శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medchal - Jan 25, 2020 , 03:18:43

శివారులో కూర్మావతారం

శివారులో కూర్మావతారం
  • - నందిగామలోని శాంతివనంలో తాబేలు ఆకారంలో ధ్యాన కేంద్రం
  • - 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
  • - ప్రపంచంలోనే అతి పెద్ద తపో కేంద్రం
  • - 40వేల మందికి ఆతిథ్యమిచ్చే క్యాంపస్‌
  • - 28న ప్రారంభించనున్న యోగా గురువు రాందేవ్‌ బాబా
  • - ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాక

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌.. షాన్‌ ఏ షహర్‌. శతాబ్దాల చరిత్రకు అనవాలు. జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరం పలు ప్రత్యేకతల సమాహారం. ఈ జాబితాలో మరో ప్రత్యేకత చేరబోతున్నది.  ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రంగా గ్రేటర్‌ శివారులోని నందిగామలో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో కన్హాశాంతివనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌ గైడ్‌ దాజీలు కన్హాశాంతివనాన్ని ప్రారంభించనున్నారు. ఒకే సారి లక్ష మంది ఉమ్మడిగా ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఈ మెడిటేషన్‌ సెంటర్‌ను నిర్మించారు. తాబేలు ఆకారంలో నిర్మించిన ఈ ధ్యానకేంద్రాన్ని హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ 75వ వార్షికోత్సవంలో భాగంగా నిర్మించగా, 28న ప్రారంభించనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ గ్లోబల్‌హెడ్‌ క్వార్టర్స్‌గా భావిస్తున్న ఈ శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా  ఒకేసారి 40వేల మంది ధ్యానం చేయనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ మొదటి గైడ్‌ లాల్జీకి ఈ ధ్యానకేంద్రాన్ని అంకితమివ్వనున్నారు.

ప్రసంగించనున్న రాష్ట్రపతి

కన్హా శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజుల చొప్పున మూడు విడుతల్లో పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. జనవరి 28 -30 వరకు, ఫిబ్రవరి 2-4 వరకు, ఫిబ్రవరి 7-9 వరకు మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో సుమారుగా 1.2 లక్షల మంది పాల్గొంటారని హార్ట్‌ఫుల్‌నెస్‌ గైడ్‌ దాజీ తెలిపారు. జనవరి 28న ధ్యానకేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత, 29న బాబా రాందేవ్‌ ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో పలు రాష్ర్టాల గవర్నర్లు సైతం పాల్గొంటారని దాజీ వెల్లడించారు. ఇక  ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌, ఫిబ్రవరి 7న సామాజిక కార్యకర్త  అన్నాహజారే సైతం పాల్గొని 75వ వార్షికోత్సవానికి హాజరైన వారినుద్ధేశించి ప్రసంగిస్తారన్నారు. మొత్తం 1400 ఎకరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఏర్పాటుకాగా, 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఒక సెంట్రల్‌హాల్‌, 8 సెకండరీహాల్స్‌ చొప్పున మొత్తం 9 హాల్స్‌ను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే  ముంబైలో 2వేల మందికి సరిపోయే ధ్యానకేంద్రముండగా, హైదరాబాద్‌లో నిర్మితమైన ధ్యానకేంద్రంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకోవచ్చు.

ఈ ధ్యానకేంద్రం రాత్రిపూట కాంతుల్లో తళుకుమనుతు సిడ్నీహార్బర్‌లా కనిపిస్తుంది. 40 వేల మందికి అతిథ్యమిచ్చే క్యాంపస్‌లో, రోజుకు లక్ష మం దికి భోజనాలు పెట్టే వంటగదులు, 350 పడకల సామర్థ్యం గల ఆయుష్‌ దవాఖాన, 6 లక్షల మొక్కలతో కూడిన నర్సరీలు ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. ఇటీవలీ నాలుగేండ్లల్లో సుమారుగా లక్ష మొక్కలు నాటగా, మలిదశ జీవితాన్ని ప్రశాంతంగా గడిపేవారికి ఈ ధ్యానకేంద్రం మంచి అవకాశంగా నిలుస్తుందని గైడ్‌ దాజీ అభిప్రాయపడ్డారు. ఈ ధ్యాన కేంద్రం మంచి లెర్నింగ్‌ సెంటర్‌గానే కాకుండా, ప్రశాంతత సమకూర్చే వనంగా సేవలందిస్తుందన్నారు.


logo