శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medchal - Feb 02, 2020 , 01:17:36

సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి

సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి
  • పార్కుల అభివృద్ధికి చర్యలు
  • జపాన్‌ తరహాలో మొక్కల పెంపకం
  • రెండు నెలల్లో క్రీడా మైదానాలు సిద్ధం
  • జోన్‌కు 500 టాయిలెట్లు
  • బల్దియా సమీక్షలో పురపాలక మంత్రి కేటీఆర్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. నగరాభివృద్ధి, సుందరీకరణ పనుల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా జోనల్‌ కమిషనర్లదేనన్నారు. నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన ప్రస్తుత తరుణంలో పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. బల్దియాలోని పార్కుల స్థితిపై సమగ్ర నివేదికను రూపొందించాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలపై శనివారం బుద్ధభవన్‌లో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.


ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేయాలని మంత్రి కే.టీ.ఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజల్లో ఆరోగ్య అంశాల్లో చైతన్యం పెరిగినందున అందుకు అనుగుణంగా వాకర్స్‌ కోసం ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. రైట్‌ టూ వాక్‌  అనే భావనకు అనుగుణంగా ఫుట్‌పాత్‌లుండాలని స్పష్టంచేశారు.  జీహెచ్‌ఎంసీ అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలపై శనివారం బుద్ధభవన్‌లో మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి,  టాయిలెట్ల నిర్వహ ణ, ఆటమైదానాల  అభివృద్ధి, పాదచారుల వంతెనల నిర్మాణం, అంతర్గత రోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై ఈ సందర్భంగా ఆయన జోన్లవారీగా చర్చించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణలను అరికట్టాలని, ఎక్కడికక్కడ వెండింగ్‌ జోన్లను అభివృద్ధి చేయాలని కోరారు. 


నగరాభివృద్ధి, సుందరీకరణ పనుల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా జోనల్‌ కమిషనర్లదేనన్నారు. లేఔట్‌ ఖాళీస్థలాల్లో పచ్చదనాన్ని పెంపొందించాలని, నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన ప్రస్తుత తరుణంలో లంగ్‌స్పేస్‌ను అభివృద్ధిచేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. నగరంలోని పార్కుల స్థితిపై సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. పార్కులను వాటి విస్తీర్ణం బట్టి విభజించి నిర్వహణను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న పార్కుల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు జపాన్‌ మియావాకీ ప్లాంటేషన్‌ (జపాన్‌లో తక్కువ విస్తీర్ణంలో వత్తుగా దట్టమైన అడవి మాదిరిగా మొక్కలు నాటే విధానం)  చేపట్టాలన్నారు. ఫ్లైఓవర్ల కింద పచ్చదనం పెంచేందుకు చొరవచూపాలన్నారు. ఇందిరాపార్కులో నిర్మిస్తున్న పంచతత్వ పార్కు విధానాన్ని అన్ని ముఖ్యమైన పార్కుల్లో ప్రభుత్యేతర సంస్థలు, వ్యక్తుల సహకారంతో చేపట్టాలన్నారు. 


అర్బన్‌ ఆర్ట్స్‌  ఫోరం  ఏర్పాటు 

సీఎం కేసీఆర్‌ ఆకాంక్షల ప్రకారం నగరంలో పచ్చదనాన్ని  పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అర్బన్‌ ఆర్ట్స్‌ ఫోరం/కౌన్సిల్‌ను నెలకొల్పాలన్నారు. పార్కులను సందర్శించేవారి సౌకర్యార్థం తగిన వసతులను కల్పించడంతోపాటు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు, లైటింగ్‌ను ఏర్పాటుచేయాలని, సెక్యూరిటీ గార్డులను నియమించాలని, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి ఏఏ పార్కులు అనువుగా ఉన్నాయో గుర్తించి నివేదిక ఇవ్వాలని, వచ్చే రెండు నెలల్లో ఒక్కో జోన్‌లో 500 చొప్పున టాయిలెట్లు నిర్మించాలని స్పష్టంచేశారు. పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనుల్లో సలహాలు, సూచనలు తీసుకునేందుకు నగరంలో 40మంది ఆర్కిటెక్చర్‌లతో ప్రత్యేకంగా చర్చించాలన్నారు. ఈ అంశంలో అన్ని జోన్లలోని పెద్దపెద్ద సంస్థలు, కంపెనీలు చూపుతున్న ఆసక్తిని కార్యరూపంలోకి తెచ్చేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రజలు, సంస్థలు పార్కులను అభివృద్ధి చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. 


స్కూలు పిల్లల భద్రతకు.. 

రోడ్డు ప్రమాదాల నివారణకు పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో పిల్లలు రోడ్లపైకి రాకుండా ఫుట్‌పాత్‌లకు గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు దోహదపడే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రధాన జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్‌ బారికేడింగ్‌ ఏర్పాటురేయాలని, రోడ్లపైకి సెల్లార్‌ ర్యాంపులను అనుమతించరాదన్నారు. రోడ్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గ్రీనరీపై ప్రజల్లో సానుకూల ప్రభావాన్ని కలిగించేందుకు ఆయా పనులకు సంబంధించిన ఫొటోలను ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌లో పోస్ట్‌ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. 


పిల్లలను సెల్‌ఫోన్‌ ప్రభావం నుంచి బయటకుతేవాలి 

 స్కూలు పిల్లలు సెల్‌ఫోన్‌కు అలవాటుపడి శారీరక శ్రమ, వ్యాయామానికి దూరమవుతున్నారని పేర్కొంటూ వారిని ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు జీహెచ్‌ఎంసీకి చెందిన అన్ని ఆట మైదానాల్లో క్రీడలు నిర్వహించేందుకు, శిక్షణనిచ్చేందుకు తగిన వసతులు కల్పించాలని మంత్రి కోరారు. నగరంలో దాదాపు 1100 ఆటమైదానాలు ఉన్నట్లు పేర్కొంటు, వచ్చే రెండు నెలల్లో అన్ని క్రీడా మైదానాల్లో లైటింగ్‌, టాయిలెట్లు, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, షటిల్‌ కోర్టుల ఏర్పాటు పూర్తికావాలని మంత్రి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి జోన్‌లోని పార్కులు, క్రీడా మైదానాల్లో కనీసం 10 కిలోమీటర్లమేర సైక్లింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. అంతేకాకుండా ఆట మైదానాలు, పార్కుల్లో కల్పించే వసతులపై కాలనీవాసుల్లో అవగాహన కల్పించడంతో పాటు నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, అదనపు కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


logo