శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Feb 06, 2020 , 02:01:36

గుర్రాల రేస్‌ బెట్టింగ్‌ దందా!

గుర్రాల రేస్‌ బెట్టింగ్‌ దందా!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గుర్రాల రేస్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఓ గ్యాంగ్‌ను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన దుగడ్‌ అజిత్‌కుమార్‌ జైన్‌ హైదరాబాద్‌ రేస్‌కోర్సు(హెచ్‌ఆర్‌సీ)లో బెట్టింగ్‌లో నష్టాలకు గురయ్యాడు. అయి తే గుర్రం పందాలు నిర్వహించి.. నష్టాలను పూడ్చుకోవాలనుకున్నాడు. ఇందు లో  భాగంగా హెచ్‌ఆర్‌సీలో బెట్టింగ్‌ విభాగంలో పనిచేసే ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన యోగేష్‌కుమార్‌, ఓల్డ్‌మలక్‌పేట్‌కు చెందిన మిర్జా హిదయాతుల్హా బేగ్‌, మౌలాలీకి చెందిన ఎం.రవీందర్‌, పేట్లబురుజ్‌కు చెందిన రాజ్‌కుమార్‌ సింగ్‌ల సహకారంతో గుర్రాల పందాల్లోకి దిగాడు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలోని పోలిషెట్టి ఎన్‌క్లేవ్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ నుంచి తన బెట్టింగ్‌ దందా సాగిస్తున్నాడు.


హైదరాబాద్‌, ముంబై, మైసూర్‌, చెన్నై, ఢిల్లీలో జరిగే గుర్రపు పందాలను టీవీలలో వీక్షిస్తూ. ఆయా ప్రాంతాల్లోని ఫంటర్ల వద్ద నుంచి బెట్టింగ్‌ డబ్బులు తీసుకోవడం, ఇవ్వడం చేస్తున్నాడు. ఇందుకు వాట్సాప్‌, గూగుల్‌పే అప్లికేషన్లను వాడుకుంటున్నాడు. నిర్వాహకుడు అజిత్‌కుమార్‌ను గతంలో మారేడ్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చే శారు. అయినా తన బెట్టింగ్‌ దందాను మానుకోలేదు. తాజాగా నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు బృందానికి గుర్రాపు పందాల బెట్టింగ్‌ సమాచారం రావడంతో ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకుడు అజిత్‌కుమార్‌తో పాటు సహాయకులు పోలీసులకు దొరికిపోయారు. వీరి నుంచి రూ.81 వేల నగదు, టీవీ, 20 మొబైల్‌ ఫోన్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణకు కార్ఖన పోలీసులకు అప్పగించారు. 


logo