e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు ప్ర‌గ‌తి ప‌ర‌వ‌ళ్లు

ప్ర‌గ‌తి ప‌ర‌వ‌ళ్లు

ప్ర‌గ‌తి ప‌ర‌వ‌ళ్లు
  • ప్రత్యేక తెలంగాణలో అందుతున్న అభివృద్ధి ఫలాలు
  • అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మెతుకుసీమ
  • అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
  • రైతుల అభ్యున్నతికి విశేష కృషి
  • బంగారు తెలంగాణ దారిలో సాగుతున్న పయనం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేండ్ల కాలంలో మెతుకు సీమ దశ తిరిగింది. పూర్వ మెదక్‌ను ప్రభుత్వం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలుగా ఏర్పాటు చేసింది. దీంతో పాలన ప్రజలకు మరింతగా చేరువైంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు విజయవంతం గా అమలు అవుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి, 42 క్వింటాళ్ల దిగుబడి సాధించారని, రైతులకు లాభం చేకూర్చే ఈ పద్ధతిని జిల్లాలో ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేట రూరల్‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో వరిలో వెద సాగు చేస్తున్న పంగ ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం మంత్రి హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో సందర్శించారు. వెద పద్ధతిలో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌ వన్‌గా ఉండాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ వానకాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలు ఏర్పాట్లపై మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, రైతుబంధు సమితి సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

  • సిద్దిపేట అర్బన్‌/సిద్దిపేట కలెక్టరేట్‌/మెదక్‌, జూన్‌ 1

పోరాడి సాధించుకున్న తెలంగాణకు నేటికి ఏడేండ్లు… తెలంగాణ సాధనలోనే కాదు.. అభివృద్ధిలోనూ పాలకులు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించడంతో మెతుకుసీమ రూపురేఖలు మారాయి.. కాళేశ్వర జలాలు జిల్లాలో పరుగులు తీస్తున్నాయి. కాలువలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతున్నది. సంగారెడ్డి జిల్లాకు మెడికల్‌, గిరిజన రెసిడెన్షియల్‌ లా కాలేజీల రాకతో జిల్లా ఉన్నత చదువులకు కేంద్రంగా మారుతున్నది. సింగూరు జలాలకు తోడు హల్దీ వాగు ద్వారా గోదావరి జలాల రాకతో మెదక్‌ జిల్లా సస్యశ్యామలంగా మారింది. మెదక్‌ జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రం ఆ గమ్యాన్ని చేరే క్రమంలో మరో మైలురాయిగా ఏడు వసంతాలు నిండిన సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల విశేషాలు నెమరువేసుకుందాం..

మెడికల్‌, గిరిజన లా కాలేజీలు
సాగు, తాగునీటి రంగాల్లో పురోగతి
సంగమేశ్వ, బసవేశ్వర ఎత్తిపోతలతో సాగుకు ఊతం
అభివృద్ధి పథంలో పట్టణాలు, పల్లెలు

సంగారెడ్డి, జూన్‌ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ పాలనలో సంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి నేటికీ ఏడేండ్లు పూర్తి కాగా, ఈ కాలంలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో సంగారెడ్డి జిల్లా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతున్నది. పేద విద్యార్థులకు ఉన్న విద్యను అందజేసేందుకు ప్రభుత్వం సంగారెడ్డిలో గిరిజన లా కాలేజీ, మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు త్వరలోనే జిల్లాను ముద్దాడనున్నాయి. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానున్నది. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాగుండా త్వరలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించనున్నది. మరెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు బంగారు బాటలు వేస్తున్నది.

