e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home మెదక్ పద్మనాభునిపల్లి ప్రగతిలో మెరిసె

పద్మనాభునిపల్లి ప్రగతిలో మెరిసె

  • పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
  • రోడ్ల వెంట ఆహ్లాదం పంచుతున్న చెట్లు
  • పచ్చదనం, స్వచ్ఛతకు బాటలు
  • పాత బావుల పూడ్చివేత.. పురాతన ఇండ్ల కూల్చివేత

పల్లె ప్రగతితో వేగంగా అభివృద్ధి పనులు,. పక్కాగా పారిశుధ్యం, హరితహారంతో పచ్చని మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతుండడంతో పద్మనాభునిపల్లి అందంగా మారింది. గ్రామంలో నిత్యం పారిశుధ్య కార్మికులు పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి వీధిలో సీసీరోడ్లు నిర్మించడంతో తళతళ మెరుస్తున్నాయి. గ్రామ శివారులో ఏర్పాటైన పల్లెప్రకృతి వనం, ఫుడ్‌కోర్టు, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీలు పల్లె రూపురేఖలే మార్చేశాయి. ప్రతి నెలా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవుతుండడంతో అభివృద్ధిలో దూసుకుపోతుంది. జిల్లాస్థాయిలోనే ‘స్వచ్ఛ పద్మనాభునిపల్లె’గా ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు సొంతం చేసుకుంది. ఇందుకు ఆ గ్రామ సర్పంచ్‌ కండ్లకోయ పరశురాములు, వార్డు సభ్యుల కృషి అభినందనీయం. – దుబ్బాక ఆగస్టు 3

పల్లెప్రగతి కార్యక్రమంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలోని రోడ్లకిరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహాదాన్ని పంచుతున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెలో శిథిలావస్థకు చేరిన నాలుగు పాత ఇండ్లు, మూడు పాత బావులను పూడ్చివేశారు. గ్రామ శివారులో నిర్మించిన వైకుంఠధామానికి వెళ్లేందుకు రూ.8లక్షలతో కిలోమీటర్‌ వరకూ సీసీరోడ్డును నిర్మించారు. గ్రామంలో 1,412 జనాభా ఉండగా.. పురుషులు 710, మహిళలు 702 మంది ఉన్నారు. మొత్తం ఎనిమిది వార్డులు, 330 ఇండ్లు, 953 ఓటర్లు ఉన్నారు. 314 మంది రైతులకు రూ.32లక్షల 28వేల రైతుబంధు అందుతున్నది. అదేవిధంగా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, 22 మందితో మత్స్యకారుల సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు.

- Advertisement -

పెరిగిన సాగు విస్తీర్ణం..
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో పద్మనాభునిపల్లికి ‘ఎవుసం’ పండుగ వాతావరణం తెచ్చింది. గ్రామం నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు సైతం గ్రామానికి తిరిగి వచ్చి ఎవుసం చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు గ్రామంలో 500 ఎకరాల్లో మాత్రమే పంట సాగయ్యేది. కానీ నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 670 ఎకరాలు సాగు చేస్తున్నారు. బీడు భూములు సాగులోకి రావటంతో గ్రామం పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నది. పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుండడంతో రైతులు లబ్ధిపొందుతున్నారు. గత రబీలో 76,638 క్వింటాళ్ల వరిధాన్యాన్ని పండించామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చెరువు, కుంటల్లో చేపల పెంపకం..
గ్రామంలోని చెరువు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండటంతో మత్స్యకారులు చేపలు పెంపకంపై దృష్టి సారించారు. గ్రామంలో త్వరలోనే మల్లన్నసాగర్‌ కాల్వ ద్వారా సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు, కుంటలు నిండుకుండలా మారాయి. గతేడాది 24మంది మత్స్యకారులు సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం సబ్సిడీపై అందించే చేప పిల్లలను చెరువు, కుంటల్లో వేయటంతో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు.

అందరి సహకారంతో..
పద్మనాభునిపల్లిను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమష్టి కృషితో పారిశుధ్య పనులు మెరుగుపడ్డాయి. నిత్యం పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను ట్రాక్టర్‌ ద్వారా సేకరించి, డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ పంచాయతీలో పాలకవర్గం సభ్యు లు, ఐకేపీ మహిళలు, యువజన సంఘాల వారందరూ కలిసి ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పా టు చేసుకొని గ్రామంలో ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నా రు. ప్రజలు ఇంటి ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తే పంచాయతీ పాలకవర్గం రూ.5వందల జరిమా నా విధిస్తున్నది. గ్రామంలో ఇంటింటికీ రెండు తడి, పొడి చెత్త బుట్టలను అందజేశారు. గ్రామ నర్సరీ, పల్లె ప్రకృతివనంలో మొక్కలకు నీరు పెట్టేందుకు ఇద్దరు దివ్యాంగులకు ఉపాధి కల్పించారు.

గ్రామంలో అభివృద్ధి పనులు..
పద్మనాభునిపల్ల్లిలో గతేడాదిలో రూ.1.5 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.70 లక్షలతో సీసీ రోడ్లు, రూ.12.5లక్షలతో వైకుంఠధామం, రూ.2.5లక్షలతో డంపింగ్‌యార్డు, రూ. 2లక్షలతో పల్లె ప్రకృతివనం, రూ.8లక్షలతో వైకుంఠధామానికి వెళ్లేందుకు కిలోమీటర్‌ మేరా సీసీరోడ్డును నిర్మించారు. రూ. 9.5లక్షలతో ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ కొనుగోలు చేశారు. గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలం 2ఎకరాల్లో 8 వందల పండ్ల మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు.

సమష్టి కృషితోనే ‘ప్రగతి’..
సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో ప్రజలతో అనుబంధాన్ని మరింత పెంచింది. గ్రామ అభివృద్ధికి అధికారులు, పంచాయతీ పాలక వర్గం, ప్రత్యేకంగా గ్రామస్తుల సహకారం చాలా బాగుంది. గ్రామానికి జిల్లా స్థాయిలో గుర్తింపు రావటం ఎంతో అనందాన్ని ఇచ్చింది. ప్రభుత్వం ప్రతి నెలా మంజూరు చేస్తున్న నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం. గ్రామ పరిశుభ్రత కోసం ఎవరైనా ఆరుబయట చెత్త, బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తే జరిమానాలు విధిస్తున్నాం.

  • కండ్లకోయ పరశురాములు, పద్మనాభునిపల్లి గ్రామ సర్పంచ్‌

మా పల్లె ఇప్పుడు బాగుంది..
మా పల్లె ఇప్పుడు బాగుంది. గత ఉమ్మడి రాష్ట్రంలో మా పల్లెలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం కనిపించేది. గ్రామంలో అడుగు పెడితే అధ్వానంగా మారిన గుంతల రోడ్లు దర్శనమిచ్చేవి. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మా పల్లె రూపురేఖలే మారిపోయాయి. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, నర్సరీలతో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మా పల్లెను విడిచిపెట్టి పోవాలంటే మనసొప్పటం లేదు. గ్రామ సభ నిర్వహించి గ్రామంలో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించుకుంటున్నాం.

  • యాదగిరి , సీనియర్‌ సిటిజన్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana