గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Jan 09, 2020 , 19:14:57

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మున్సిపల్ నిబంధనలను అతిక్రమించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఈవీడీఎం) డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించేవారికి ప్రస్తుతం తమ ఒక్క విభాగమే నోటీసులు జారీచేస్తూ జరిమానా లు విధిస్తుండగా, వచ్చే ఏప్రిల్ నాటికి దశలవారీగా అన్ని విభాగాలకూ ఈ అధికారాలను విస్తరించనున్నట్లు ఆయ న తెలిపారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రజలు కూడా ఫిర్యాదు చేసే విధంగా నెలరోజుల్లో తగిన అవకాశం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. సోమవారం బుద్ధభవన్‌లో విశ్వజీత్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ-ఆఫీసు విధానంలో భాగంగా ఈవీడీఎం విభాగంలో మ్యాన్యువల్ పద్ధతికి స్వస్తిపలికి గత మూడునెలలుగా అమలుచేస్తున్న ఈ-నోటీసులు, ఈ-చాలాన్ల ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు.

నకిలీ నోటీసులను నిరోధించడంతోపాటు పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ప్రతి నోటీసులు క్యూ.ఆర్ కోడ్‌తోపాటు యూ నిక్ ఐడీ నెంబర్ కూడా ఉంటుందన్నారు. దీని ఆధారంగా పౌరులు ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదులు సేకరించి జరిమానాలు విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లు, ఖాళీ జాగా ల్లో చెత్త వేయడం, దుకాణాల ముందు చెత్తవేయడం, రోడ్లు, నాలాల్లో వ్యర్థా లు పారవేయడం, బహిరంగ ప్రదేశాల్లో మల-మూత్ర విసర్జన, గోడరాతలు, గోడపత్రాలు, బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటు, రోడ్లు, నాలాలు, చెరువుల్లో నిర్మాణ వ్యర్థాలు పారవేయ డం తదితర ఉల్లంఘనలకు పాల్పడేవారికి సంబంధించి ఫోటోలు తీసి ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పంపితే వాటిని పరి ఎశీలించి సంబంధిత వ్యక్తులను గుర్తిస్తామన్నారు. అంతేకాకుండా ఫిర్యాదుదారు వివరాలు కూడా గోప్యం గా ఉంచుతామని హామీ ఇచ్చారు. నెలరోజుల్లోనే ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.

అనధికార ఫ్లెక్సీలు ముద్రిస్తే చర్యలు....
అనధికార బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, రోడ్లపై వ్యర్థాల డంపింగ్ తదితర అన్నీ కలిపి గడచిన మూడు నెలల్లో 4,61,783 తొలగించడంతోపాటు 34వేలమందికి నోటీసులు జారీ చేసినట్లు విశ్వజీత్ తెలిపారు. వీటికి సుమా రు రూ.17కోట్ల చాలాన్లు నమోదు చేసినట్లు, ఇవి చెల్లించని పక్షంలో వారి ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజులకు వీటిని అనుసంధానం చేసి వసూలుచేస్తామన్నారు. రూ.60.8లక్షల జరిమానాలు వసూలు చేశామన్నారు. అక్రమ ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తించేందుకు వాటిపై కచ్చితంగా ప్రచురణకర్త, ప్రతుల సంఖ్యను ముద్రించాలనే నిబంధన పెట్టి ప్రింటింగ్ ప్రెస్‌ల యజమానులకు నోటీసులు జారీచేశామన్నారు.

నెలాఖరులోగా ఆసుపత్రుల్లో తనిఖీలు పూర్తి....
ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని 1,842 ఆసుపత్రులకు నోటీసులు జారీ, అందులో 1000 ఆసుపత్రుల తనిఖీ పూర్తి చేసినట్లు చెప్పారు. నెలాఖరులోపు మిగిలిన ఆసుపత్రుల్లో తనిఖీలు కూడా పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించేలా చేసే ఉద్దేశంతోనే జరిమానాలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు నిరంతరం కొనసాగుతుందని విశ్వజీత్ తెలిపారు. ఇప్పటివరకు 136 కిలోమీటర్లపొడవున ఆక్రమణలు తొలగించినట్లు ఆయన చెప్పారు. అలాగే, 65 కిలోమీటర్లమేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. జోన్‌కు పదికిలోమీటర్ల చొప్పున ఫుట్‌పాత్‌ల నిర్మాణం కొనసాగుతున్నట్లు విశ్వజీత్ వివరించారు.


logo
>>>>>>