సోమవారం 30 మార్చి 2020
Medchal - Jan 30, 2020 , 00:49:16

ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో రెండు రోజులే

ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో రెండు రోజులే
  • మూడు నెలల్లో 4,922 అనుమతులు
  • పెండింగ్‌లో 22వేల దరఖాస్తుల పైమాటే
  • గడువు పొడిగింపుపై దరఖాస్తుదారుల ఆశలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో పెండింగ్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన గడువు సమీపిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్నది. గడిచిన మూడు నెలలుగా హెచ్‌ఎండీఏ పరిధిలోని పెండింగ్‌ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక మేళాలు, స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టారు. దరఖాస్తుదారులకు షార్ట్‌ఫాల్‌ సమాచారం అందించడంతోపాటు ఇరిగేషన్‌ ఎన్‌వోసీ, చెరువులు, ఎఫ్‌టీఎల్‌, న్యాయ వివాదాల్లో మినహా మిగిలిన దరఖాస్తుదారులన్నింటికీ పరిష్కారం చూపారు. ఇందులో భాగంగానే 12వేల దరఖాస్తుదారులకు షార్ట్‌ఫాల్‌ పూర్తి చేయాలంటూ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందజేశారు. 10వేల మంది ఫీజు చెల్లించాల్సి ఉందని, తుది గడువులోగా చెల్లించాలంటూ సమాచారం అందించినా బుధవారం వరకు ఆశించిన స్పందన రాలేదు. ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించే వారు చెల్లించాలని, షార్ట్‌ఫాల్‌ సమర్పించిన దరఖాస్తులకు పరిష్కారం చూపుతామని అధికారులు చెబుతున్నారు. నిర్ణీత గడువు ముగియగానే ఏ ఒక్కటి పరిగణనలోకి తీసుకోబడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు, పండుగలను దృష్టిలో ఉంచుకుని గడువును మరోసారి పెంచాలని దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, మిగిలిన పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరిస్తే హెచ్‌ఎండీఏకు మరో రూ.10 కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


logo