ఆదివారం 29 మార్చి 2020
Medchal - Jan 09, 2020 , 19:13:24

ఆర్టీసీలో ఉద్యోగులే ప్రతినిధులు

ఆర్టీసీలో ఉద్యోగులే ప్రతినిధులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : టీఎస్‌ ఆర్టీసీని బాగు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనకు అధికారులు శ్రీకారం చుట్టారు. సమ్మెలు చేస్తూ సంస్థను నష్టపరిచే యూనియన్ల జోక్యం ఉండవద్దని ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టిసారించారు. కార్మిక సంఘాలు లేకుండా ఆర్టీసీ ఉద్యోగులు డిపో ప్రతినిధులుగా ఉంటే సంస్థ లాభాల్లోకి వస్తుందని డిపోల వారీగా ఇద్దరు సభ్యులుగా వెల్ఫేర్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు వరాల వర్షం కురిపించిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారం కసరత్తు చేసిన డిపో మేనేజర్లు ప్రతీ డిపో నుంచి ఒక డ్రైవరు, ఒక కండక్టర్‌ను ఎంపిక చేశారు. ఇలా గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన 29 డిపోల నుంచి 58 మంది డ్రైవర్‌, కండక్టర్లను ఎంపిక చేశారు. ముఖ్యమంత్రితో ప్రగతిభవన్‌కు వచ్చిన ఉద్యోగుల్లో నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక చేశారు. సంస్థ మీద ప్రేమ, కార్మికుల సంక్షేమంపై అవగాహన ఉన్నవారే ఎంపికయ్యారని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రేటర్‌తోపాటు అంతర్‌జిల్లా, అంతర్‌రాష్ట్ర బస్సులకు సంబంధించిన హైదరాబాద్‌ 1, హైదరాబాద్‌ 2, హైదరాబాద్‌ 3 డిపోల నుంచి ఇద్దరి చొప్పున ఆరుగురు ఉద్యోగులను వెల్ఫేర్‌ కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.

సమస్యలను అధికారుల దృష్టికి తేవడమే బాధ్యత
సమస్యలను అధికారుల దృష్టికి తేవడమే వెల్ఫేర్‌ కమిటీ బాధ్యతగా నిర్ణయించారు. ప్రతీ డిపో పరిధిలోని ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం, బదిలీలు తదితర సమస్యలు వెల్ఫేర్‌ కమిటీ దృష్టికి తీసుకువస్తే సదరు సమస్యలను రీజినల్‌ మేనేజర్ల దృష్టికి తీసుకువస్తారు. అయితే వెల్ఫేర్‌ కమిటీ సమావేశం 15 రోజులకోసారి నిర్వహించబడుతుంది. ప్రతీ 15 రోజులకోసారి నిర్వహించే ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, డిపోల్లో సౌకర్యాలను అధికారులకు వివరిస్తారు. దీంతో ఆర్‌ఎంలు, డీవీఎంలు, డిపో మేనేజర్లు, ప్రతీ డిపో నుంచి ఇద్దరు సభ్యులు పాల్గొంటారు. సమస్యలు విన్న ఆర్‌ఎంలు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రీజియన్‌ల ఆర్‌ఎంలు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ దృష్టికి తీసుకువస్తే పరిధిలో ఉన్న సమస్యలను ఈడీ సమక్షంలో పరిష్కరించబడుతాయి. పరిష్కరించలేని అంశాలను, సమస్యలను మూడు నెలలకోసారి నిర్వహించే రాష్ట్రస్థాయి సమావేశంలో ప్రతిపాదిస్తారు. గతంలో ఇటువంటి కార్యక్రమాలన్ని కార్మిక సంఘాల నేతృత్వంలో జరిగేవి. యూనియన్ల వల్లనే సంస్థ నష్టపోతుందని గ్రహించి ఈ పద్ధతికి స్వస్తి పలికి సరికొత్త ఆలోచనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వెల్ఫేర్‌ సొసైటీ ఏర్పాటు, సభ్యుల నియామకం జరిగింది.


logo