శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Jan 28, 2020 , 03:13:10

నల్లా వస్తుంది.. నీళ్లు పట్టుకోండి !

నల్లా వస్తుంది.. నీళ్లు పట్టుకోండి !


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మరికొద్ది సేపట్లో నల్లా వస్తుంది.. నీళ్లు పట్టుకోండి... అంటూ జలమండలి వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ముందస్తు సమాచారం చేరవేస్తున్నది. నల్లా .. ఎప్పుడొస్తుందోనని కాళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే పరిస్థితుల నుంచి ముందుగానే నీటి సరఫరా సమయవేళలు తెలుపుతూ సేవలపై నమ్మకాన్ని పెంచుతున్నది. ప్రస్తుతం సంజీవరెడ్డి నగర్‌ డివిజన్‌ పరిధిలోని ఫతేనగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ సెక్షన్‌లో ఆమలు చేస్తున్నారు. సంబంధిత లైన్‌మెన్లు ఆయా పరిధిలోని వాల్వ్‌లకు ప్రత్యేక నంబర్లను కేటాయించారు. వాల్వ్‌ తిప్పి కొద్ది సేపట్లో నీటి సరఫరా విడుదల చేస్తామనుకునే సందర్భంలో ఆయా లైన్‌మెన్‌ ప్రత్యేక యాప్‌ ద్వారా సంస్థ రికార్డులో క్యాన్‌ నంబరు ఆధారంగా ఉన్న నమోదైన వినియోగదారుల ఫోన్‌నంబర్లకు సమాచారం చేరవేస్తున్నారు. 


మీరుంటున్న ప్రాంతంలో మరో పది నిమిషాల్లో నల్లా వస్తుందని, నీళ్లు పట్టుకోవాలంటూ ఆప్రమత్తం చేయడం ద్వారా ఇరువురుకి లబ్ధి జరుగుతున్నది. నిరీక్షణ అక్కర్లేకుండా సమయానికి అవసరమైన నీటిని వినియోగిస్తున్నామని వినియోగదారులు పేర్కొంటుండగా, నీటి వృథాను అరికట్టేందుకు ఎంతగానో దోహదపడుతుందని, నీటి వాడకం తగ్గట్టుగా బిల్లులు జారీ చేస్తుండడంతో వినియోగదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు. తొలివిడతగా 12980 (క్యాన్‌ నంబరు) మంది వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లతో అలర్ట్‌ చేస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతున్న జలమండలి త్వరలోనే అన్ని డివిజన్లలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. 


logo