెండో రోజు 552 నామినేషన్లు..
  • ఇప్పటి వరకు 669 నామినేషన్లు దాఖలు.. నేటితో స్వీకరణ పూర్తి
  • జోరందుకున్న ఎన్నికల సందడి.. మండలాలకు చేరిన బ్యాలెట్‌ బాక్సులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు రెండో రోజు శుక్రవారం 552 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు 117 రాగా, మొత్తం రెండు రోజుల్లో 669 నామినేషన్లు వచ్చినట్లు డీసీవో జనార్దన్‌రెడ్డి  తెలిపారు. అత్యధికంగా పటేల్‌గూడ సొసైటీలో 30 నామినేషన్లు దాఖాలయ్యాయి. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. జిల్లాలోని 37 సొసైటీలకు గాను 481 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సులు మండల కేంద్రాలకు చేరుకున్నాయి.జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల సందడి జోరందుకుంది. ఆయా సొసైటీల పరిధిలో డైరెక్టర్‌గా పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. వారితో ఆయా సొసైటీల పరిధిలో నామినేషన్లను వేయిస్తున్నారు. శాసనసభ, పార్లమెంట్‌, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన ‘గులాబీ దళం’ సహకార ఎన్నికల్లో సైతం సత్తా చాటేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నది. 

    జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల సందడి జోరందుకున్నది. రెండు రోజుల నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండడంతో ఆశావాహులంతా నామినేషన్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు సహకార ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కొందరు  అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆయా పార్టీలు మద్ధతుతోనే అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. 37 పీఏసీఎస్‌లలో వీటన్నింటిలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఖరారు చేశారు. చాలాచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నేతృత్వంలో ఆయా  నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు దాదాపుగా చైర్మన్‌ అభ్యర్థులను ఖరారు చేశారు. నియోజకవర్గంలోని ఎక్కువ మొత్తంలో డైరెక్టర్‌ పదవులను ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మండలాల్లోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు సొసైటీల వారిగా ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తూ సహకార ఎన్నికల్లో విజయం కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నారు. జిల్లాలోని అన్ని సొసైటీలను గెలుచుకునే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. 

నియోజకవర్గాల వారీగా ఏకగ్రీవం దిశగా..

 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నేతృత్వం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని సొసైటీలను, చేవెళ్ల శాసన సభ్యులు కాలె యాదయ్య తన నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల,ముడిమ్యాల,గుండాల,ఆలూరు, సురంగల్‌,మోకిల, శంకర్‌పల్లి,షాబాద్‌ సొసైటీలను గెలుచుకునే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌,రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలో సొసైటీలను గెలుచుకునే లక్ష్యంగా స్థానిక శాసన సభ్యులు ప్రకాశ్‌గౌడ్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకొని అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు ఆయా సొసైటీలకు ఎన్నికల ఇన్‌చార్జిలను నియమించి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత వారిపై ఉంచారు. చాలా వరకు డైరెక్టర్‌ పదవులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకోనున్నట్లు ఆయా సొసైటీల్లో ఉన్న పరిస్థితుల బట్టి అందుతున్న సమాచారం.  జిల్లాలో అన్ని సొసైటీలను గెలుచుకొని క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు వెళ్తున్నది.  ప్రతిపక్ష పార్టీలకు సొసైటీ డైరెక్టర్‌ పదవులకు పోటీ చేయడానికి అభ్యర్థులు కరవయ్యారు. దీంతో సహకార ఎన్నికల్లో ఆ పార్టీలు చేతులేత్తేసినట్లేనని చెప్పవచ్చు. 


logo
>>>>>>