బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Jan 09, 2020 , 19:14:31

శివారుకు అదనపు జలాలు

శివారుకు అదనపు జలాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు చేపట్టిన మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా సామర్ధ్యాన్ని పెంచుతున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. రూ.756కోట్లతో ఔటర్‌ రింగు రోడ్డు లోపలి గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసే ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుపై మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్‌, శామీర్‌పేట, కీసర, కుత్బుల్లాపూర్‌, ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, మహేశ్వరం, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు మండలాల్లోని ఓఆర్‌ఆర్‌ లోపల 183 గ్రామాలు, ఏడు మున్సిపాలిటీల్లోని ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతున్నదని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రతి మనిషికి రోజుకు 125 లీటర్ల నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇంతకు ముందు ఆయా గ్రామాల్లో వారానికి ఒక రోజు మంచినీటి సరఫరా జరుగగా, ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు అనంతరం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతున్నదన్నారు. ఈ మున్సిపాలిటీల్లో మరింత మెరుగైన మంచినీటి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఎండీ వివరించారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ మున్సిపాలిటీల్లో 88 మిలియన్‌ లీటర్ల నీటి సరఫరా చేస్తున్నామన్నారు. అదనంగా మరో 25 మిలియన్‌ లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతాల్లో మరో 10 లక్షల మంది ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తీరనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 164 రిజర్వాయర్లకు గానూ 164 రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo