సేవాతత్పరులు.. ఈ యువకులు

అభాగ్యులకు అండగా సేవా కార్యక్రమాలు
పేదలకు ఆపద్బాంధవులు..
కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు సాయం
నేడు జాతీయ యువజన దినోత్సవం
స్వామి వివేకానందుడే వారికి స్ఫూర్తిగా యువత ముందుకు కదులుతున్నారు. సమాజ సేవలో మేము సైతం అంటున్నారు. అభాగ్యులు.. అన్నార్థులు.. నిస్సాహయులకు అండగా ఉంటున్నారు. తమ వృత్తిపరమైన విధులతో పాటు సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాటివారికి తోచిన సాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఏ మాత్రం భయపడకుండా ఆపద్బంధావుల్లా మారారు. నేడు యువజన దినోత్సవం సందర్భంగా సామాజిక సేవలో తరలిస్తున్న యువకులపై ప్రత్యేకం కథనం..
- నమస్తే తెలంగాణ నెట్వర్క్
సమాజం కోసం ఏదైనా చేయాలని తలిచారు. అభాగ్యులు.. నిస్సాహాయులకు అండగా నిలిచారు. అన్నార్థులకు కడుపునింపుతున్నారు. తమకు ఉన్న దాంట్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ముందుండి సేవలందించారు. నేడు యువజన దినోత్సవం సందర్భంగా పలువురు యువకుల సేవలపై ‘నమస్తే’ ప్రత్యేకం కథనం.. యువతకు స్ఫూర్తిగా..
జహీరాబాద్, జనవరి 11 :
పేద ప్రజలకు అండగా ఉండి, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు టీఆర్ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్. పేదప్రజలకు చేయుతనిస్తూ, కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం చేయడంతో పాటు 40 రోజులు ఆహారాన్ని సరఫరా చేశాడు. నామ రవికిరణ్ చేస్తున్న సేవలను యువత స్ఫూర్తిగా తీసుకుంటున్నది. చదువులో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి, నగదు, బహుమతులు ప్రదానం చేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో ఇతర రాష్ర్టాలకు సైతం వెళ్లి కార్మికులకు ఆర్థిక సాయం చేయడంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సిర్గాపూర్, జనవరి 11 :
వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, గ్రామాభివృద్ధి కోసం పలు సామాజిక సేవలు చేపడుతూ తోటి యువకులందరిని ప్రోత్సహిస్తున్నాడు. విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి 15 ఏండ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ఇంతకి అతడు ఎవరు అనుకుంటున్నారా.. సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన మఠం అనీల్ కుమార్ స్వామి (ఆర్టీసీ కండక్టర్). ఆయన మంచి ఆలోచన విధానమే సిర్గాపూర్ యువత, స్థానిక సేవాభారతి యువజన సంఘానికి అధ్యక్షుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో సామాజిక సేవను మెరుగుపరుస్తూ ఆయన ప్రధానంగా అక్షరాస్యత, ఓటరు తదితర జాతీయ దినోత్సవాలు, ప్రముఖుల జయంతోత్సవ కార్యక్రమాలను తన తోటి యువకులతో చేపడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులు, యువకులు దురలవాట్లకు గురికాకుండా ‘వ్యసన్ముక్తి’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం రోజు సిర్గాపూర్‌లో యువకులతో స్వచ్ఛభారత్‌లో పారిశుధ్య కార్యక్రమాన్ని చేపడుతూ ప్రజలకు స్వచ్ఛత పై అవగాహన చేపడుతున్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో నీటి కొరతను దృష్టిసారించి, దాదాపు 15 గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు (మినరల్ వాటర్)ను స్వచ్ఛందంగా సరఫరా చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితులో కూడా నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రతి ఏడాది బతుకమ్మ , సంక్రాంతి పండుగ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులను బహూకరిస్తున్నారు. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించడమే కాకుండా, ఆర్టీసీ యాజమాన్యంతో పలుమార్లు ఉత్తమ కండక్టర్‌గా పురస్కారాలు కూడా అందుకొని అందరి మన్నలు పొందుతున్నాడు సిర్గాపూర్‌కు చెందిన మఠం అనిల్‌కుమార్ స్వామి.
సేవా దృక్పథంతో పని చేయడమే లక్ష్యం..
గ్రామ యువకులను ప్రోత్సహించి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడమే నా లక్ష్యం. గ్రామాభివృద్ధి కోసం ఇంకా సేవా కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నా.
- మఠం అనిల్‌కుమార్ స్వామి, సిర్గాపూర్
యువకుడి సేవలు అద్భుతం..
చిన్నకోడూరు, జనవరి11 :
కరోనా సమయంలో ఓ యువకుడు సేవా కార్యక్రమాలు చేపట్టి సినీ హీరోతో శభాష్ అనిపించుకున్నాడు. కరోనా నేపథ్యంలో చేసుకునేందుకు పనులు లేక.. లాక్డౌన్ కారణంగా ఇండ్లకే పరిమితమైన పేదలకు అండగా నిలిచాడు ఆ యువకుడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన శ్రీధర్ కర్ణం వినూత్నంగా ఆలోచించి పేదవారికి తన వంతుగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. సొంత డబ్బులతో సిద్దిపేటలో ఉండే పేద వారికి పులిహోర, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలను అందజేశాడు. తను ఒక్కడే కాకుండా తన స్నేహితులనూ కలుపుకొని సేవా కార్యక్రమాలను విస్తృతం చేశాడు. అంతేకాకుండా పేద పిల్లలకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ వంటివి అందజేశాడు. ఇలా చేసిన సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీరి సహాయసహకారాలు గమనించిన ఇతర జిల్లాల్లోని మిత్రులు కూడా సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. కష్టాల్లో ఉన్న పేదలకు అండగా నిలుస్తుండడంతో శ్రీధర్ కర్ణంతో పాటు అతడి స్నేహితులు పయ్యావుల నర్సింహులు, అనిల్, నాగరాజు, ఆడెపు నవీన్‌కుమార్, కొండపల్లి సంపత్, గడ్డం అజయ్‌రెడ్డి, కర్రె రాఘవులను పలువురు ప్రశంసించారు. సేవా కార్యక్రమాల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సినీ హీరో రామ్ స్వయంగా వీడియో కాల్ చేసి శ్రీధర్ కర్ణంతో పాటు అతడి మిత్రులను అభినందించాడు. సేవా కార్యక్రమాలు కొనసాగించాలని తన సహకారం ఉంటుందని హీరో చెప్పాడని శ్రీధర్ కర్ణం తెలిపారు.
పేదలకు సేవ చేయడం సంతోషంగా ఉంది..
పేదలకు సేవ చేయడం సంతోషంగా ఉంది. చేయూతనందిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతా. లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకోవడం మర్చిపోలేనిది. నాతో పాటు మిత్రులు సహాయసహకారాలు అందించారు. చేసిన సేవలకు సినీ హీరో రామ్ వీడియో కాల్ చేసి అభినందించడం చాలా సంతోషంగా ఉంది. - శ్రీధర్ కర్ణం
‘స్వచ్ఛ’ సేవకులు..
