గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Jan 24, 2020 , 02:01:29

‘ఉద్యాన’ మేళా..

‘ఉద్యాన’ మేళా..
  • -ఆకట్టుకుంటున్న ఆల్‌ ఇండియా హార్టికల్చర్‌,అగ్రికల్చర్‌ షో
  • -5 రోజుల పాటు ప్రదర్శన
  • -పీపుల్స్‌ ప్లాజాలో కొలువుదీరిన మొక్కలు,ఉద్యాన సామగ్రిపచ్చదనం ఉట్టిపడేలా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :
 మొక్కల పెంపకంపై ఆసక్తి పెంపొందించేలా హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ షో నగరంలోని పీపుల్స్‌ ప్లాజాలో  ప్రారంభించారు. ‘ఆల్‌ ఇండియా హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ షో’ పేరిట గురువారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఐదురోజుల పాటు సాగనుంది. ఈ ప్రదర్శనలో చిన్న చిన్న మొక్కల నుంచి మొక్కలకు సంబంధించిన అనేక రకాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల మొక్కలు, వాటికి వాడే సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్‌ ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నగరంలో ఎక్కడా లభించని అరుదైన మొక్కలను, గార్డెన్‌ పెపంకంలో కావాల్సిన అనేక పనిముట్లు, అవసరాలు ఇక్కడ పొందేందుకు అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌ టెక్నాలజీకి చెందిన కుండీలు, కొత్త కొత్త గార్డెనింగ్‌ వస్తువులతో దాదాపు 150 స్టాళ్లు, ఆకర్షనీయంగా ఉండే పూల మొక్కలతో పాటు అనేక రకాల అరుదైన పండ్ల జాతుల మొక్కలను అందుబాటులో ఉంచేలా దాదాపు 75 నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు ఆరోగ్యానికి అవసరమయ్యే ఔషధ మొక్కలు, విత్తనాలు, ఇంటి లోపల అలంకరణకు పనికొచ్చే బోన్సాయ్‌  మెక్కలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ నుంచే కాకుండా డార్జిలింగ్‌, కోల్‌కతా, ఢిల్లీ , హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుండి వచ్చిన నర్సరీ నిర్వాహకులు, రైతులు తమ ఉత్పత్తులను, టెక్నాలజీని ప్రదర్శించారు.
సాంకేతిక జ్ఞానం
సందర్శకులు కేవలం మొక్కలను కొనేందుకే కాకుండా మొక్కల పెపంకానికి కావాల్సిన సాంకేతిక ఙ్ఞానాన్ని కూడా పొందేందుకు ఈ ప్రదర్శన అవకాశం కల్పిస్తుంది. తక్కువ ఖర్చు, నీరు, కరెంటు ఆదా చేసేందుకు కావాల్సిన అనేక రకాల దేశ విదేశీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు వివిధ రాష్ర్టాలకు చెందిన స్టాళ్ల నిర్వాహకులు. టెర్రస్‌ పైనా, వర్టికల్‌ గార్డెనింగ్‌, హైడ్రో పోనిక్‌ సిస్టం వంటి అనేక నూతన టెక్నాలజీలు ప్రత్యేక ఆకర్షనగా నిలిచాయి.
అందం-ఆరోగ్యం
వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు  ఆయుర్వేద, అరుదైన జాతుల ఆహార పదార్థాలను ప్రదర్శనకు ఉంచారు. మహబూబాబాద్‌కు చెందిన రైతు తన ప్రయోగాలతో పండించిన రక్తహీనతను తగ్గించే కంకులు, దాదాపు 10 రకాల విలువైన రకాల పసుపులతో చేసిన పసుపు అందరినీ ఆకర్షించాయి.

పచ్చదనాన్ని పెంపొందించాలి


- నగరంలో అనేక టెర్రస్‌లు ఉన్నాయి
-వాటిని కూరగాయల సాగుకు వినియోగించాలి
- హరితహారంతో పర్యావరణానికి ఊతం
- హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి

ఖైరతాబాద్‌ : కాలుష్యం పెరుగుతుంది.. ఆక్సిజన్‌ కరువవుతున్నది.. అందుకే పచ్చదనాన్ని పెంపొందించుకొని ప్రాణవాయు వును ఉత్పత్తి చేసుకోవాలని తెలంగాణ హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి సూచించారు. తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఎనిమిదో గ్రాండ్‌ నర్సరీ మేళాను కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి, నిర్వాహకుడు ఖలీల్‌ అహ్మద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో తెలంగాణ రాష్ట్రం హరితమయంగా మారుతుందన్నారు. హరితహారం కార్యక్రమాల ద్వారా కోట్లాది మొక్కలు జీవం పోసుకున్నాయన్నారు. నగరంలో 50 వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన టెర్రస్‌లు ఉన్నాయని, కుటుంబానికి కావాల్సిన ఆహార పదార్థాలను డాబాపైనే పండించుకోవచ్చన్నారు. ‘ఓన్‌ యువర్‌ ఆక్సిజన్‌.... ప్రొడ్యూస్‌ యువర్‌ ఆక్సిజన్‌ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిర్వహకుడు ఖలీద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఈ మేళాలో సుమారు వందకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. రూ.60 వేల నుంచి రూ. 3 లక్షల విలువైన  ఔషధ మొక్కలు  ప్రదర్శిస్తున్నామన్నారు. హర్యానా, సిలిగూడి, ఢిల్లీ, పుణెతో పాటు సింగపూర్‌, జపాన్‌, తైవాన్‌ దేశాలకు చెందిన గార్డెన్‌, ఇతర పుష్పజాతులు, మొక్కలను అందుబాటులో ఉంచామన్నారు.
logo