సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Jan 14, 2020 , 02:08:53

ఆహ్లాదాన్ని పంచేలా అందంగా కనిపించేలా

ఆహ్లాదాన్ని పంచేలా అందంగా కనిపించేలా
  • -నగరం చుట్టూ మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున హెచ్‌ఎండీఏ ‘ప్రగతి’ పనులు
  • -వందల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన
  • -దారుల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీల నిర్మాణం, పార్కులు, ఫుట్‌పాత్‌లు,సెంట్రల్‌ మీడియన్‌ల ఏర్పాటు

హెచ్‌ఎండీఏ చేపడుతున్న అభివృద్ధి పనులతో నగరం చుట్టూ ఉన్న పురపాలికలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రహదారుల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు, నూతన పార్కుల నిర్మాణం, అధునాతన డ్రైనేజీలు, చెరువుల సుందరీకరణతో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అందంగా, ఆహ్లాదంగా మారాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో పాటు గ్రోత్‌ కారిడార్‌ పరిధిలోని నిర్మాణాల డిఫర్‌మెంట్‌ చార్జీల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలతో పురపాలికలను ఆదర్శంగా తీర్చిదిద్దారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రగతి సాధించింది. ఏడు జిల్లాలలోని మున్సిపల్‌, కార్పొరేషన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ అధికారులు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రహదారుల విస్తరణ, వీధి లైట్లు, నూతన పార్కుల ఏర్పాటు, అధునాతన డ్రైనేజీల నిర్మాణం, చెరువుల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణ పథకం ద్వారా వచ్చిన నిధులతో సంగారెడ్డి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనులు జరిగాయి. మరిన్ని చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో కాకుండా డీపీఎంఎస్‌ నిర్మాణ రంగ అనుమతుల్లో భాగంగా గ్రోత్‌ కారిడార్‌ పరిధిలో వెలిసిన నిర్మాణాల అనుమతుల ప్రక్రియలో డిఫర్‌మెంట్‌ చార్జీల ద్వారా వచ్చిన రూ. కోట్లాది రూపాయలను స్థానిక గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్నారు.

మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు

- సంగారెడ్డి పట్టణంలో రూ. 6.59కోట్లతో రెండు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ, డ్రైనేజీ ఏర్పాటు, ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు. రూ. 1.09 కోట్లతో 2.6 కి.మీల మేర రిచ్‌-1 సెంట్రల్‌ మీడియన్‌ పనులను, రూ. 1.09 కోట్ల వ్యయంతో 2.6 నుంచి 5.4 కిలోమీటర్ల మేర రిచ్‌-2 సెంట్రల్‌ మీడియన్‌ పనులను పూర్తి చేశారు.
- 5.5 కి.మీ మేర సెంట్రల్‌ మీడియన్‌లో రూ. 1.34 కోట్లతో వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
-నందిగామ గ్రామంలో రూ. 48 లక్షల వ్యయంతో 400 మీటర్లు డ్రైనేజీ లైన్‌, 1.3 కి.మీల మేర సీసీ రోడ్డు పనులు చేశారు. రూ. 3.59 కోట్లతో ఆమీన్‌పూర్‌లో రోడ్ల పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే భువనగిరి మున్సిపాలిటీల్లో సెంట్రల్‌ మీడియన్‌ నిర్మాణం, నాలుగు కిలోమీటర్ల మేర సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు తదితర పనుల కోసం రూ. 15 కోట్లు మంజూరు చేసి పనులు తుది దశకు చేరాయి
-ఆమీన్‌పూర్‌ నుంచి ఐడీఏ బొల్లారం వరకు 0.7కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధ్దరణ పనులు చేపట్టారు. మాధవపురిహిల్స్‌ రోడ్‌-పీజేఆర్‌ కాలనీలో 0.9 కిలోమీటర్లు, బాచుపల్లి పీవోడబ్ల్యూ రోడ్‌ -సన్‌వే ఓపర్స్‌ 0.7కి.మీలు, ఆమీన్‌పూర్‌ నుంచి కిష్ణారెడ్డి పేట 2.2 కి.మీలు, ఆమీన్‌పూర్‌ నుంచి గోల్డెన్‌ఫామ్స్‌ కిలోమీటర్‌, గోల్డెన్‌ఫామ్స్‌- ఎన్‌ఎస్‌ఎల్‌ కాలనీ 0.58 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు.
- రూ. 5కోట్లతో చౌటుప్పల్‌, రూ. 56 కోట్లతో కుంట్లూరులో మురుగునీటి పారుదల పనులు చేపట్టారు.
-ఏడు కోట్ల రూ. 50 లక్షలతో లక్ష్మిగూడ నుంచి శంషాబాద్‌కు ఉన్న రేడియల్‌ రోడ్డు మార్గంలో అసంపూర్తిగా ఉన్న కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు.
-ఇంజాపూర్‌లో ఎక్స్‌రోడ్‌ నుంచి వై.జంక్షన్‌ వరకు బీటీ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 2 .95కోట్లు  కేటాయించారు.

