శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Jan 15, 2020 , 03:17:22

హెల్మెట్‌ పెట్టుకొని ఉంటే బతికుండేవారు..

హెల్మెట్‌ పెట్టుకొని ఉంటే బతికుండేవారు..


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితోపాటు ఆ వాహనం వెనుకాల కూర్చున్న వారి ప్రాణాలు కూడా ముఖ్యమే. 2020లో రోడ్డు భద్రతను ప్రాధాన్యత అంశంగా తీసుకున్న పోలీసులు ఇప్పుడు పిలియన్‌ రైడర్‌
(ద్విచక్ర వాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తి) రక్షణపై కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ అధికారులు 2019 సంవత్సరంలో జరిగిన ద్విచక్రవాహనాల రోడ్డు ప్రమాదాలను విశ్లేషించారు. ఈ విశ్లేషణలో సైబరాబాద్‌లో 114, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 36 మంది ద్విచక్ర వాహనం వెనుకాల కూర్చున్న వారు మొత్తం 150మంది చనిపోయారని తేలింది. వీరందరూ కూడా హెల్మెట్‌లను ధరించి ఉంటే బతికిపోయేవారని స్పష్టమైంది. హెల్మెట్‌ లేని కారణంగా వీరంతా తలకు తీవ్ర గాయాలై మరణించారని వైద్యుల రికార్డులు తెలుపుతున్నాయి. హెల్మెట్‌లు ఉంటే తలకు గాయాలు కాకుండా బతికి ఉండే వారని వైద్యుల రికార్డులు వివరిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌ అధికారులు రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా పోలీసులు ఇప్పుడు వెనుకాల కూర్చున్న వారి ప్రాణాలను కాపాడే దిశలో ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా చర్యలు తీసుకుంటుండగా, ఇప్పుడు పిలియన్‌ రైడర్‌కు కూడా హెల్మెట్‌ ఉండేలా నిబంధనను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనదారుడితోపాటు వాటిపై ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు కూడా సురక్షితంగా ఉండాలనే భావనతో పోలీసులు పలు మెట్రో పట్టణాల్లో అమలవుతున్న ట్రాఫిక్‌ నిబంధనలను ఆరా తీస్తున్నారు.

ప్రాణాలను కాపాడడమే లక్ష్యం..

గత ఏడాది రోడ్డు ప్రమాదాలను విశ్లేషించినప్పుడు ద్విచక్ర వాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్‌ తప్పనిసరిగా ఉండాలని హెచ్చరిస్తున్నది. తలకు గాయాలై 114 మంది చనిపోవడం బాధాకరం. కాబట్టి వారంతా హెల్మెట్‌ ధరించి ఉంటే బతికేవారని వైద్యులు ఇచ్చిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిలియన్‌ రైడర్‌ రక్షణ కోసం వారు కూడా హెల్మెట్‌ ధరిస్తే సేఫ్‌ అని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, చన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో అమలవుతున్న ట్రాఫిక్‌ నిబంధనలను అధ్యయనం చేస్తున్నాం. ఆ తర్వాత చట్ట ప్రకారం నడిచేందుకు ప్రయత్నిస్తాం. ఎట్టకేలకు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోకుండా వాహనదారులు, పిలియన్‌ రైడర్‌లను కాపాడడమే మా లక్ష్యం.     - ఎస్‌ఎమ్‌ విజయ్‌కుమార్‌, డీసీపీ సైబరాబాద్‌ ట్రాఫిక్‌

వెనుక కూర్చున్న వారికి కూడా తప్పనిసరి

రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే మా లక్ష్యం. మా విశ్లేషణలో కమిషనరేట్‌ పరిధిలో 36 మంది ద్విచక్ర వాహనం వెనుకాల కూర్చున్న వారు తలకు తీవ్ర గాయాలై మరణించారు. దీంతో హెల్మెట్‌లు ఉంటే ప్రాణాలు నిలుస్తాయని స్పష్టమైంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పనిసరిగా వాహనం నడిపించే వ్యక్తి, వెనుకాల కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని కోరుతున్నాం. దీని కోసం వెనుకాల కూర్చున్న వారు హెల్మెట్‌ ధరించకపోతే రూ.100 చలాన్‌ విధిస్తున్నాం. ఇప్పటి వరకు 263 మంది వాహనదారులపై ఈ చలాన్‌లు విధించాం. మాకు చలాన్‌లు ముఖ్యం కాదు ప్రాణాలను కాపాడడమే మా ధ్యేయం.      
- దివ్యచరణ్‌రావు, డీసీపీ రాచకొండ ట్రాఫిక్‌ విభాగంlogo