గోదావరి జలాలలతో సస్యశ్యామలం..
సంగారెడ్డి జిల్లాలోని 2617 చెరువులు, కుంటలకు మిషన్‌ కాకతీయ పనుల ద్వారా పూర్వవైభవం సంతరించుకున్నది. గత పాలకులకు విస్మరించిన సింగూరు ప్రాజెక్టును టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రూ.100 కోట్లతో ఆధునీకరించింది. దీంతో 40వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. కాగా, ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభు త్వం. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గోదావరి జలాల తరలింపు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగంగా జరిగేలా చూస్తున్నారు. మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించే కాల్వల నిర్మాణం పనులు సాగుతున్నాయి. కాల్వల నిర్మాణం ప్యాకేజీ పనులు 17, 18, 19 వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే 1.32 లక్షల ఎకరాలు అదనంగా సాగునీరు అందనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డి కెనాల్‌ను ప్రభుత్వం నిర్మిస్తుంది. సంగారెడ్డి కెనాల్‌ పనులు పూర్తయితే సంగారెడ్డి నియోజకవర్గంలోని 39వేల ఎకరాలకు సాగునీరందనున్నది. దీంతో ప్రభుత్వం రాబోయే రోజుల్లో కొత్తగా 7.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నది.

రెండింతలైన పంటల సాగు ..
స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో పంటల సాగువిస్తీర్ణం రెండింతలు పెరిగింది. సాగునీటి వనరుల లభ్యత పెరగటంతోపాటు ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌తో అన్నదాతలు ఆరుగాలం పంటలు పండిస్తున్నారు. రైతు బంధు నుంచి రైతు బీమా, ఎరువులు, విత్తనాల సరఫరా, పంట కొనుగోళ్లు సైతం ప్రభుత్వమే నిర్వహిస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్న ది. ప్రస్తుతం వానకాలం సీజన్‌లో 7 లక్షల ఎకరాలకు పైగా పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో రైతుబంధు పథకం కింద ప్రభుత్వం గత ఏడాది వానకాలంలో 2,88,261 మంది రైతులకు గానూ రూ.366.71 కోట్లు, యాసంగి సీజన్‌లో 2,94,008 మంది రైతులకు రూ.368.12 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుత వానకాలం సీజన్‌లో 3 లక్షల మంది రైతులకు రూ.400 కోట్ల వరకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు బీమా పథకం కింద ఇప్పటి వరకు 436 మందికికి రూ.5 లక్షల చొప్పున రూ.21.8 కోట్లను బాధిత కుటుంబాలకు అందజేశారు. రూ.47.06 కోట్లతో జిల్లాలో 116 రైతు వేదికలను నిర్మించారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో 144 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతులకు అండగా నిలిచింది.

సంక్షేమానికి పెద్దపీట ..
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోంది. జిల్లాలో అర్హులైన 1,43,976 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, బీడీకార్మికులకు ప్రతినెలా పింఛన్‌ అందజేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 2020-21 బ్యాంకు లింకేజీ ద్వారా రుణాల పంపిణీలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 15,339 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 546.23కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నారు. గ్రామీణా ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పిస్తున్నది. ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు అండగా నిలుస్తున్నది. గత ఏడాది 7543 మంది విద్యార్థులకు రూ.8.75 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్‌ డబ్బులు వారి ఖాతాల్లో జమచేసింది. అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ.5 నుంచి 6 కోట్లు విద్యార్థులకు మంజూరు చేస్తున్నది. బీసీ విద్యార్థులకు ఏటా 10వేల మందికిపైగా విద్యార్థులకు రూ.8కోట్ల ఉపకారవేతనాలను అందజేస్తున్నది. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నది.

అభివృద్ధి పథంలో పట్టణాలు, పల్లెలు..
ఏడేండ్ల స్వరాష్ట్ర పాలనలో సంగారెడ్డి జిల్లాలోని పట్టణాలు, పల్లెలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, జోగిపేట, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం మున్సిపాలిటల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది. అదేవిధంగా 647 గ్రామ పంచాయతీల్లో వైంకుఠధామాలు నిర్మించి, ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లను ప్రభుత్వం సమకూర్చింది. డంపింగ్‌ యార్డులను నిర్మించి ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చింది.

చదువులకు నిలయం..
సంగారెడ్డి జిల్లాలో ఐఐటీ, జేఎన్‌టీయూలు ఉండగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మొదటిసారిగా సంగారెడ్డిలో గిరిజన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్‌ లా కాలేజీని ఏర్పాటు చేసింది. ఇక్కడి ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను మంజూరు చేసింది. 150 సీట్లతో సంగారెడ్డిలో రాబోయే విద్యాసంవత్సరం నుంచి మెడికల్‌ కాలేజీ ప్రారంభం కానున్నది. ఈ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువకానున్నది.

