శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Feb 05, 2020 , 01:12:31

హెచ్‌ఎండీఏ భూముల పరిరక్షణకు చర్యలు

హెచ్‌ఎండీఏ భూముల పరిరక్షణకు చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చేతిలో రూ.వేల కోట్ల విలువజేసే ల్యాండ్‌ బ్యాంకు.. కానీ వాటిని పరిరక్షించడంలో నిర్లక్ష్యం.. ఆపై కబ్జాదారులకు సహకారం.. వెరసి వందల ఎకరాల హెచ్‌ఎండీఏ స్థలాలు పరాయిల పాలు..ఇదంతా ఉమ్మడి పాలనలో హెచ్‌ఎండీఏ భూములపై జరిగిన తంతు.. కానీ గడిచిన ఆరు సంవత్సరాలలో గజం స్థలం కూడా చేజారిపోకుండా పకడ్బందీగా వ్యవహరించింది తెలంగాణ సర్కారు. సంస్థకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? సుప్రీం కోర్టు, హైకోర్టు, దిగువ కోర్టుల్లో కేసులు, వాటి స్టేటస్‌ ఏ దశలో ఉన్నాయో ముందుగా ఆరా తీసింది. కోర్టుల వారీగా ప్రత్యేక మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కోర్టుల్లో చిక్కుకున్న కేసులపై పక్కా ఆధారాలతో విచారణను సకాలంలో సమర్థవంతంగా ఎదుర్కొని రూ.వేల కోట్ల భూములను తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి చేర్చింది. పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపడుతున్నది. ఇదే సమయంలో వివాదరహితంగా ఉన్న భూములను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించారు. సంస్థ సంబంధించిన భూ రికార్డులను సమగ్రంగా రూపొందించి ల్యాండ్‌బ్యాంకు నివేదికను రూపొందించాలని రెండురోజుల క్రితం సంబంధిత శాఖ అధికారులకు పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ పలు సూచనలు చేశారు. 

డిజిటలైజేషన్‌తో బహు ప్రయోజనం..

కోట్లాది రూపాయల విలువజేసే భూముల పర్యవేక్షణ సులభతరం చేయడంతోపాటు భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమణలు జరుగకుండా ఉండేందుకుగానూ డిజిటలైజేషన్‌ చేయాలన్న కమిషనర్‌ ఆదేశాలకనుగుణంగా చర్యలు ప్రారంభించారు. వివాదరహితంగా ఉన్న భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి విస్తీర్ణం? సర్వే నంబర్లు, మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఆ భూమి ఏ జోన్‌లో ఉన్నది? తదితర సమగ్ర నివేదిక రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. భూములన్నీ సర్వే నంబర్లు, మ్యాపులు కలిపి డిజిటలైజేషన్‌ చర్యలు చేపట్టనున్నారు. సంస్థ చేపట్టిన వివిధ లే అవుట్లలో ఈ-వేలంలో మిగిలిపోయిన స్టే బిట్లు(చిన్న చిన్న ముక్కలు) పరిరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్‌ సెక్యూరిటీ నిఘా నీడలో ఉన్న స్థలాల ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ, ఫెన్సింగ్‌ల ఏర్పాటుతోపాటు సంస్థ లోగోతో కూడిన బోర్డులను ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నారు. ఆక్రమణల నుంచి బయటపడేందుకు సులభంగా ఉంటుందని, భవిష్యత్‌లో గజం స్థలం కూడా కబ్జా కాకుండా ముందస్తుగానే నియంత్రించవచ్చని అధికారుల అంచనా. అంతేకాకుండా అధికారులు ఎవరుమారినా తదుపరి వచ్చే వారికి భూములపై స్పష్టమైన అవగాహన ఉంటుందని భావిస్తోంది.


logo