నలుదిక్కుల నుంచి వచ్చిన వారే..

వాస్తవానికి బోడుప్పల్‌, పీర్జాదిగూడ గ్రామాలు చిన్న గ్రామాలు. కానీ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి వరంగల్‌, మహాబూబ్‌ నగర్‌ జిల్లాలకు చెందిన వారితో పాటు సీమాంధ్రతో పాటు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, బీహార్‌, కర్ణాటక, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఈ ప్రాంతాలకు ఉపాధి కోసం వచ్చి స్థానికులుగా మారారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాల్లో ఓటర్లలో 70శాతం మంది వలస వచ్చి ఈ ప్రాంతాల్లో సెటిల్‌ అయిన వారే ఉండటం గమనార్హం.

పురోగతిలో ఉన్న పనుల వివరాలు

-హెచ్‌ఎండీఏ పరిధిలో జీహెచ్‌ఎంసీ 41.11 ఎకరాల విస్తీర్ణంలో 6240 యూనిట్ల నిర్మాణ పనులు యుద్ధ్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌ ఇండ్ల కాలనీకి  అప్రోచ్‌ రోడ్ల నిర్మాణ పనులు హెచ్‌ఎండీఏ చేపడుతున్నారు. రాంపల్లి, బోగారం, ఆమీన్‌పూర్‌, నిజాంపేట, బాచుపల్లి, గాగిల్లాపూర్‌, శంకర్‌పల్లి, నార్సింగి, ఇంజాపూర్‌, జవహర్‌ నగర్‌ తదితర ప్రాం తాల్లో జరుగుతున్న డబుల్‌ బెడ్‌ రూం కాలనీలకు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణ పనులకుగానూ రూ.94.30 కోట్లతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు.
-బీరంగూడ -కిష్ణారెడ్డిపేట ఐదు కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల (డబుల్‌ లైన్‌/ఇరు వైపులా) రహదారి విస్తరణకు రూ. 49 కోట్లతో హెచ్‌ఎండీఏ పనులు చేపడుతున్నారు. స్ట్రీట్‌ లైట్స్‌, సెంట్రల్‌ మీడియన్‌, ప్రస్తుత రహదారిని బలోపేతం చేసేందుకుగాను ఇటీవల ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ. 49కోట్లలో 67శాతం హెచ్‌ఎండీఏ నిధులు, 33 శాతం స్థానిక మున్సిపాలిటీ నిధులతో ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు.
- పెద్ద అంబర్‌పేట జంక్షన్‌ నుంచి బాటా సింగారం గ్రామం వరకు రూ. 1.82 కోట్లతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర స్ట్రీట్‌ లైట్ల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి.
-బోడుప్పల్‌, బడంగ్‌పేటలో ఆహ్లాదాన్ని పంచే పార్కు నిర్మాణం పనులు తుది దశలో ఉన్నాయి. ఎన్నికలు ముగియగానే ఈ పార్కులు అందుబాటులోకి తీసుకు రానున్నారు. మరో ఐదు చోట్ల కాలనీ పార్కు పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.
బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌

జనాభా     -     1,35,000
మొత్తం ఓటర్లు    -     73,598
పురుషులు     -     38,217
స్త్రీలు     -     35,3079
ఇతరులు     -     2
వార్డులు     -     28
కాలనీ వెల్ఫేర్‌ సంఘాలు     -     162
విస్తీర్ణం     -     20 చ.కి.మీ.
వార్షిక ఆదాయం     -     సుమారు             రూ.40 కోట్లు
ఇండ్లు..    -    30- 35వేల             పైచిలుకు


logo