శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Jan 31, 2020 , 00:52:38

సేవలు ఆగొద్దు

సేవలు ఆగొద్దు
  • దరఖాస్తు ఫారాలతో ముడి పెట్టొద్దు
  • ఆర్టీఏ సేవలపై ఉన్నతాధికారుల నిర్ణయం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సేవల కోసం వచ్చే వినియోగదారులను ఇబ్బందిపెట్టే ఎటువంటి చర్యకు తావివ్వకూడదనే ఆదేశాలు జారీ అయ్యాయి. దరఖాస్తు దారులకు ఏదైనా ఫారాలు లేకపోయినా సేవలు తిరస్కరించ వద్దని ఆదేశాలు అందాయి. ఎవరైనా తిరస్కరించినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరికను ఉన్నతాధికారులు పంపారు. ఫారం 1, 2, 9, 29.30 ఇలా సేవకో ఫారాలు నింపి సేవల కోసం వచ్చే వాహనదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉంటేనే రవాణాశాఖలో సేవలందుతాయి. లైసెన్సు తీసుకోవాలన్నా.. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వెళ్లినా, హైర్‌ పర్చేస్‌ టెర్మినేషన్‌ అయినా, మైనర్‌కు లైసెన్సు కావాలని కోరినా ప్రతీ సేవకు ఫీజు, వ్యక్తికి సంబంధించిన అడ్రస్‌ ప్రూఫ్‌, గుర్తింపు కార్డు వంటి ఆధార్‌కార్డుతోపాటు రవాణాశాఖ నిర్ధేశించిన ఫారాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నేరుగా రవాణాశాఖ సేవలు పొందాలనుకుని స్లాట్‌ బుక్‌ చేసుకుని వచ్చే వారికి కార్యాలయాల్లో సిబ్బంది చుక్కలు చూపెడుతున్నారు. ఫారాలు లేవని దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. ఎప్పుడో ఒక్కసారి వచ్చే వినియోగదారుడికి ఫారాలు ఎక్కడ దొరుకుతాయో తెలియక ఆందోళన చెందడం.. 


వీటిని సేకరించే పనిలో ఉండగానే సమయం మించి పోతుండటంతో స్లాట్‌ బుక్‌ చేసుకున్న సమయంలో రవాణాశాఖకు చెల్లించిన ఫీజు సేవలు పొందకుండానే వృథాగా పోతున్నది. మళ్లీ స్లాట్‌ బుక్‌ చేసుకుంటే మళ్లీ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సిబ్బంది, అధికారుల పోరు పడలేక దళారుల ద్వారా సేవలు పొందాల్సి వస్తున్నది. రోజువారీగా అధికారులు, సిబ్బందితో టచ్‌లో ఉండే వాహన షోరూం ప్రతినిధులు, దళారులు, సంఘాల నేతలకు మాత్రమే ఈ ఫారాల వ్యవహారంపై అవగాహన ఉంటున్నది. మొదటిసారిగా, ఎప్పుడో ఒకసారి కార్యాలయానికి సేవల కోసం వెళ్లేవారికి వీటి వ్యవహారం తెలియక నష్టపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఫారాలు లేకుంటే తిరస్కరించవద్దని, సేవల కోసం వచ్చే వినియోగదారుడు చెల్లించిన ఫీజుతోపాటు సమయాన్ని వృథాచేయకుండా సేవలందించాలని సూచించారు. అవసరమైతే రవాణాశాఖ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఫారాలు తెప్పించి ఇవ్వాలని సూచించారు.


logo