గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Feb 05, 2020 , 01:14:59

ప్రభుత్వ స్థలాలు రక్షించాలి

ప్రభుత్వ స్థలాలు రక్షించాలి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరితగతిన అందే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని చాంబర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్వేతామహంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలను అమలు చేస్తుందని, వాటిని సాధ్యమైనంత త్వరగా దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందేలా కృషి చేయాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌ మదిలోంచి పుట్టిన మానసపుత్రిక అయినటువంటి ఈ పథకాన్ని ఎంతో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల హాజరు, ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయని, వాటి పట్ల సమగ్రమైన నివేదికను రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంగన్‌వాడీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు తీరుతెన్నులను పరిశీలించాలని, అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని అంగన్‌వాడీలను ప్రారంభించి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్నారు. నగరంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా రూపొందించి ల్యాండ్‌బ్యాంకు నివేదికను రూపొందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ భూములపై కోర్టు పరిధిలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వాటి పరిరక్షణకు సర్కారు తరఫున అవసరమైన కఠిన చర్యలను వెంటనే తీసుకోవాలని తలసాని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక న్యాయవాదులను నియమించుకొని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడడంలో తన వంతు కృషి చేయాలన్నారు. పేద ప్రజలకు అందిస్తున్న పింఛన్ల పెండింగ్‌ దరఖాస్తులను ఆయా మండలాల వారీగా నివేదికలను తెప్పించుకొని వాటిని త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్‌ శ్వేతా మహంతిని మంత్రి ఆదేశించారు. 


logo