శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Medak - Jan 22, 2021 , 01:26:38

బెంచ్‌కు ఒక్కరే..

బెంచ్‌కు ఒక్కరే..

  • ప్రాఠశాలల పునఃప్రారంభానికి  సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఏర్పాట్లు
  • తరగతి గదిలో 20 మంది ఉండేలా చర్యలు 
  • విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎన్‌వోసీలు తీసుకుంటున్న అధికారులు

సంగారెడ్డి, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్‌-19తో మూతబడిన విద్యాసంస్థలు మరో 10 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా 2020 మార్చి రెండో వారంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు మూతబడ్డాయి. 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మెదక్‌, సంగారెడ్డి జిల్లాలోని విద్యాశాఖ అధికారులు బడిని రెడీ చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు అన్ని 9వ తరగతి, ఆ పై తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెండు జిల్లాల్లోనూ అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. 

థర్మల్‌ స్క్రీనింగ్‌..

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తరువాతనే తరగతి గదిలోకి అనుమతి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లను విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు, కళాశాలలకు మంజూరయ్యే నిధుల నుంచి, మండల, మున్సిపాలిటీల్లో స్థానిక సంస్థల నిధులను వెచ్చించి థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు శానిటైజేషన్‌, క్లీనింగ్‌ వంటి అంశాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అప్పగించారు. 

ఎన్‌వోసీలు తప్పనిసరి...

విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే రెండు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎన్‌వోసీ (నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌)లను తీసుకుంటున్నారు. అలాగే పాఠశాలకు/కళాశాలలకు వచ్చే ప్రతి విద్యార్థికి మాస్కు తప్పనిసరని, మాస్కు లేని విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతీ బెంచ్‌ను ప్రతిరోజు శానిటైజేషన్‌ చేయడంతో పాటు  బెంచ్‌కు ఒక్కరు చొప్పున ప్రతి తరగతి గదిలో కేవలం 20 మంది ఉండేలా, 20 కంటే ఎక్కువ మంది ఉంటే ఏ, బీ, సీ సెక్షన్లుగా విభజించి విద్యార్థులకు వేరువేరు తరగతి గదులలో పాఠాలను బోధించేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల మధ్య ఆరు ఫీట్ల దూరం, తాగేందుకు ఎవరికి వారే బాటిల్‌ తెచ్చుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఒక విద్యార్థి పుస్తకాలు మరో విద్యార్థి ముట్టుకోకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.  

పరీక్షలకు సన్నద్ధం...

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలకు గడువు సమీపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముఖ్యంగా పదోతరతగతి, ఇంటర్‌ విద్యార్థులకు సిలబస్‌ను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే సంకల్పంతో ప్రభుత్వం 3వ తరగతి నుంచి ఆ పై తరగతుల విద్యార్థులకు టీ-శాట్‌, డీడీ యాదాద్రి ద్వారా సిలబస్‌ను బోధించడంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించారు. దాదాపుగా సిలబస్‌ పూర్తి కావొచ్చిందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

ముఖ్యమంత్రి ఆదేశాలతో...

ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుతుండటం. విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థల ఫునః ప్రారంభం అనివార్యంగా మారింది.  సీఎం కేసీఆర్‌ ఇటీవలే ప్రగతి భవన్‌లో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో విద్యాసంస్థలను 9వ తరగతి నుంచి ఆపై తరగతులను ఫిబ్రవరి 1వ తేది నుంచి ప్రారంభించాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. దీంతో మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులు 9వ, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్‌, డిగ్రీ, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

సంగారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలు, విద్యార్థుల వివరాలు..

జిల్లాలో మొత్తం 1,14, 084 విద్యార్థులు ఉండగా, సుమా రు 1,744 పాఠశాలలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 49,427 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో భా గంగా మొత్తం 17 కేజీబీవీలలో 2,125 మంది విద్యార్థులు ఉండగా, 12 మైనార్టీ సంక్షేమ పాఠశాలలో 1630 మంది విద్యార్థులు, 12 ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లలో 774 మంది, 1220 ఎంపీపీ, జెడ్పీ పాఠశాలలో 19,645 మంది, 5 ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పాఠశాలలో 210 మంది, 408 ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలో 15,761మంది, 37 ప్రభుత్వ పాఠశాలలో 1512 మంది, 10 టీఎస్‌ ఆదర్శ పాఠశాలలో 3790 మంది, 11 టీఎస్‌ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలో 2879 మంది, 6 టీఎస్‌ టీడబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలో 721 మంది, 2 టీఎస్‌ ఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలో 303 మంది, 4 టీడబ్ల్యూ శాఖ ఆశ్రమాల్లో 77 మంది విద్యార్థులు. మొత్తం 1744 పాఠశాలలో 49,427 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు - 21, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు - 124, డిగ్రీ కాలేజీలు 18 (ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు - 7, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు -11) ఉన్నాయి. 

మెదక్‌ జిల్లాలో విద్యాసంస్థలు, విద్యార్థుల వివరాలు..

మెదక్‌ జిల్లాలో మొత్తం 1061 పాఠశాలలు ఉన్నాయి. అం దులో ప్రాథమిక పాఠశాలలు 623, ప్రాథమికోన్నత పాఠశాలలు 133, ఉన్నత పాఠశాలలు 141, ప్రైవేటు పాఠశాలలు 119, కేజీబీవీ పాఠశాలలు 15, యూఆర్‌ఎస్‌ 1, మో డల్‌ స్కూల్స్‌ 7, మదర్సాలు 3, సోషల్‌ వెల్ఫేర్‌ 5, బీసీ వెల్ఫేర్‌ 1, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 1, ఆశ్రమ పాఠశాలలు 2, ఎయిడెడ్‌ పాఠశాలలు 2, మైనార్టీ పాఠశాలలు 3 ఉన్నాయి.  మొ త్తం సుమారు 1,14,084 మంది విద్యార్థులుండగా, వీరిలో 9,10వ తరగతులలో సుమారు 20,156 మంది విద్యార్థులున్నారు. అదేవిధంగా  జిల్లాలో మొత్తం 55 జూనియర్‌ కళాశాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 16, ప్రభుత్వ సెక్టార్‌ కళాశాలలు 24, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు 15 ఉన్నాయి. డిగ్రీ కళాశాలలు  మొత్తం 12 కళాశాలలు ఉండగా, అందు లో 2 ప్రభుత్వ, 10 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 

VIDEOS

logo