పారిశ్రామిక రంగం పరుగులు ..

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, టీఎస్‌ఐపాస్‌ ద్వారా సులభంగా అనుమతులు లభిస్తుండటంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో కొత్తగా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో 40 వరకు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. అమీన్‌పూర్‌ మెడికల్‌ డివైజ్‌పార్కులో పది కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయి. పటాన్‌చెరు మండలం నందిగామలో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రామచంద్రాపురం మండలం వెలిమలలో రైల్వేవాగన్‌ తయారీ కంపెనీకి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితారెడ్డి గత ఏడాది శం కుస్థాపన చేశారు. ఆయా పరిశ్రమలతో స్థానికులకు ఉపాధి లభించనున్నది.

కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం..
సంగారెడ్డి జిల్లాకే మణిహారమైన సింగూరు ప్రాజెక్టుపై ఎగువ భాగంలో కొత్తగా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రెండు పథకాలు పూర్తయితే జహీరాబాద్‌, అందోలు, సంగారెడ్డి, నారాయణఖేడ్‌ నియోకవర్గాల్లో జిల్లాలో 2.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా 60వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

సంగారెడ్డి/ సిద్దిపేట కలెక్టరేట్‌/ మెదక్‌, జూన్‌ 1: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను మెతుకు సీమలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఆయా జిల్లా కేంద్రాలకు ప్రముఖులు హాజరు కానున్నారు. బుధవారం సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రాంగణంలో నిర్వహించుకునే ఈ సంబురాలకు రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌, సిద్దిపేట కలెక్టరేట్‌లో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ కలెక్టరేట్‌ ఆవరణలో జరిగే వేడుకలకు పశు సంవర్ధక, మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వేర్వేరుగా హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్నారని ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి అనంతరం కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఉదయం 9 గంటలకు జరిగే అవతరణ వేడుకలకు వచ్చే వారందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌
హుస్నాబాద్‌, జూన్‌ 1: రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపడమే సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎందరో ఉద్యమకారులు, అమరుల త్యాగాల ఫలితంగానే ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామన్నారు. తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ భాగస్వామ్యం ఎంతో గొప్పదన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టారని వివరించారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేశారన్నారు. దేశంలోనే ఎక్కడా అమలు కానీ సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు కావడం ప్రజల అదృష్టమన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

‘తెలంగాణ మా భాగ్యఫలం’
ఆవిర్భావ దినోత్సవంపై బిలాల్‌పూర్‌ ఉపాధ్యాయుడి కవిత
కోహీర్‌, జూన్‌1: మండలంలోని బిలాల్‌పూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు పండితుడు సందర్భాన్ని బట్టి కవితరాస్తుంటారు. బుధవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఓ కవితను రాసి తెలంగాణపై అభిమానాన్ని చాటుకున్నారు.


తెలంగాణ మా భాగ్యఫలం
త్యాగధనుల త్యాగఫలం
సిద్ధించిన ఉద్యమ ఫలం
ఇన్నేళ్లు వేచిన పుణ్యఫలం
బంగారు తెలంగాణ మా భాగ్యఫలం..
దివ్యక్షేత్రాల దైవ నిలయం
భాషా సంస్కృతుల భావ నిలయం
సాంప్రదాయాల సౌరభం
బతుకమ్మ బోనాల సంబురం
ఉద్యమాల పోరుగడ్డ..
పోరాటాల పురిటిగడ్డ
సింగరేణి సిరులగడ్డ
తెలంగాణ ఖనిజాల అడ్డ..
కాళోజీ యాస దాశరథి భాష
సినారె కవిత జ్ఞానపీఠ గ్రహీత
సబ్బండ వర్గాల సమరస వేదిక
బంగారు తెలంగాణ భవ్య చరిత..
పురోగతికై పయనించే నెరజాణ
కోటి కాంక్షల బంగారు తెలంగాణ
సుభిక్ష జీవన మాగాణ
నా తెలంగాణ కోటి రతనాల వీణ

