ఆదివారం 24 మే 2020
Medchal - Jan 13, 2020 , 03:35:29

హాస్టళ్లకు అండగా..

హాస్టళ్లకు అండగా..
  • -విద్యార్థులకు రగ్గులు, స్వెట్టర్లు అందజేత
  • -ప్రీ మెట్రిక్‌ వసతి గృహాలకు సోలార్‌ వాటర్‌ హీటర్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: శీతాకాలం మధ్యరోజుల్లోకి చేరుకోవడంతో చలి గజగజ వణికిస్తోంది. పెద్దా చిన్న అన్న తేడాల్లేకుండా అందరిని బెంబెలె త్తిస్తోం ది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు దిగజారుడుతుండటంతో చలితీవ్రతలు పెరిగి ఇబ్బందిపెడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు వేగంగా  మారడంతో తెల్లవారుజామున మధ్యరాత్రిలో చలి ఎక్కువగా ఉంటోంది. దీని ప్రభావంతో చిన్న పిల్లలు చలితీవ్రతలను తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈదరగాలులు ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వసతిగృహాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చలితీవ్రతల నుంచి సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పిల్లల బాధలను దూరం చేసేందుకు నడుం బిగించా రు. దీంట్లో భాగంగా పలు శాఖల ద్వారా నడుస్తున్న వసతిగృహాల్లోని విద్యార్థులను చలి తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ఉలెన్‌ రగ్గులు, స్వెట్టర్లు, మంకీక్యాపులను అందజేయనున్నారు. కొంతమందికి మంకీ క్యాపులున్న స్వెట్టర్లను తెప్పించి అందజేస్తున్నారు. ఇప్పటికే కొంత మందికి అందజేయగా, మరికొంత మందికి అందజేసేందుకు  అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

- వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో 6 వసతిగృహాలుండగా, వాటిల్లో 771 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా వికలాంగులే కావడంతో ఇటీవలీ కాలంలో పెరుగుతున్న చలితీవ్రతతో తట్టుకోలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి ఉలెన్‌ రగ్గులను పంపిణీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో గల 35 వసతి గృహాల్లోని 35,00 మంది చిన్న పిల్లలకు స్వెట్టర్లు, మంకీ క్యాపులు, పెద్ద వారికి ఉలెన్‌ రగ్గులు పంపిణీచేశారు. ఇందుకోసం రూ.  రూ. 9 లక్షలు వెచ్చించారు.
- బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సైతం 12 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లోని 795 మంది పిల్లలకు ఉలెన్‌ రగ్గులను పంపిణీచేశారు.
- గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 4 ప్రీమెట్రిక్‌ వసతిగృహాలుండగా, వీటిల్లో 740 మందికి పిల్లలు చదువుకుంటుండగా,  స్వెట్టర్లు, రగ్గులను పంపిణీచేశారు.

సోలార్‌వాటర్‌ హీటర్లు సైతం..

వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ ఆధ్యర్యంలోని ప్రీ మెట్రిక్‌ వసతిగృహాలకు సోలార్‌ వాటర్‌హీటర్లకు అందజేశారు. ఇలాంటివి జిల్లాలో 11 వసతిగృహాలుండగా, ఒక్కోదానికి రెండు చొప్పున 2 సోలార్‌ వాటర్‌ హీటర్లను సైతం సమకూర్చారు. విద్యార్థులకు సరిపోయేట్లుగా 500 లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ హీటర్లకు ఒక్కోదానికి రూ. 49,500 వెచించి కొనుగోలు చేసి అందజేశారు.  పిల్లలంతా వేడినీటితో స్నానాలు చేస్తూ ఉపశమనం పొందుతున్నారు.


logo