శనివారం 28 మార్చి 2020
Medchal - Feb 04, 2020 , 03:48:48

అందాల రహదారి

అందాల రహదారి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరంగల్‌ జాతీయ రహదారి వెంట పచ్చని అందాలు కనువిందు చేయనున్నారు. ఔటర్‌ రింగు రోడ్డు నుంచి యాదాద్రిగుట్ట ప్రధాన రహదారి వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర సెంట్రల్‌ మీడియన్‌లో భారీ ఎత్తున మొక్కలు నాటేందుకు హెచ్‌ఎండీఏ అర్భన్‌ఫారెస్ట్రీ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న తరుణంలో నగరం నలుమూలల నుంచి యాదాద్రికి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రయాణం సాగేలా సెంట్రల్‌ మీడియన్‌కు పచ్చని అందాలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హరితహారం పథకం ఇన్‌చార్జి ప్రియాంక వర్గీస్‌ సెంట్రల్‌ మీడియన్‌ను మరింత గ్రీనరీతో ముస్తాబు చేయాలని హెచ్‌ఎండీఏ అర్భన్‌ ఫారెస్ట్రీ విభాగం డైరెక్టర్‌ శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పనులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అర్భన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు ఇప్పుడున్న మొక్కలతో పాటు అదనంగా పొగడ, గన్నేరు, దురంద, అకాలిఫా, ఇనేర్మి, ఫడరన్‌ తదితర మొక్కలను నాటి పచ్చని తోరణంగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 30 కిలోమీటర్ల మేర దాదాపు ఐదు కోట్ల మేర  సెంట్రల్‌ మీడియన్‌ పనులకు టెండర్లను పిలిచారు. ఇదే సమయంలో ఈ పనులకు నేషనల్‌ హైవే అధికారుల అనుమతి లభించింది. ఈ వారంలో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టనున్నామని అర్భన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు తెలిపారు. 


మరో రెండు చోట్ల..

బాపుఘాట్‌ తపోవనం పార్కులో మరింత గ్రీనరీ పనులకు అర్భన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. తపోవనం ఆవరణ నిర్వహణలో భాగంగా ఈ గ్రీనరీ పనులకు, వీటితో పాటు ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీలో గ్రీనరీ అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ వారంలో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి పచ్చదనం మరింత పెంపొందించనున్నామని అధికారులు పేర్కొన్నారు.  logo