బోయ వెంకటేశం, తెలుగు పండితుడు ,
గొటిగార్‌పల్లి, బిలాల్‌పూర్‌ జడ్పీ పాఠశాల
ఫోన్‌: 9491565518

ఏడేండ్లలో అభివృద్ధి పరుగులు
రికార్డు సమయంలో ప్రాజెక్టులు పూర్తి
దేశంలో ఎక్కడా లేనివిధంగా పునరావస కాలనీలు

సిద్దిపేట, జూన్‌ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నది. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లాను అగ్రగామిగా నిలుపుతున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి రికార్డు సమయంలో పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటిని అందించారు. పాలకుల సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ఇందుకు నిదర్శనం. మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంతో పాటు ప్రతి రైతుకు జీవిత బీమాను ప్రభుత్వం చేయించింది. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా గోదావరిజలాలను అందించి గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చింది. రోడ్లకు మహర్దశ వచ్చింది. సమీకృత మార్కెట్లు, మోడల్‌ రైతు బజార్లు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయి. విద్యార్థులకు సన్నబియ్యం భోజనంతో నాణ్యమై విద్యనందిస్తున్నది. రైతాంగానికి నాణ్యమైన కరెంటును ఇచ్చింది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. రైల్వే నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్‌ హబ్‌, ములుగులోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ తదితర పనులు ఎన్నో జరిగాయి. సిద్దిపేట మెడికల్‌ కళాశాల భవనం అందుబాటులోకి వచ్చింది. కలెక్టరేట్‌, పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ భవనాలు పూర్తి చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పునరావస కాలనీలు నిర్మించారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించనున్నారు.

అభివృద్ధి పరవళ్లు..
జిల్లాలో ఏడేండ్ల కాలంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా సుమారుగా 12 వేల పైచిలుకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కట్టి ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట కేసీఆర్‌ నగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను గత డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభిచారు. ములుగు వద్ద సుమారు 26 ఎకరాల్లో ఉద్యానవన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సిద్దిపేటలో మెడికల్‌ కళాశాల భవనం ప్రారంభించారు. అత్యాధునిక సమీకృత మార్కెట్‌ యార్డులు నిర్మించుకున్నాం. సిద్దిపేటలో రూ.20 కోట్లు, గజ్వేల్‌లో రూ.20 కోట్లతో రెండు సమీకృత మార్కెట్లను ప్రభుత్వం నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చింది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇవ్వడంతో పాటు రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నది. రైతు బంధు పథకం ద్వారా ఒక ఎకరానికి రెండు పంటలకు గాను రూ.10వేల పెట్టుబడి సాయం అందించారు. గత యాసంగిలో రూ.314 కోట్లు రైతు బంధు కింది అందించారు. వరుసగా ఏడో పంటకు రైతు బంధు అందిస్తూ దేశానికే ఆదర్శంగా ప్రభుత్వం నిలిచింది. ప్రతి 5 వేల ఎకరాలకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులకు సాగులో నూతన వంగడాలను తెలియజేస్తున్నారు. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించారు. త్వరలోనే జిల్లాలో రైలు కూత వినపడనున్నది. గజ్వేల్‌ వరకు రైలు ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు. జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం రోడ్లకు పెద్దఎత్తున నిధులను మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టడంతో పాటు విస్తరించింది. బ్రిడ్జిల నిర్మాణం, సీసీ రహదారులు వేసి అంతర్గత గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించింది. జిల్లాలో సింగిల్‌ రోడ్లు డబుల్‌ రోడ్లుగా పూర్తి చేశారు. అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, ఒంటరి మహిళలకు పింఛన్‌ అందిస్తున్నారు. నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉన్న 668 సర్వే నంబర్‌లోని 3 ఎకరాల సువిశాల 60 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.45 కోట్లతో జీప్లస్‌ 5 అంతస్తులతో ఐటీ టవర్లు రూపుదిద్దుకోనున్నాయి. ఈ పనులకు సీఎం కేసీఆర్‌ డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేశారు. ఈ ఐటీ టవర్లు సిద్దిపేటకు ఐకాన్‌గా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకంగా నిర్మించిన రంగనాయక్‌ సాగర్‌ ప్రాజెక్టు అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనున్నది. ఇటీవల దీనిని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్‌ రూ.100కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులు ముఖ్యమైనవి మాత్రమే చెప్పుకున్నాం. ఏడేండ్లలో ఇలా ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం.

సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట..
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రికార్డు సమయంలో పూర్తయ్యాయి. అతి త్వరలోనే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు. ఆ పనులూ దాదాపుగా పూర్తి కావచ్చాయి. జిల్లా నలువైపులా రిజర్వాయర్లు, కాల్వలు నిర్మాణం కావడంతో సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారింది. శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ (మిడ్‌ మానేరు) నుంచి అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్‌కు గోదావరి జలాలు గతేడాది నుంచి వస్తున్నాయి. అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లకు గోదావరి జలాలు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లూ బోరు బావులు, వర్షాధారంపై ఆధారపడి పంటలు పండించిన రైతులకు మంచి రోజులు వచ్చాయి. బీడు భూముల్లో గోదావరి జలాలు పారించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పం నెరవేరింది. జిల్లాలో గోదావరమ్మ జలసవ్వడులు చేస్తూంటే ఈ ప్రాంత రైతుల సంతోషానికి అవధుల్లేవు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపారు. మండు టెండల్లో మత్తళ్లు దుంకాయి. చివరి దశలో ఉన్న వరి పంటలను కాపాడింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కొండపోచమ్మ సాగర్‌ ముంపు గ్రామాల ప్రజలకు తున్కిబొల్లారం వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మించి ముంపు గ్రామాల ప్రజలకు అందించారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలకు గజ్వేల్‌ పట్టణం ముట్రాజ్‌పల్లి వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలని నిర్మించి అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి నిజాంసాగర్‌ వరకు నీటిని అందించి రికార్డు సృష్టించారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌ ద్వారా హల్దీవాగు, మంజీరా గుండా 90 కిలోమీటర్లు ప్రయాణించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల వద్ద నిజాంసాగర్‌లో గోదావరి జలాలు కలిశాయి. ఇది ఒక రికార్డు అని చెప్పాలి. ఈ 42 రోజుల కాలంలో 3.4 టీఎంసీల నీటిని హల్దీవాగు నుంచి నిజాంసాగర్‌ వరకు తరలించారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని అన్ని చెక్‌డ్యాంలను మండుటెండల్లో నింపారు. కూడవెళ్లి వాగుపై మొత్తం 39 చెక్‌డ్యాంలను మండుటెండల్లో పొంగిపొర్లాయి. కూడవెల్లి వాగుతో గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌, జగదేవ్‌పూర్‌, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని ఎగువమానేరు వరకు ప్రవహించి నింపింది. 2.2 టీఎంసీల నీటిని తరలించారు.

మెదక్‌ జిల్లాలో పెద్దఎత్తున అభివృద్ధి

పోరాటాల ఖిల్లాగా పేరుగాంచిన మెదక్‌ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చుతున్నది. మెదక్‌ జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల నిధులతో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ నిర్మాణాలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. మెదక్‌ పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. మెదక్‌-అక్కన్నపేట రైల్వే లైన్‌ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాకు గోదావరి జలాలు ఈ వేసవిలో చేరాయి. చెక్‌డ్యామ్‌లు, హల్దీ ప్రాజెక్టును నింపాయి. ఘనపురం ప్రాజెక్టుకు వనదుర్గాదేవి ప్రాజెక్టుగా నామకరణం చేసి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నది. సింగూర్‌ ప్రాజెక్టు నుంచి వనదుర్గాదేవి ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది.రికార్డు స్థాయిలో మెతుకు సీమలో పంటలు పండుతున్నాయి. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌గ‌తి ప‌ర‌వ‌ళ్లు

ట్రెండింగ్‌

Advertisement