గురువారం 04 మార్చి 2021
Medak - Jan 14, 2021 , 00:03:25

అతివేగానికి ముగ్గురు బలి

అతివేగానికి ముగ్గురు బలి

చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం 

చికిత్స పొందుతూ యువకులు మృతి

సింగూరు డ్యాం చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండల పరిధిలో ఘటన

మృతులు మెదక్‌ వాసులు

పుల్కల్‌/మెదక్‌ కలెక్టరేట్‌, జనవరి 13:సింగూరులో బంధువుల ఇంట్లో దినకర్మకు వచ్చి అనంతరం ప్రాజెక్టు చూడటానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు చెట్టుకు ఢీకొని గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందారు. సింగూరు డ్యాం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృత్యువాత పడటంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పుల్కల్‌ ఎస్సై నాగలక్ష్మి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గఫార్‌ కుటుంబం మెదక్‌ పట్టణం గాంధీనగర్‌లో నివాసముంటున్నారు.వీరి కుటుంబం 40 ఏండ్ల క్రితం సింగూరు నుంచి మెదక్‌ పట్టణానికి వలస వచ్చారు. సింగూరులో వీరి సమీప బంధువు మృతిచెందటంతో 40 రోజుల దినకర్మకు కుటుంబంతో సహా మంగళవారం సింగూరుకు వచ్చారు. దినకర్మ అనంతరం గఫార్‌ కొడుకులు సమీర్‌(18), జమీర్‌(17) గఫార్‌ చెల్లెలు కొడుకు సౌఫిక్‌(18)లు ద్విచక్రవాహనంపై సింగూరు డ్యాం చూడటానికి బయలుదేరారు. డ్యాం దగ్గరలో వెంకట్‌రెడ్డి ఫాం హౌస్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురుకి తీవ్ర గాయాలవగా కుటుంభసభ్యులు సంగారెడ్డి దవాఖానకు తరలించారు. ప్రమాదంలో సమీర్‌, జమీర్‌లు దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. సౌఫిక్‌ను ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. పుల్కల్‌ ఎస్‌ఐ నాగలక్ష్మి కేసునమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంభ సభ్యులకు అప్పజెప్పారు.

గఫార్‌ కుటుంబంలో విషాదం..

ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే గఫార్‌కు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు కాగా ఆడపిల్లలిద్దరూ చిన్న తనంలోనే అనారోగ్యంతో మృతిచెందారు. మగపిల్లలు సమీర్‌, జమీర్‌లు సింగూరు గ్రామంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. ఐదుగురు సంతానంలో ప్రస్తుతం ఒక్క కూతురు మాత్రమే ఉంది.40 ఏండ్ల క్రితం మృతుల తాతగారు సర్దార్‌ సింగూరు డ్యాం నిర్మాణంలో భూమి పోవడంతో ఉపాధి కోసం మెదక్‌ పట్టణానికి వలస వెళ్లారు.  

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి...

మెదక్‌ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బుధవారం సాయంత్రం మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌ పట్టణానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆమె వెంట మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌, కౌన్సిలర్‌ సమీయొద్దీన్‌తో పాటు తదితరులు ఉన్నారు.


VIDEOS

logo