గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Jan 21, 2020 , 00:51:05

పట్టాభిషేకం ఖాయమే..

పట్టాభిషేకం ఖాయమే..


 - మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పురపోరులోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. కిందటేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల వరకు వచ్చిన ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికలలోనూ  వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం మెజార్టీ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లా పరిధిలోని 289 వార్డుల మెజార్టీ ప్రజలు ప్రగతివైపే తమ పయనం అంటున్నారు. ప్రతివార్డులోను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కీర్తిస్తూ కారుగర్తు అభ్యర్థులకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ నాయకులకు, అభ్యర్థులకు అడుగడుగునా ఆడపడుచుల స్వాగతాలు, అన్నదమ్ముల కోలాహాలం కనిపించాయి.  ఓ వైపు ఆకర్శణీయ పథకాలు, మరోవైపు భవిష్యత్తులో అభివృద్ధికై భరోసా.. వెరసి కారుగర్తు అభ్యర్థుల గెలుపు నిశ్ఛయంగానే కనిపిస్తుందని జిల్లా పరిధిలోని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.            

   ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన హైదరాబాద్‌ మహానగర శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం అభివృద్ధి పరుగులు పెడుతోంది. చేపట్టిన ప్రతి ప్రాజెక్టును నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వం ప్రత్యేకతగా చెప్పవచ్చును. ఈక్రమంలోనే హైదరాబాద్‌ నగరంలో భాగంగా విస్తరించిన మేడ్చల్‌ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పవచ్చును. కేంద్రంలో, రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీల తమకు చేసింది శూన్యమని ప్రజలు బాహాటంగానే నిలదీస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా ఉన్న ప్రాంతాలన్ని నగరానికి అతిచేరువలో ఉన్నాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతాలన్ని సవతిప్రేమకు నోచుకున్న పల్లెలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి ముందుచూపు, పురపాలక మంత్రి కేటీఆర్‌ చతురతతో పల్లెలను పట్టణాలుగా, పట్టణాలను నగరాలుగా అభివృద్ధి చేయడంతో పరాయిపాలనలో నగర శివా రు పల్లెలుగా పిలవబడిన మేడ్చల్‌ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు స్వరాష్ట్రంలో సిద్ధించిన స్వీయపాలనలో నగర సిగలో నగలుగా, ఆధునిక పట్టణాలుగా కీర్తించబడుతున్నాయి.

వందల పథకాలు... లక్షల్లో లబ్ధిదారులు.. అందరూ టీఆర్‌ఎస్‌ వెంటే..

రైతుబంధులో భాగంగా జిల్లాలోని తొలివిడుతలో ఎకరాలకు రూ.4వేల చొప్పున 28,301 మంది మూడు విడుతల కలిపి రూ.70కోట్ల వరకు అందించారు. భూ రికార్డుల నవీకరణలో భాగంగా జిల్లాలో 2.65లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులను నవీకరించి 68వేల ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో ఓ స్పష్టతను తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో అత్యధిక మంది లబ్ధిదారులు మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే ఉండటం విశేషం. ధరణి వెబ్‌సైట్‌ ద్వారా జిల్లాలో 26,828 మందికి కొత్తగా నూతనంగా డిజిటల్‌ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేశారు. సామూహిక రైతుబీమా పథకంలో భాగంగా ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు రూ.5లక్షల బీమా చొప్పు న ఇప్పటి వరకు జిల్లాలో 100-125 మంది రైతుల కుటుంబాలకు మేలు జరిగింది. కంటి వెలుగు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 5,43,585 మందికి పరీక్షలు నిర్వహించి ఇందులో 90,409 మందికి అద్దాలను పంపిణీ చేశారు. 83,754 మందికి ప్రత్యేక అద్దాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా మేడ్చల్‌ జిల్లాలో గత మూడేండ్లలో మూడకోట్ల వరకు మొక్కలను నాటారు. రూ.3-4వందల కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నారు. అలాగే ప్రభుత్వ దవాఖానలో కాన్పుజరిగిన సుమారు 20,809 మందికి కేసీఆర్‌ కిట్లను అందించారు. ఆసర పథకంలో భాగంగా జిల్లాలోప్రతినెలా 1,10,046లక్షల మందికి రూ.13కోట్ల వరకు పింఛన్లను అందిస్తున్నారు.

స్త్రీనిధి రుణాల జారీ, మిషన్‌ కాకతీయలో భాగంగా రూ.26కోట్లతో 185 చెరువుల అభివృద్ధి చేశారు. జిల్లాలో పెరుగుతున్న ప్రజారవాణాకు తగ్గట్లుగానే రూ.120 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశారు. అలాగే షెడ్యూల్డ్‌ వర్గాలకు ప్రతిఏట రూ.112 కోట్ల రుణాలు, ఒక్కో విద్యార్థికి రూ.20లక్షల చొప్పున విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ కింద నిరుపేద విద్యార్థులకు అందిస్తున్నారు. ఉచిత క్రమబద్ధీకరణలో భాగంగా జీవో-58 కింద, జీవో-59లో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికమందికి మేడ్చల్‌ జిల్లాలోనే పట్టాలందించారు. భూ కబ్జాదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదుచేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో నగరంలో కబ్జాదారులు తోకముడిచారు. సుమారు 77 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. పేట్‌ బషీరాబాద్‌లో మల్టీపర్పస్‌ ప్రభు త్వ దవాఖానను నిర్మించడంతోపాటు ఏరియా ఆసుపత్రిని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మల్కాజ్‌గిరిలో 200పండకల దవాఖానను నిర్మించారు. అంగన్‌వాడీ టీచర్లకు వేతనాలను పెంచడం వల్ల సుమారు 793మంది టీచర్లకు, ఆయాలకు మేలు జరుగుతుం ది. అలాగే వీఆర్‌ఏలకు, ఆశావర్కర్లకు సైతం వేతనాలను పెంచడంతో పాటు కొత్తగా 30మంది టీచర్లను, 70మంది ఆయాలను నియమించారు. అత్యధిక పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే పరిశ్రమల విస్తరణ, స్థాపనకు టీఎస్‌ఐపాస్‌, పరిపాలన సంస్కరణలతో రూ.వేల కోట్ల పెట్టుబడులను సాధించారు.


సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకమే అభ్యర్థుల విజయానికి నాంది

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలువడం ఖాయమని టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి పీఎల్‌ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరిందన్నారు. ఆరు సంవత్సరాల్లో తెలంగాణను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేసి ఆదర్శప్రాయంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ నారెడ్డి నం దారెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, నర్సింహారెడ్డి, భాగ్యారెడ్డి, శేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు
logo
>>>>>>