బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Jan 21, 2020 , 00:53:18

50 ఫ్లాట్లు ఉంటే...శుద్ధి ప్లాంటు తప్పనిసరి

50 ఫ్లాట్లు ఉంటే...శుద్ధి ప్లాంటు తప్పనిసరి
  • -లేదంటే..‘ఆక్యుపెన్సీ’ ఇవ్వరు
  • - ఇటీవలే నిబంధనను సవరించినబల్దియా కమిషనర్‌ లోకేశ్‌
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ  : అపార్ట్‌మెంటులో 50కి మించి ఫ్లాట్లు ఉంటే మురుగునీటి శుద్ధి ప్లాంటు(ఎస్‌టీపీ) తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయకూడదని నిర్ణయించారు.  నిబంధనల మేరకు 100 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్లలో ఎస్‌టీపీలు ఏర్పాటు చేసుకోవాలి. అయితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఈ నిబంధనను 50 ఫ్లాట్లకు కుదిస్తూ ఇటీవలే  ఉత్తర్వులు జారీచేశారు. గతంలో అనుమతులు మంజూరైన అపార్ట్‌మెంట్లకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.

 అపార్ట్‌మెంటులో 50, అంతకన్నా ఎక్కువ ఫ్లాట్లుంటే మురుగునీటి శుద్ధి ప్లాంటు (ఎస్‌టీపీ) ఏర్పాటును తప్పనిసరి చేశారు. ఇది ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీచేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిబంధనపట్ల బిల్డర్ల నుంచి విముఖత వ్యక్తమవుతుంది. చాలామంది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) పొందేందుకు ముందుకు రావడంలేదు. 

 ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం 100 ఫ్లాట్లు, అంతకన్నా ఎక్కువ ఫ్లాట్లున్న అపార్ట్‌మెంట్లు తప్పనిసరిగా ఎస్‌టీపీలు ఏర్పాటుచేసుకోవాలి. అయితే ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఈ నిబంధనను 50 ఫ్లాట్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు 50 ఫ్లాట్లున్న అపార్ట్‌మెంట్లు సైతం ఎస్‌టీపీలను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలేదు. గతంలో అనుమతులు మంజూరైన అపార్ట్‌మెంట్లకు సైతం ఎస్‌టీపీలు ఏర్పాటు చేసుకోకుంటే ఓసీలు జారీచేయడంలేదు. ఎస్‌టీపీలను ప్రోత్సహించాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ మండలి, వాటర్‌బోర్డుపై ఉన్నప్పటికీ ఆ విభాగాలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ  నిబంధన కాగితాలకే పరిమితమైంది. మరోవైపు, 50 ఫ్లాట్లున్న అపార్ట్‌మెంటులో ఎస్‌టీపీ ఏర్పాటు చేసుకోవాలంటే సుమారు రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఎస్‌టీపీ ఏర్పాటుచేసిన అపార్ట్‌మెంటులో ఫ్లాటు కొనుగోలుదారుపై లక్ష రూపాయల భారం పడుతుంది. అభివృద్ధి పన్నులు, జీఎస్‌టీ తదితర అదనపు చార్జీలకు ఎస్‌టీపీ ఏర్పాటు నిబంధన కూడా తోడుకావడంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని బిల్డర్లు వాపోతున్నారు. ఇది ప్రత్యక్షంగా కొనుగోలుదారులపై భారమేనని వారు చెబుతున్నారు.

కలుషితమవుతున్న జలాశయాలు

 నగరంలో వెలువడుతున్న మురుగు జలాలన్నీ ఆయా జలాశయాలతోపాటు నాలాల ద్వారా మూసీలో కలుస్తున్నాయి. ఎంతోకాలంగా ఈ తంతు కొనసాగుతుండడంవల్ల జలాశయాలన్నీ కలుషితమయ్యాయి. మరోవైపు, ఇండ్ల్లనుంచి వెలువడే మురుగుజలాలను శుద్ధిచేసేందుకు వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో ఎస్‌టీపీలను ఏర్పాటుచేస్తున్నారు. ఇలా శుద్ధి చేసిన జలాలను మూసీతోపాటు జలాశయాల్లోకి వదలాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో మూసీనదితోపాటు ప్రధాన చెరువుల వద్ద ఎస్‌టీపీల నిర్మాణం చేపడుతున్నారు. వీటితోపాటే ఇళ్లలోని మురుగు జలాలను సైతం ఎక్కడిదక్కడే శుద్ధిచేసి అక్కడి అవసరాలకు ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో అపార్ట్‌మెంట్లలో ఎస్‌టీపీలను ఏర్పాటుచేసుకోవాలనే నిబంధన విధించారు. దీనివల్ల మంచినీటి వృథా కూడా తగ్గే అవకాశం కలుగుతుంది. అయితే, ఎస్‌టీపీల ఏర్పాటు ఖర్చు తో కూడుకున్న అంశం కావడంతో ఇది ఆచరణలోకి రావడంలేదని అధికారులు పేర్కొంటున్నారు.
logo