మంగళవారం 31 మార్చి 2020
Medchal - Jan 14, 2020 , 02:07:54

నగరానికి ముఖ ద్వారాలు.. అభివృద్ధికి చిరునామాలు

నగరానికి ముఖ ద్వారాలు.. అభివృద్ధికి చిరునామాలు


మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరానికి ఆ ప్రాంతాలు ముఖ ద్వారాలు. కానీ అక్కడ త్రాగునీరు నెలలో రెండుసార్లు వస్తేనే గగనం. ఆ ప్రాంతాల్లోని రోడ్లపై మురుగు పరుగులు తీసేది. 90 శాతం కాలనీలకు మట్టిరోడ్లే దిక్కు. అవి ఇసుక లారీలకు అడ్డాలు, నగర శివారు ప్రాంతాలుగా పిలవబడేవి. అయితే ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతాల దుస్థితి. కానీ స్వరాష్ట్రంలో ఈ ప్రాంతం రూపురేఖలు మారాయి. నాడు పల్లెలుగా ఉన్న మేడ్చల్‌ నియోజకవర్గంలోని బోడుప్పల్‌, పీర్జాదిగూడ ప్రాంతాలు రాష్ట్ర ఐటీ, పురపాలన శాఖ మంత్రి కేటీఆర్‌ చొరువతో మున్సిపాలిటీలుగా మారాయి. ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్లుగా ఎదిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాధరణకు గురైన ఈ ప్రాంతాలు పట్టణాలుగా మారాయి. ఇసుకు లారీలకు అడ్డాలుగా ఉన్న ఈ ప్రాంతాలు అభివృద్ధికి చిరునామాలుగా మారాయి. 1957నుంచి 2012 వరకు గ్రామాలుగా (చెంగిచెర్ల అనుబంధ గ్రామం) తరువాత ప్రత్యేక గ్రామంగా, 2016 ఏప్రిల్‌ 11 వరకు మున్సిపాలిటీలుగా, 2019 ఏప్రిల్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్లుగా ఎదిగి నేటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలోనే  ఉండి ఈ నెల 2020 జనవరి 25వ తేదీ తరువాత తొలిసారిగా పాలకవర్గం కొలువుదీరబోతున్న బోడుప్పల్‌, పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్లపై ‘నమస్తే తెలంగాణ’ కథనం..

రూ. వందల కోట్లతో అభివృద్ధి..

కొత్తగా ఏర్పడిన మున్సిపల్‌ కార్పొరేషన్లలో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బోడుప్పల్‌, పీర్జాదిగూడ ప్రాంతాలకు రూ. వందల కోట్లను విడుదల చేశారు. అలాగే ప్రజల నుంచి వంద శాతం పన్నులను వసూలు చేసిన మున్సిపాలిటీల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించారు.   ఈ ప్రాంతంలో ముఖ్యంగా రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా శిల్పారామాన్ని తలపించే రీతిలో సుమారు 8ఎకరాల విస్తీర్ణంలో వైకుంఠధామాలను ఏర్పాటు చేశారు. అలాగే రూ.5-10 కోట్లను వెచ్చించి మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకులను నిర్మించారు. ఆ ప్రాంతంలో దుర్వాసనను వెదజల్లే నల్ల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఉప్పల్‌ రింగ్‌రోడ్డు నుంచి నారపల్లి వరకు సుమారు 8-10 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైవర్‌ను నిర్మిస్తున్నారు. అలాగే బోడుప్పల్‌, చెంగిచెర్ల, నారపల్లి, మేడిపల్లి ప్రాంతాల్లోని రిజర్వు ఫారెస్ట్‌లను రూ.2కోట్ల వరకు వెచ్చించి అర్బన్‌ లంగ్స్‌ పార్కులుగా, నందనవనాలుగా అభివృద్ధి చేశారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలోని అన్ని కాలనీల ప్రధాన రహదారులను డబుల్‌ రోడ్డుగా మార్చి హరితహారంలో భాగంగా సుమా రు 2.5 కోట్ల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
తీరుతున్న ప్రజల అవసరాలు : సుమారు రూ.100 కోట్లను వెచ్చించి రెండు కార్పొరేషన్ల పరిధిలో 500కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, మరో రూ.50 కోట్లను వెచ్చించి 800 కిలోమీటర్ల అంతర్గరోడ్లను, రూ.20 కోట్ల వరకు వెచ్చించి 20-25వేల వరకు వీధి లైట్లను ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అలాగే ఈ ప్రాంతాల్లో 5 జీఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు, 15 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు, 16, 20లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంకులను, ప్రతిరోజు సుమారు 25 ఎంఎల్‌డీల నీటిని ఈ ప్రాంతాల్లో జలమండలి సరఫరా చేస్తుంది. వీటికి తోడు ఇతర నీటి వసతిని అధికారులు ఈ ప్రాంత సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో  సుమారు 100 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా వీటిని ఎప్పటికప్పుడు అధునాత డంపింగ్‌ యార్డులకు తరలించి పలు ఏజెన్సీల సాయంతో రీ-సైక్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఏ రోజు చెత్తను ఆ రోజు సేంద్రీయ ఎరువుగా మార్చుతున్నారు.   దాదాపుగా ఈ అభివృద్ధి పనులకు రూ.7-8వందల కోట్లు అయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ సంస్కరణలు.. సత్ఫలితాలు

తెలంగాణ ప్రభుత్వ సంస్కరణలతో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో పౌర సేవలలో వేగం పెరిగింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డంపింగ్‌ యార్డుల నిర్వహణ, మోబైల్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ సేవలు.. ఇలా అనేక కార్యక్రమాల అమలుతో ప్రగతిలో దూసుకెళ్తున్న ఈ మున్సిపల్‌ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇందులో ఈ గవర్నెన్స్‌, స్కోచ్‌ పురస్కారాలతో పాటు జాతీయ స్థాయిలో 4041 నగరాలు, పట్టణాలలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో  బోడుప్పల్‌కు దక్షణ భారతదేశం నుంచి ‘బెస్ట్‌ సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌' పురస్కారం దక్కిందంటే అనతి కాలంలోనే ఈ ప్రాంతాలు ఎంతటి అభివృద్ధిని నమోదు చేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చును. 


పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌


జనాభా    -    1,02,000
మొత్తం ఓటర్లు     -     60,965
పురుషులు     -     31, 770
స్త్రీలు     -     29,191
ఇతరులు     -     4
వార్డులు     -     26
కాలనీ వెల్ఫేర్‌ సంఘాలు     -     150
విస్తీర్ణం     -     10.5 చ.కి.మీ
వార్షిక ఆదాయం     -     సుమారు             రూ.37 కోట్లు
ఇండ్లు    -    25-30 వేల
        పైచిలుకు.


logo
>>>>>>