శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Feb 04, 2020 , 03:49:18

విద్యార్థులకు అండగా..

విద్యార్థులకు అండగా..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆధునిక జీవన విధానంలో.. చిన్న సమస్యలకే విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారు. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ పెద్ద ఆపదలో ఉన్నట్లు ఆందోళన చెందుతున్నారు. తమలో ఉండే బాధలను ఎవరికి చెప్పుకోలేక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని సార్లు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఈ సమ స్య కేవలం చిన్నారుల సమస్యే కాదు, వారి బాధను అర్థం చేసుకోలేకపోతున్న తల్లిదండ్రులది కూడా. వారిపైనే పంచప్రాణాలు పెట్టుకునే తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక స్థితిలో మార్పులను గమనిస్తూ వారి ప్రవర్తనకు తల్లడిల్లిపోతున్నారు.


ఉచిత కాల్‌సెంటర్‌.. నెలలో ఒకరోజు కౌన్సెలింగ్‌

ఇలాంటి సమస్యలను నిరంతరం గమనించే వారు మానసిక వైద్య నిపుణులు. అంతే కాకుండా దీనికి సంబంధించిన పరిష్కారం కూడా కచ్చితంగా వారికే తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో పిల్లల మానసిక సమస్యలకు నేరుగా పిల్లలకే కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. కానీ  కొన్ని సార్లు తల్లిదండ్రులకు వారి పిల్లల్లో మార్పునకు సూచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సరైన సమయానికి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు గానీ మానసిక నిపుణులను సంప్రదించాలన్న విషయమే గుర్తురాకపోవచ్చు, తెలియని వారూ ఉండవచ్చు. అప్పుడు జరిగే నష్టం తిరిగి పూడ్చలేనిది. అయితే నిరంతరం మానసిక సమస్యలకు పరిష్కారాలు చూపే నగరానికి చెందిన 150 మంది మానసిక నిపుణులు  వైద్యాన్ని మరింత దగ్గర చేయాలనుకున్నారు. దీనికి అనుగుణంగానే కొండాపూర్‌లోని సుదిశ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో ‘మిత్ర’ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఫోన్‌ ద్వారా సేవలందించేందుకు ఉచిత టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా నెలలో ప్రతి మొదటి శనివారం వ్యక్తిగత కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌ను నగరంలోని అన్ని పాఠశాలలకు అందిస్తున్నారు.


ప్రథమ చికిత్సలా  పని చేస్తుంది.. 

 ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ఒక మానసిక నిపుణులు అవసరం. మానసిక నిపుణుల కొరత, కొన్ని ఇతర సమస్యలతో ఈ నిబంధన అమలయ్యే అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు పిల్లలకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఎవరికైనా చెప్పుకొని  ధైర్యం పొందాలన్నా ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అలాంటి వారికి పూర్తి స్థాయిలో మానసిక వైద్యం కాకపోయినా కౌన్సెలింగ్‌తో కొంత ఊరట కల్పించవచ్చు.


షిఫ్టుల వారీగా సేవలు

 ఈ వైద్యుల బృందం షిఫ్టుల వారీగా అందుబాటులో ఉండనున్నది. ప్రతి రెండు గంటలకు షిఫ్టులు మారుతూ తమ వద్దకు వచ్చే వారికి, తమకు వచ్చే కాల్స్‌కు స్పందిస్తూ చిన్నారుల మానసిక సమస్యలు దూరం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా చిన్నారుల సమస్యలపైనే దృష్టి పెట్టనున్నారు. 


అవగాహన అవసరం.. 

మానసిక సమస్యలకు నిపుణులను సంప్రదించాలన్న అవగాహన మన దగ్గర చాలా మందిలో ఉండదు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మేము అనేక చోట్ల ఒకే సారి ఉచితంగా వందల మందికి చాలా సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. చిన్నారులు, వారి తల్లిదండ్రులకు వైద్యాన్నిమరింత దగ్గర చేయాలనుకున్నాం. అందులో భాగంగానే ఈ ఆలోచన వచ్చింది. 

-డాక్టర్‌ చల్లా గీత, మిత్ర కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫౌండర్‌logo