గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Feb 02, 2020 , 00:58:32

బస్తీ గోడలకు.. భలే అందాలు

బస్తీ గోడలకు.. భలే అందాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఫిలింనగర్‌.. ఈ పేరు వింటే ఇక్కడ అంతా సినిమాస్టార్లు.. సంపన్నులే ఉంటారనుకుంటారు. ఇదో పెద్ద వీఐపీ జోన్‌గా భావిస్తారు. కాని అక్కడ ఉండేది సింహభాగం బస్తీలే. నివసించేది బీద బిక్కి జనాలే. ఒకప్పుడు గుడిసెలు.. రేకులషెడ్డుతో ఉన్న బస్తీలన్నీ ఇప్పుడు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. భవనాలకు సరికొత్త రంగులద్దుకుని తళతళలాడనున్నాయి. ఆకర్షణీయమైన పేయింట్స్‌తో ఆకట్టుకోనున్నాయి. ‘మిసాల్‌ హైదరాబాద్‌' పేరుతో ఫీనిక్స్‌, రూబెల్‌ నాగి ఆర్ట్‌ ఫౌండేషన్‌లు బస్తీల్లోని ఇండ్లగోడలకు రంగులద్దనున్నాయి. ఫిలింనగర్‌లోని బాబుజగ్జీవన్‌రామ్‌నగర్‌ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శనివారం ఫిలింనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (రౌండ్‌టేబుల్‌)లో జరిగిన సమావేశంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రముఖ సినీదర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ, ఫీనిక్స్‌, రూబెల్‌ నాగి ఆర్ట్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొని గోడలకు రంగులేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు హైదరాబాద్‌ను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారని, రూబెల్‌ నాగి ఆర్ట్‌ ఫౌండేషన్‌ చేపట్టిన కార్యక్రమం సైతం ఇందుకు దోహదం చేస్తుందన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇంటికి రంగులేయడం అంటే మన జీవితాన్ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుకోవడమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు నీలేశ్‌జైన్‌, శ్రీకాంత్‌, అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.


logo