సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Jan 30, 2020 , 00:52:22

35,741 గుంతలు పూడ్చేశాం

35,741 గుంతలు పూడ్చేశాం
  • 30 నీటి నిల్వ ప్రాంతాల్లో మరమ్మతులు
  • బల్దియా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. 2019 జూన్‌1 నుంచి ఈనెల 25 వరకు ఆరు నెలల కాలం లో 35,741గుంతలను పూడ్చినట్లు వివరించారు. నాలాలు కుచించుకుపోయిన చోట విస్తరణ చేస్తామని, వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లను సరిచేసేందుకు హాట్‌మిక్స్‌ చేసిన బీటీ మెటీరియల్‌ను ఇన్‌స్టంట్‌ రిపేర్‌ టీమ్స్‌ ఆధ్వర్యంలో గుంతలపై నింపుతున్నట్లు తెలిపారు. 


వాహనదారుల ఇబ్బందులను అరికట్టేందుకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌.లోకేశ్‌కుమార్‌ తెలిపారు. 2019 జూన్‌ 1వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఆరు నెలల కాలంలో 35,741 గుంతలను పూడ్చి వేసినట్లు వివరించారు. నాలాలు కుచించుకుపోయిన చోట ఆయా ప్రాంతాల్లోని ఆస్తులను సేకరించి నాలాల విస్తరణ చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా వర్షపునీరు సులభంగా వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే సరి చేసేందుకు జీహెచ్‌ఎంసీకి సొంతగా ఒక హాట్‌మిక్స్‌ ప్లాంట్‌ ఉన్నదని తెలిపారు. దాని ద్వారా హాట్‌మిక్స్‌ చేసిన బీటీ మెటీరియల్‌ను ఇన్‌స్టంట్‌ రిపేర్‌ టీమ్స్‌ ఆధ్వర్యంలో గుంతలపై నింపుతున్నట్లు తెలిపారు. వర్షాకాలం తర్వాత ఏర్పడిన గుంతలను ప్రీమిక్స్‌డ్‌ బీటీ మెటీరియల్‌తో ఎప్పటికప్పుడు మరమ్మతులను చేపడుతున్నట్లు చెప్పారు.


జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 9,103 కిలోమీటర్ల రోడ్లలో వర్షం నీరు సులభంగా వెళ్లేందుకు 1,298 కిలోమీటర్ల పొడవు స్ట్రాం వాటర్‌ డ్రెయిన్స్‌ వర్షాపాతాన్ని తట్టుకుంటుందని తెలిపారు. నాలాల విస్తరణతో గంటకు 4 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చినా ఇబ్బంది రాదని తెలిపారు. అయినప్పటికీ వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. తద్వారా కొన్ని గంటలపాటు ఆయా ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచినట్లు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి 30ప్రదేశాలను మేజర్‌ వాటర్‌ లాగింగ్‌ పాయింట్లుగా గుర్తించామని, వర్షాకాలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిలిచిన నీటిని పంపుసెట్ల ద్వారా బయటకు పంపించనున్నట్లు తెలిపారు.


logo