బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Jan 20, 2020 , 01:47:56

చెరువులకు కొత్త శోభ

చెరువులకు కొత్త శోభ
  • - రూ.120 కోట్లతో ఔటర్‌ అవతల 20 చెరువుల అభివృద్ధి
  • - సర్వాంగ సుందరంగా ముస్తాబైన 16 చెరువులు
  • - కోర్టు కేసులు, స్థానిక సమస్యలతో నాలుగు చోట్ల పనులు పెండింగ్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హెచ్‌ఎండీఏ పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల ఉన్న 16 చెరువులు కొత్త శోభను సంతరించుకున్నాయి.  రూ.120 కోట్లతో 20 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు  శ్రీకారం చుట్టగా 16 చెరువుల పనులు తుది దశకు చేరుకున్నాయి. కోర్టు కేసులు, స్థానిక సమస్యల నేపథ్యంలో నాలుగు చెరువుల పునరుజ్జీవన పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ పరిధిలో చెరువులు పర్యాటక కళను సం తరించుకుంటున్నాయి. కళతప్పిన చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రూ.120కోట్లతో ఔట ర్‌ అవతల 20 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. చెరువుల అక్రమణలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం, చెరువు బండ్‌(కట్ట) బలోపేతం చేయడం, చెరువులోకి మురుగునీరు చేరకుండా సివరేజి ట్రిట్‌మెంట్‌ ఫ్లాంట్‌ (ఎస్టీపీ,) ఐ అండ్‌ డీ ( ఇంటరాఫ్షన్‌ అండ్‌ డైవర్షన్‌ ) నిర్మా ణం, వలస పక్షులను ఆకర్షించేలా బ్యూటిఫికేషన్‌, పరిసర ప్రాంతాల్లో పూల మొక్కలు తదితర ఏర్పాట్లతో చెరువులను ఆహ్లాదకర ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే 16 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులను తుదిదశకు చేర్చి అందంగా ముస్తాబు చేశారు. కోర్టు కేసులు, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలతో నాలుగు చోట్ల  చిన్నా దామెర/దుండిగల్‌, కాముని చెరువు/శంషాబాద్‌, కుంట్లూరు/అబ్ధుల్లాపూర్‌మెట్‌,  నదీం చెరువు/ఘట్‌కేసర్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. చెరువులను పరిరక్షించి, ఆరోగ్యం, ఆహ్లాదకర వాతావరణంలో చెరువులను తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామ ని, పనులు పూర్తయిన చెరువులకు సందర్శకులు, వాకర్ల తాకిడి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

సర్వాంగ సుందరంగా ముస్తాబైన చెరువులు

 20 చెరువుల అభివృద్ధిలో భాగంగా 16 చెరువులను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. ఎదుల చెరువు/పెద్ద అంబర్‌పేట, పసుమాముల/అబ్ధుల్లాపూర్‌మెట్‌, చింతల్‌/చెంగిచర్ల, రాంపల్లిచెరువు/ కీసర, కుడికుంట చెరు వు/ దుండిగల్‌, పట్ల చెరువు/పటాన్‌చెరు, తొండపల్లి చెరువు/శంషాబాద్‌, పీరం చెరువు/రాజేంద్రనగర్‌,  కిష్ణారెడ్డిపేట/ఆమీన్‌పూర్‌,  మల్లంపేట/బౌరంపేట, జల్‌పల్లి/బాలాపూర్‌, పేద చెరువు/మేడిపల్లి, నారాయణ చెరువు/మేడ్చల్‌, పెద్ద చెరువు/చేర్యాల(కీసర),ఇందిరమ్మ చెరువు/కాప్రా, తుర్కయాంజల్‌/అబ్ధుల్లాపూర్‌మెట్‌ చెరువులకు సంబంధించి సివరేజీ డైవర్షన్‌ (ఐ అండ్‌ డీ నిర్మా ణం), చెరువు కట్ట బలోపేతం, పూడికతీత పనులను తుదిదశకు చేర్చి సందర్శకులకు ఆహ్లాదాన్ని, ఆర్యోగకర వాతావరణంలో తీర్చిదిద్దారు.
logo