శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Jan 09, 2020 , 19:11:21

ఏడుగురు వెళ్తుండగా.. దవాఖాన లిఫ్ట్‌ ఆగింది

ఏడుగురు వెళ్తుండగా.. దవాఖాన లిఫ్ట్‌ ఆగింది

అమీర్‌పేట్‌, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలోని ఓపీ బ్లాక్‌లో లిఫ్ట్‌ ఆకస్మాత్తుగా నిలిచిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే... దవాఖానలోని ఓపీ బ్లాక్‌లో లిఫ్ట్‌ మధ్యాహ్నం 1 గంట సమయంలో 7వ అంతస్తు నుంచి కిందకు వస్తున్నది. ఈ క్రమంలో 5 నుంచి 6వ అంతస్తు మధ్యలో లిఫ్ట్‌ ఒక్కసారిగా నిలిచిపోయింది. అందులో ఉన్న వారు బయటి వారికి సమాచారం అందించేందుకు ఎటువంటి సదుపాయాలు లిఫ్ట్‌లో లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. లిఫ్ట్‌లో రెండు నెలల బాబు, స్ట్రెచర్‌పై రోగి సహా ఏడుగురు చిక్కుకుపోవడంతో లోపల నుంచి హాహాకారాలు మొదలయ్యాయి. ఇంతలో లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిలో కే.వీ.చారి అనే వ్యక్తి సమయస్ఫూర్తితో 101కు ఫోన్‌ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 5 నిమిషాల వ్యవధిలో ఈఎస్‌ఐ దవాఖానకు చేరుకున్నారు. సనత్‌నగర్‌ అగ్నిమాపక అధికారి ప్రదీప్‌కుమార్‌, ఫైర్‌మెన్‌ లిఫ్ట్‌ బటన్‌ను వినియోగించి లిఫ్ట్‌ను క్షేమంగా కిందకు దించారు. లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఏడుగురు క్షేమంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


logo