e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home మెదక్ ఆస్తుల వివరాలకు భువన్‌

ఆస్తుల వివరాలకు భువన్‌

  • ఒకే గొడుగు కింద అసెస్‌మెంట్‌ వివరాలు
  • యాప్‌ను రూపొందించిన సీడీఎంఏ శాఖ
  • రెండోదశ సర్వే ప్రారంభం

మెదక్‌ మున్సిపాలిటీ, ఆగస్టు 3 : జిల్లాలోని మున్సిపాలిటీల్లో అసెస్‌మెంట్ల (ఆస్తుల) వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌తో ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కసరత్తు చేస్తున్నది. ఇందుకు గానూ ప్రత్యేకంగా ‘భువన్‌ యాప్‌’ను రూపొందించింది. ఈ యాప్‌లో ఇంటి నంబర్‌తో పాటు వివరాలు నమోదు చేస్తే చాలు శాటిలైట్‌ వ్యవస్థ ఆధారంగా ఆస్తి వివరాలన్ని కనిపిస్తాయి. ఈ వివరాల లింకులన్నీ ఆ శాఖ ప్రధాన సర్వర్‌కు అనుసంధానమై ఉంటాయి. వివరాల సేకరణకు తాజాగా రెండోసారి సర్వే ప్రారంభమైంది. వాస్తవానికి గతేడాది జూలై, ఆగస్టులోనే ఈ సర్వే నిర్వహించాల్సి ఉంది. కొవిడ్‌ కారణంగా వాయిదా వేశారు. అసెస్‌మెంట్లను మ్యాపింగ్‌ చేసి ఆదాయం సుమకూరేలా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ డైరెక్టర్‌ సత్యనారాయణ జూన్‌ 24న కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇస్రో, సీడీఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో 2017లో ఈ యాప్‌ రూపొందించారు.

- Advertisement -

అనంతరం మున్సిపాలిటీల్లో నాలుగైదు నెలల పాటు తొలిసారి సర్వే చేశారు. సాధ్యమైనన్ని భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో యాప్‌లో పొందుపరిచారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ అప్‌లోడ్‌ బాధ్యతలను బిల్‌ కలెక్టర్లకు అప్పగించారు. కొందరికి దీనిపై పూర్తి అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వందశాతం ఆస్తుల వివరాలను నమోదు చేయలేకపోయారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో భవనాల నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. కొత్త నిర్మాణాల వివరాలను ఆన్‌లైన్‌ చేయకపోవడంతో పన్ను ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.. కొవిడ్‌ తర్వాత ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న పురపాలికలకు కొంతైనా ఆదాయం ఊరటనిచ్చేందుకు అసెస్‌మెంట్లను వందశాతం గుర్తించే లక్ష్యంతో మలిదశ సర్వే చేపడుతున్నారు.

మూడు శాఖలతో అనుసంధానం..
యాప్‌ సర్వర్‌ను మున్సిపల్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలతో అనుసంధానం చేశారు. పట్టణాల పరిధిలో ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. తప్పుడు రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి వీలు పడుతుంది. అక్రమ నిర్మాణాలకు తావు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీల్లో అసెస్‌మెంట్ల నిగ్గు తేల్చడానికి సమగ్ర సమాచారం అందుబాటులో రానుండడంతో ఇది సాధ్యమేనన్న వాదన ఉంది. శాటిలైట్‌ సాయంతో అన్ని నిర్మాణాల చిత్రాలను అక్షాంశాలు, రేఖాంశాల వివరాలతో సహా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనుండడం విశేషం.

సర్వే నిర్వహణ ఇలా..
భువన్‌ యాప్‌ను ఇప్పటి వరకు బిల్లు కలెక్టర్‌ వినియోగించేవారు. సిబ్బంది కొరతతో మున్సిపల్‌ ఆర్వో, ఆర్‌ఐ, మేనేజర్లు తదితర సిబ్బందితో త్వరలోనే శిక్షణనివ్వనున్నారు. సర్వే చేసే వారందరికీ అండ్రాయిడ్‌ సెల్‌ ఫోన్లు తప్పనిసరి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని కేటాయించిన వార్డు పరిధిలో ఇండ్ల వివరాలు నమోదు చేస్తారు. భవనంపైకి వెళ్లి జీఐఎస్‌ ద్వారా యాప్‌లో ఇంటి నంబర్‌ను నమోదు చేయాలి. సెర్చ్‌ అనే చోట క్లిక్‌ చేస్తే ఆ నివాసం హద్దులు, అక్షాంశాలు, రేఖాంశాలతో సహా కమిపిస్తాయి. వాటిని చిత్రం తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఒకవేళ అది పెంకుటిల్లు, రేకుల ఇల్లు అయితే గుమ్మం ఎదుట నిల్చోని ఫొటో తీసి శాటిలైట్‌ వివరాలు నమోదు చేస్తారు. నల్లాల కనెక్షన్లు లెక్కిస్తారు. దీంతో భవనం ఇల్లు ఏదైనా వాస్తవ ఆధారాలనే నమోదు చేసే వీలుంటుంది. దీని వలన ఆస్తి పన్ను మదింపు పక్కాగా ఉంటుంది. పురపాలికలకు ఆదాయం పెరుగుతుంది. ఆస్తి విషయాల్లో సిబ్బంది సాయంతో తప్పుదోవ పట్టించేందుకు అవకాశం ఉండదు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 16 బల్దియాలు..
మెదక్‌ జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, అందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, బొల్లారం, అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వాటిని యంత్రాంగాలు పరిశీలిస్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana