మంగళవారం 31 మార్చి 2020
Medchal - Jan 29, 2020 , 04:10:54

ఆఫీసు వేళల్లో దూసుకెళ్తున్నారు

ఆఫీసు వేళల్లో దూసుకెళ్తున్నారు
  • - ఆలస్యం కాకూడదని అతి వేగంగా పరుగుతీస్తున్నారు
  • - ఉదయం 8 తర్వాత పెరిగిపోతున్న ‘ఓవర్‌స్పీడ్‌'
  • - కొంపముంచుతున్న ‘ఓవర్‌టేక్‌' యత్నాలు
  • - ప్రాణాలు తీస్తున్న తొందరపాటు డ్రైవింగ్‌
  • - చిన్న నిర్లక్ష్యాలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు
  • - 97శాతం ప్రమాదాలు...మన తప్పిదాల వల్లే
  • - రహదారులపై క్రమశిక్షణే.. శ్రీరామరక్ష

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వాహనదారులు టైంతో పరుగెత్తకూడదని, దానితో పరిగెడితే మన టైం అయిపోతుందని, రహదారులపై క్రమశిక్షణే..శ్రీరామరక్ష అని ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉదయం 8.30 నుంచి 9వరకు, ఆ తర్వాత 9 నుంచి 11 గంటల వరకు వాహనదారులు తొందరపాటుకు గురవుతున్నారు. ఈ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ఈ సమయంలో రోడ్లపై వాహనదారుల రాకపోకలు గమనిస్తే ఒళ్లు ఝల్లుమంటుంది. స్కూ ల్‌, కాలేజీ, ఆఫీసుకు ఆలస్యమవుతుందని అతి వేగంగా వెళ్తూ ప్రాణాలు కోల్పోవడంతోపాటు కుటుంబాలను కూడా రోడ్డున పడేస్తున్నారు. తొందర మంచిదికాదని ట్రాఫిక్‌ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వాహనదారుల్లో మార్పురావడం లేదు. 


ఒక్క క్షణంలోనే రోడ్డు ప్రమాదం.. క్షణంలోనే ప్రాణాలు గాల్లో కాలుస్తున్నాయి.. ఆ ఒక్క క్షణం ఆగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అవకాశముంటుంది. అయితే దాని గూర్చి ఆలోచించకపోవడంతో ఆ క్షణం ప్రాణాలు తీసేస్తుంది. ప్రతి రోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 97 శాతం మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయి. అంటే కేవలం 3 శాతం ప్రమాదాలు మాత్రమే రోడ్డు ఇంజినీరింగ్‌, ఇతరాత్ర కారణాలతో జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులలో మార్పు తీసుకొచ్చేందుకు ట్రాఫిక్‌ విభాగం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, హైదరాబాద్‌ రోడ్లను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాహనదారులలో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడుతున్నా.. ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రావడం లేదు. అందుకు కారణం వాహనదారుల తప్పిదాలే ప్రధాన కారణమవుతున్నాయి. వేగం వద్దంటూ ఎంత చెప్పినా.. కార్యాలయానికి త్వరగా వెళ్లాలనో... సాయంత్రం కార్యాలయం నుంచి ఇంటికి త్వరగా రావాలనే ఉద్దేశ్యంతో వెళ్లే సమయాలలో  ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్‌ కారణంగానే 85 శాతం వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2019లో జరిగిన రోడ్డు ప్రమాద మరణాలలో 271మంది మరణించారు.


కేవలం మన తప్పిదాలే..!

రోడ్డు ప్రమాదాలు మన తప్పిదాలతోనే జరుగుతున్నాయి.. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఉండడంతో ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏ ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయాలను ట్రాఫిక్‌ పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలో సీసీ కెమెరాల పుటేజీలను ప్రధాన సాక్ష్యాలుగా సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు సమయంలోనూ లా అండ్‌ అర్డర్‌ పోలీసులు కూడా ఇవే అంశాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్‌, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌, త్రిబుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, వాహన ఫిట్‌నెస్‌ సరిగ్గా లేకపోవడం, హెల్మెట్‌ లేకపోవడం, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడం వంటివి కారణమవుతున్నాయి. ఇలాంటి నిబంధనలను సక్రమంగా పాటిస్తే  భారీ సంఖ్యలో ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశాలుంటాయి. వాహనదారులు తమకు తాముగా ట్రాఫిక్‌ నిబంధనలు తప్పని సరిగా పాటించాలి. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించడంతో ఇలాంటి ఉల్లంఘనలు ఉండవు.. దీంతో ప్రమాదాలు తగ్గుతాయి. 


అప్రమత్తతోనే నివారణ 

ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.. ఏ వాహనదారుడు కూడా కావాలనే ఉద్దేశ్యంతో ప్రమాదం చేయడు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడంతో రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు అవాకాశముంటుంది. అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, నిర్లక్ష్యం డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ఇంజినీరింగ్‌, వాహనాల మెకానిజం లోపాలతో జరిగే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. వాహనాన్ని నడిపే డ్రైవర్‌ నిరంతరం అప్రమత్తంగా ఉండడంతోనే ప్రమాదాలు జరుగవు.

- కరుణాకర్‌, అదనపు డీసీపీ, ట్రాఫిక్‌ 


2019లో 2493 రోడ్డు ప్రమాదాల కేసులు

- రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో 210 కేసులు

- తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో 146  కేసులు

- ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్యలో 258 కేసులు

- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో 404 ప్రమాదాలు జరిగాయి.


సాయంత్రం వేళలో...

- మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో 363 కేసులు

- మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో 386 కేసులు

- సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో 404 కేసులు

- రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో 322 కేసులు నమోదయ్యాయి. 


అటూ ఇటూ చూసి.. రోడ్డెక్కండి..!

ట్రాఫిక్‌ లైట్ల గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే బండి ముందుకు వెళ్లాలి.. రెడ్‌ పడగానే ఆగాలి.. కాలనీలు, బస్తీలలో నుంచి ప్రధాన రోడ్డుపైకి వచ్చే వాహనాలు ఒక్క క్షణం ఆటూ.. ఇటూ చూసుకొని ప్రధాన రోడ్డులోకి రావాలి.. ముందుగా వెళ్తున్న వాహనం పక్కకు వెళ్తుంటే ఇండికేటర్‌ వాడడంతో వెనుక ఉండే వాహనదారుడు సరైన రీతిలో వెళ్తాడు.. ఒక వాహనానికి మరో వాహనానికి కొంత దూరంలో వాహనం నడుపాలి. మనం బ్రేక్‌ వేస్తే ఆ వాహనం వెంటనే ఆగే విధంగా డ్రైవింగ్‌ చేసే వ్యక్తి ఆ దూరంలో వెళ్తుండాలి. ఇవన్నీ వాహనదారుడికి తెలిసినా.. ఆ క్షణంలో అన్ని మరిచిపోతారు. త్వరగా వెళ్లాలనే ధ్యాసలో కొన్ని సందర్భాలలో పొరపాటు పడుతుంటారు. అప్పుడే ప్రమాదాలు వచ్చిపడుతుంటాయి. ఇలాంటి సందర్భాలలో ఒకరి నిర్లక్ష్యం మరొకరి ప్రాణాలు తీస్తుంది. రోడ్డు దాటే పాదచారులు అటూ.. ఇటు చూడకుండానే రోడ్డు దాటాలనే అతృతలో వెళ్తుంటారు. ఆ సమయంలో వేగంగా వచ్చే వాహనదారుడు తన వాహనాన్ని అదుపు చేయలేక ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడంతో ఇద్దరికీ ప్రమాదం సంభవిస్తుంది. 


ఆ సమయంలోనే ఎందుకు..!

ఉదయం కార్యాలయాలకు, వ్యాపారాలకు, విద్యాలయాలకు వెళ్లే వారితో నగరంలోని రోడ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. అలాంటి సమయంలోను కొందరు వేగంగా వెళ్లాలనే ప్రయత్నంలో ఉంటారు. తమ గమ్యాన్ని చేరుకోవడానికి వాహనాన్ని వేగంగా నడిపేందుకు తమకున్న అవకాశాలన్నీ వాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఉదయం, సాయంత్రం వెళల్లో ఉండే రద్దీలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నగరంలో ఉండే ట్రాఫిక్‌ దృష్ట్యా ఉదయం ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో ఒక పది నిమిషాల ముందు వెళ్లడంతో.. కార్యాలయానికి నిర్ణీత సమయంలో చేరుకోవడానికి అవకాశముంటుంది. అదే పది నిమిషాలు ఆలస్యంగా వెళ్తే.. సమయం మించిపోతుందని ఆగమాగమవుతూ వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. వాహనాన్ని వేగంగా నడిపేకంటే నిర్ణీత స్పీడ్‌తో వెళ్లడం వల్ల ప్రమాదం జరిగే అవకాశమున్నా తప్పించుకునేందుకు అవకాశాలుంటాయి.. 


ఈ పరేషాన్‌ తీరాలంటే...

ప్రతి వాహనదారుడు క్రమశిక్షణతో వాహనాలను నడపాలి. ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించాలి. వారు ప్రయాణించే గమ్యాన్ని అంచనా వేసుకోవాలి. ఆ సమయానికి ముందే బయలుదేరి టైంకు గమ్యానికి చేరుకోవాలి. ఓవర్‌టేక్‌లు చేయొద్దు. వాహనాన్ని పరిమితి వేగంతో నడపాలి. రోడ్లపై జిగ్‌జాగ్‌లో వెళ్ళకూడదు. స్కూల్‌, కాలేజీలకు వెళ్ళే వారు కూడా సమయానికి ముందు బయలు దేరాలి. ఆఖరి నిమిషంలో బయలుదేరి సమయంతో పోటీ పడొద్దు. 

- దివ్యచరణ్‌రావు, డీసీపీ రాచకొండ ట్రాఫిక్‌ విభాగం.


చిన్న నిర్లక్ష్యంతోనే కుటుంబానికి దూరం

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.. చిన్న పాటి నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకరు చేసే తప్పునకు మరొకరు బలికావల్సి వస్తున్నది. ట్రాఫిక్‌ నిబంధనలు తప్పని సరిగా పాటించడంతో ప్రమాదాలు నివారించవచ్చు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వాడడం, పాదచారులు రోడ్డు దాటే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం, త్వరగా వెళ్లాలని వాహనం స్పీడ్‌ పెంచుతూ వెళ్లుంటారు. 

- దోసపాటి రాము, ఐ యామ్‌ నాట్‌ ఇడియట్‌, ఐ ఫాలో ట్రాఫిక్‌ రూల్స్‌, వెబ్‌సైట్‌ వ్యవస్థాపకులు


logo
>>>>>>