బుధవారం 27 జనవరి 2021
Medak - Jan 14, 2021 , 00:03:12

త్వరలో జిల్లాకు కాళేశ్వరం నీళ్లు

త్వరలో జిల్లాకు కాళేశ్వరం నీళ్లు

నాడు నీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు 

నేడు అవసరాలకనుగుణంగా సీఎం కేసీఆర్‌ పాలన

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

వనదుర్గప్రాజెక్టు గేట్లు ఎత్తి పొలాలకు నీళ్లు విడుదల

పాపన్నపేట, జనవరి 13 : రైతు శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన కొనసాగుతున్నదని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం వనదుర్గ ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు ఎఫ్‌ఎన్‌ కెనాల్‌ ద్వారా గేట్లు ఎత్తి నీటిని క్రిందకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్‌ ఆనకట్టకు నీరు వదులాలంటే రైతులంతా రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వచ్చేదని, నాయకులు సైతం మంత్రుల వెంట తిరగాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి రాగానే సమయానుకూలంగా రైతులకు అవసరమైనప్పుడు సింగూర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతున్నారని తెలిపారు. త్వరలో కాళేశ్వరం నీళ్లు జిల్లాకు రానున్నాయని, ఇవి వనదుర్గాప్రాజెక్టుకు చేరితే ఎంఎన్‌ ఎఫ్‌ఎన్‌ కెనాల్‌ ద్వారా చివరి గ్రామాలకు కూడా నీటి సౌకర్యం అందుతుందని చెప్పారు. ఈ సారి సింగూర్‌ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని, రైతులకు విడుతలవారీగా అవసరాల నిమిత్తం నీటిని వదులనున్నట్లు తెలిపారు. ఏడుపాయల వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా ఫతేనహార్‌ గేట్లను ఎత్తి ఆమె నీటిని వదిలారు. అనంతరం ఎఫ్‌ఎన్‌కెనాల్‌ వద్ద గంగమ్మకు పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు తాడెపు సోములు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బాలాగౌడ్‌, ఏడుపాయల ఈవో  శ్రీనివాస్‌ ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

 సింగూర్‌ నుంచి వనదుర్గ ప్రాజెక్టుకు చేరిన నీరు

సింగూర్‌ ప్రాజెక్టు నుంచి వనదుర్గాప్రాజెక్టుకు సోమవారం వదిలిన 0.35 టీఎంసీల నీరు బుధవారం వనదుర్గప్రాజెక్టుకు చేరుకున్నాయి. దీంతో ఆయకట్టు పరిధిలోని సుమారు 25వేల ఎకరాల వరి పంటకు లబ్ధి చేకూరనుంది. సింగూర్‌ ప్రాజెక్టులో ఈ సారి పూర్తిస్థాయి నీటిమట్టం ఉండటంతో ఆయకట్టు పరిధిలో పంటలు మొత్తం పండే అవకాశం ఉన్నందున రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మెదక్‌ అర్బన్‌, జనవరి 13 : ఆల్‌ ఇండియా బంజార సేవాలాల్‌ జిల్లా సమితి రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం ఆమె నివాస గృహంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెదక్‌ జిల్లా ఆల్‌ ఇండియా బంజార సేవాలాల్‌ సమితి అధ్యక్షుడు చాందీ రామ్‌, ప్రధాన కార్యదర్శి సోమ్యనాయక్‌చ ఉపాధ్యక్షులు హీరాలాల్‌ , గోపాల్‌, తారసింగ్‌, నర్సాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ధన్‌సింగ్‌, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo