గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Jan 22, 2020 , 03:34:29

మళ్లీ తెరపైకి.. వాహన డీలర్ల అక్రమ దందా

మళ్లీ తెరపైకి.. వాహన డీలర్ల అక్రమ దందా


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మళ్లీ తెరపైకి వాహన డీలర్ల అక్రమ దందా వచ్చింది. గతంలో సెకండ్ వెహికల్ ట్యాక్స్ అవకతవకలతోపాటు  బీఎస్4 వాహనాల విక్రయం,రిజిస్ట్రేషన్ల వంటి అంశాల్లో ఆరోపణలు ఎదుర్కున్న షోరూంలు మరోసారి నిబంధనలు ఉల్లంఘించి దొరికిపోయారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ జేటీసీ పరిధితోపాటు రంగారెడ్డి డీటీసీ పరిధిలో టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు కొనసాగాయని స్వయంగా రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణకు ఆదేశించడంతో నాలుగురోజులుగా నగరంలోని అన్ని కార్యాలయాల ఆర్టీవోలు,ఎంవీఐలు షోరూంలలో తనిఖీలు చేపడుతున్నారు.ఉప్పల్ ఒక కారు ఇదే రకంగా టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండా అధికారులు చిక్కగా కారును సీజ్ చేసి కార్యాలయంలో ఉంచారు. అదే కోవలో హైదరాబాద్ జేటీసీ పరిధిలో ఒకప్రముఖ కంపెనీకి చెందిన హైఎండ్ కార్లను టీఆర్ లేకుండా విక్రయించినట్లు తేలింది.

ఐతే కమిషనర్ ఆదేశాలతో నగరంలోని ఆర్టీవోలు రాంచందర్, శ్రీనివాసరెడ్డి, సురేష్ దుర్గాప్రసాద్, సీపీ వెంకటేశ్వర్లు, రఘునందన్ సదానందంతోపాటు  ఎంవీఐలు విజయ్ గోవర్ధన్ టీవీ రావు, ఏఎంవీఐలు వాసు తదితరులు షోరూంల స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లి వాహన తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలు కలిసి దాదాపు 32 వాహనాలు టెంపరరీ రిజిస్ట్రేన్ లేకుండా వాహనాలను అందచేసినట్లు తెలిసింది. ఇందులో కోటి రూపాయల విలువగల వాహనాలు సుమారు 15 వరకు ఉన్నట్లు సమాచారం. టెంపరరీ రిజిస్ట్రేషన్లు లేకుండా వాహనాలను విక్రయించిన షోరూంల విషయంపై రవాణాశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టగా ఇందులో రెండు ప్రముఖ డీలర్ ఉన్నట్లు తేలింది. అందులో ఒక డీలర్ మాన్యుఫ్యాక్షరర్ రద్దు చేసినట్లు తెలిసింది. సదరు డీలరుకు రవాణాశాఖ నోటీసులు కూడా ఇచ్చినట్లు సమాచారం. షోరూంలకు వాహన రిజిస్ట్రేషన్లు బదిలీ చేయాలని రవాణాశాఖ భావిస్తున్న తరుణంలో వీరి లీలలు బయటపడటంతో రిజిస్ట్రేషన్ల పూర్తి బాధ్యత అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయంపై అధికారులు ఆలోచిస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

డీలర్ల వ్యవహారంతో ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశముందని రవాణాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో వాహనానికి దాని ధరలో14శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్ కట్టకుండా ప్రస్తుతానికి తిరిగినప్పటికీ ఎప్పటికైనా చెల్లించి తీరాల్సిందేనని అంటున్నారు. ఐతే టీఆర్ లేకుండా రోడ్డుపై తిప్పడమేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏదైనా అక్రమ వ్యాపారాలకు, దందాలకు నంబర్ ప్లేట్ లేకుండా వాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం చేసే డీలర్లు డబ్బుల కోసం కక్కుర్తి పడే అవకాశమే లేదని, దీని వెను క ఏదో మిస్టరీ ఉంటుందనే చర్చ రవాణాశాఖ అధికారుల్లో కనబడుతున్నది.

రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా ఈ అంశంపై సీరియస్ ఉండటంతో గ్రేటర్ వ్యాప్తంగా అన్ని షోరూంల వాహనాల స్టాక్ అండ్ డెలివరీ వివరాలతో కూడిన రిపోర్టును ఆర్టీవోలు అందిస్తున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే జేటీసీ పాండురంగనాయక్ రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్ కమిషనర్ ఆదేశాలతో ఆర్టీవోలు,ఎంవీఐలతో కూడిన బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు. స్వయంగా రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అత్యంత గోప్యంగా తనిఖీలు చేస్తున్నారు. షోరూంలలో ఇటువంటి దందా జరుగుతున్నప్పటికీ వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే తప్ప జరుగుతున్న విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని రవాణాశాఖ అధికారులు ధ్రువీకరించినప్పటికీ పేరు రాయడానికి ఉన్నతాధికారులు ఇష్టపడటం లేదు.




logo