గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Jan 31, 2020 , 01:08:34

‘మూసీ’ పునరుజ్జీవానికి మహా కసరత్తు

‘మూసీ’ పునరుజ్జీవానికి మహా కసరత్తు
  • సమూల ప్రక్షాళనకు సిద్ధమైన ప్రభుత్వం
  • పరీవాహక ప్రాంత అభివృద్ధికి రూ.13,479 కోట్లు
  • నక్కవాగు శుద్ధి కోసం రూ.2,404 కోట్లు
  • కొత్తగా 65 మురుగు శుద్ధి కేంద్రాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జలమండలి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద నదీ పరీవాహక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు కేంద్ర జలశక్తి అభియాన్‌, ఎన్‌ఆర్‌సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి ) పథకాల కింద 60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే మూసీ ప్రక్షాళనకు పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధి కేంద్రాలు, మురుగు నీటిని ఎస్టీపీలకు మళ్లించేందుకు భారీ ట్రంక్‌ సీవర్‌, సబ్‌మెయిన్స్‌, పైపులైన్ల ఏర్పాటు, సుందరీకరణ పనులు, ఈటీపీల నిర్వహణపై దృష్టి సారించారు. ఇందుకోసం రూ. 13, 479 కోట్ల అంచనాలతో ప్రతి పాదనలు సిద్ధం చేశారు.                                                                                                                                   


మూసీకి మళ్లీ జీవం పోయనున్నారు. కాలుష్యం బారినపడి కుదేలవుతున్న నదిని సమూలంగా ప్రక్షాళన చేయనున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభమైంది. పునరుజ్జీవ చర్యల కోసం, సుందరీకరణ పనుల కోసం 13,479 కోట్ల వ్యయంతో జలమండలి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద మొత్తం నదీ పరివాహక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పథకాలకు కేంద్ర జలశక్తి అభియాన్‌, జాతీయ నదీ పరిరక్షణ-అభివృద్ధి(ఎన్‌ఆర్‌సీడీ) పథకాల కింద 60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్‌ఆర్‌సీడీ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నగరంలో బుధ, గురువారం రెండురోజులు పర్యటించారు. ఖైరతాబాద్‌ సంస్థ జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ దానకిశోర్‌, ఈడీ డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, ఇతర అధికారులతో రాజీవ్‌ రంజన్‌ తొలుత భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళనకు పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధి చేసే కేంద్రాలు, మురుగునీటిని శుద్ధిప్లాంట్లకు మళ్లించేందుకు భారీ ట్రంక్‌ సీవర్‌, సబ్‌ మెయిన్స్‌, పైపులైన్లు ఏర్పాటు చేయడం, సుందరీకరణ పనులు చేపట్టడం, మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఈటీపీల నిర్వహణ తదితర పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. 


త్వరలోనే స్పష్టత.. 

మూసీ సుందరీకరణతోపాటు మంజీరా పరివాహక పరిధిలో 2404 కోట్లతో చేపట్టనున్న నక్కవాగు ప్రక్షాళనపై, 2329 కోట్లతో ప్రతిపాదించనున్న కూకట్‌పల్లి నాలా క్యాచ్‌మెంట్‌ ఏరియా ప్రక్షాళన సాధ్యాసాధ్యాలపై అధికారులు చర్చించారు. ఈ భారీ ప్రక్షాళన పథకాలకు ఎన్‌ఆర్‌సీడీ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉండడంతో త్వరలోనే వీటికి మోక్షం లభించనుందని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఒకట్రెండు రోజుల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌తో రాజీవ్‌ రంజన్‌మిశ్రా సమావేశం కానున్నారని తెలిసింది. అది పూర్తైతే జలమండలి అధికారులు ఢిల్లీ వెళ్లి జలశక్తి అభియాన్‌ ఉన్నతాధికారులను కలిసి ఈ ప్రాజెక్టు అమలుపై మరింత స్పష్టత తీసుకురానున్నట్లు సమాచారం. 


రోజూ 180కోట్ల లీటర్ల మురుగు.. మూసీలోకి..

ఔటర్‌ రింగురోడ్డు పరిధిలోని గ్రామాలతోపాటు జీహెచ్‌ఎంసీలోని నివాస, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 180కోట్ల లీటర్ల మురుగు మూసీ నదిలో కలుస్తున్నది. ఇందులో కేవలం 70కోట్ల లీటర్లు మాత్రమే శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగిలినదంతా పలు పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నివాస ప్రాంతాల నుంచి శుద్ధి కాకుండానే నేరుగా మూసీలోకి చేరుతుండడంతో నది మురికి కూపంగా మారింది. 


కొత్తగా 65 ఎస్టీపీలు.. 

ఈ కాలుష్యాన్ని నివారించి మూసీని రక్షించేందుకు సరికొత్తగా 65 మురుగు శుద్ధి కేంద్రాల(ఎస్టీపీల)ను నిర్మించనున్నారు. తద్వారా అదనంగా 170 కోట్ల మురుగు శుద్ధి చేసేలా శుద్ధి వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. మూసీ పరివాహక ప్రాంతంలో 10, జీహెచ్‌ఎంసీలోని చెరువుల వద్ద 30, జలమండలి నిర్ధేశించిన ప్రాంతాల్లో 5, ఇతర ఎంపిక చేసిన స్థలాల్లో ఎనిమిదింటిని ఏర్పాటు చేయనున్నారు. మూసీ వెంట ఎస్టీపీ నిర్మాణానికి 17.5 హెక్టార్ల ప్రభుత్వం స్థలం అనువుగా ఉందని తేల్చారు. చెరువుల వద్ద 42 చోట్లకుగానూ 70 హెక్టార్ల విస్తీర్ణంలో ఎస్టీపీ నిర్మాణాలకు అనువుగా ఉందని గుర్తించారు.logo
>>>>>>