శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medchal - Jan 14, 2020 , 02:06:20

ఇండోర్‌ జాతీయ ‘పిడికాన్‌' సదస్సుకు నిలోఫర్‌ బృందం

ఇండోర్‌ జాతీయ ‘పిడికాన్‌' సదస్సుకు నిలోఫర్‌ బృందం సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చిన్నారుల్లో వచ్చే మూత్రాశయ సంబంధ ‘వెసిక్లో యురెట్రిక్‌ రిఫ్లెక్స్‌' వ్యాధిని క్యాప్‌(కంటీన్యూయస్‌ ఆంటిబయోటిక్స్‌ ప్రోపలాక్స్‌)చికిత్స ద్వారా నయం చేయవచ్చని నిలోఫర్‌ వైద్యులు డా.రమేష్‌ దాంపురి అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ‘ఇండోర్‌ జాతీయ పిడికాన్‌' సదస్సుకు తెలంగాణ రాష్ట్రం తరపున నిలోఫర్‌ దవాఖాన నుంచి 10 మంది సభ్యుల బృందం హాజరైంది. ఇందులో భాగంగా చిన్నారుల్లో వచ్చే మూత్రాశయ సంబంధ వ్యాధుల్లో ఒకటైన వీఈఆర్‌(వెసిక్లో యురెట్రిక్‌ రిఫ్లెక్స్‌)పై జరిగిన చర్చలో ఇండోర్‌ పిడియాట్రిక్‌ వైద్యనిపుణులు డా.సర్దార్‌ సంగ్రామ్‌ సింగ్‌, చండీఘర్‌లోని జిప్మర్‌కు చెందిన వైద్యనిపుణులు డా.కృష్ణకుమార్‌, డా.అలోక్‌ హేమల్‌లతో కలిసి నిలోఫర్‌ ఆర్‌ఎంవో, చిన్నపిల్లల వైద్యనిపుణులు డా.రమేష్‌ దాంపురి పాల్గొని ప్రసంగించారు. సాధారణంగా మూత్రం కిడ్నీల నుంచి యూరేటర్‌కు, యూరేటర్‌ నుంచి బ్లాడర్‌కు, బ్లాడర్‌ నుంచి యురేత్రకు(మూత్రాశయం) చేరుకుని అక్కడి నుంచి బయటకు విసర్జన జరుగుతుందని అయితే వీఈఆర్‌ సమస్య గల చిన్నారుల్లో మూత్రం బ్లాడర్‌ నుంచి మూత్రాశయానికి రాకుం డా తిరిగి యూరేటర్‌కి వెళ్తుందని డా.రమేష్‌ దాంపురి వివరించారు. వందలో ఒక్క శాతం మందికి వచ్చే ఈ వ్యాధి నవజాత శిశువల్లోనే గుర్తించవచ్చన్నారు. 18నెలల్లోపు చికిత్స అందిస్తే పిల్లలను కిడ్నీ సమస్యల బారి నుంచి రక్షించవచ్చన్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మూత్రం బ్లాడర్‌ నుంచి యూరేటర్‌కు వెళ్లడంతో కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి దెబ్బతింటాయని కొంత కాలం తరువాత కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదముందని స్పష్టం చేశారు. ఈ సమస్య కొంత మంది పిల్లలో 18 నెలల తరువాత సమస్య దానంతటదే తగ్గుముఖం పడుతుందని మరికొంత మందిలో చికిత్స అవసరముంటుందన్నారు. ఈ సమస్య  ఎక్కువగా మగ శిశువుల్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన డా.రమేష్‌ దాంపురి వివరించారు.

క్యాప్‌ పద్ధతిలో చికిత్స : సాధారణంగా మూత్రంలో ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని సదస్సులో డా.రమేష్‌ దాంపురి వివరించారు. కంటీన్యూయస్‌ ఆంటీబయోటిక్స్‌ ప్రోపలాక్స్‌(క్యాప్‌) పద్ధతిన వ్యాధిని నివారించవచ్చన్నారు. చిన్నారుల్లో మూత్ర సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సదస్సుకు నిలోఫర్‌ దవాఖాన నుంచి చిన్నపిల్లల వైద్యనిపుణుల విభాగాధిపతి డా.రవి, పిల్లల వైద్య నిపుణులు డా. నిర్మల, డా.హిమబిందు, డా.కల్యాణి శ్రీనివాస్‌, డా. ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.logo