మనోహరాబాద్, జనవరి 11 :
మార్పు మన నుంచి మొదలైనప్పుడే ఏ పనిలోనైనా విజయం సాధిస్తాం.. ఒకటిగా చేరి.. పిడికిలి బిగించి బరిలో దిగితేనే మనసత్తాను చాటుతాం.. అని ఆ యువత సంకల్పించింది. పుట్టి పెరిగిన గ్రామానికి ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలనుకున్నారు. ఆ సందర్భం రానే వచ్చింది. ఓ రోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై.. అక్కడ గ్రామాభివృద్ధిలో ప్రజల పాత్ర, స్వచ్ఛభారత్, హరితహారం పనులపై యువత స్వయంకృషిపై ప్రశంసల జల్లు కురిపించారు. దీనిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆ క్షణం నుంచి తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలుపుకోవాలని నడుంబిగించారు. గౌరవనీయులైన సీఎం కేసీఆర్‌ను తమ గ్రామంలో పర్యటించాలంటే.. తమ గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా నిలుపుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా గ్రామంలో ఉన్న యువజన సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఒక్కటిగా చేరి ‘నేచర్ ఐకాన్ కూచారం’ పేరుతో యువజన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్ చేస్తూ రోడ్లను శుభ్రపర్చడం, కలుపు మొక్కలను తొలిగించడం, తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నేటికీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో వందల సంఖ్యలో మొక్కలు నాటి చిట్టడివిని సృష్టించారు. వృథాగా ఉన్న ఎత్తైన కొండను రాక్ గార్డెన్‌గా మలుచుతున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలుపుకోవడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ సేవకులు’గా పని చేస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం 2018లో తెలంగాణ ఆవిర్భావం రోజున నేచర్ ఐకాన్ కూచారం యువజన సంఘం సభ్యులందరికీ అవార్డులను ఇచ్చి ఘనంగా సత్కరించింది.
ప్రజా సే(యు)వకుడు..
కోహీర్, జనవరి11 : కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ఓ యువకుడు నడుం భిగించాడు. నిరుపేదలకు అండగా నిలుస్తూ వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయిప్రణీత్‌రెడ్డి ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తన తండ్రి మాజీ జడ్పీటీసీ అరవింద్‌రెడ్డి గత సంవత్సరం జూలై 16వ తేదీన కరోనాతో మృతి చెందాడు. దీంతో అప్పటినుంచి తన గ్రామంలో మరొక కుటుంబానికి కష్టం రాకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే అరవింద్‌రెడ్డి పేరున సంస్థను నెలకొల్పి, వివిధ సేవాకార్యక్రమాలను ప్రారంభించారు. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గ్రామంలో కషాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయించాడు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి మాస్క్‌లు, శానిటైజర్ బాటిల్స్‌ను పంపిణీ చేశాడు. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో చలి నుంచి రక్షణ పొందేందుకు పోతిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామంలోని 400మంది నిరుపేదలు, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశాడు. 25 ఏండ్ల వయస్సులోనే ఇంతటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయం.
ఆస్ట్రేలియాలోనూ పేద విద్యార్థులకు..
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ స్రవంతీఅరవింద్రెడ్డి దంపతుల కుమారుడు సాయిప్రణీత్‌రెడ్డి ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్నాడు. తనతో పాటు ఉన్న విద్యార్థులకు కూడా కరోనా సమయంలో అన్ని రకాల నిత్యావసర సరుకులను అందజేశాడు. మొత్తానికి తాను జన్మించిన గ్రామంతో పాటు తాను చదువుకునే ప్రాంతంలో కూడా అండగా విద్యార్థులకు నిలబడడం ఇక్కడి ప్రజలు గర్వించదగిన విషయం.
నాన్న చూపిన దారిలో..
నా తండ్రితో పాటు మా కుటుంబం మొత్తం ప్రజా సేవకు అంకితమయ్యారు. నాన్న చూపిన బాటలో నేను నడుస్తున్నాను. కష్టకాలంలో ఎవరున్నా.. వారిని తప్పకుండా ఆదుకోవాలని ఎన్నోసార్లు చెప్పేవారు. అందుకే నేను కూడా నాకు తోచిన సహాయం చేస్తున్నాను.
- సాయిప్రణీత్‌రెడ్డి, కోహీర్ మండలం
పోతిరెడ్డిపల్లి సమాజ సేవలో..
హత్నూర, జనవరి11 : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో సమాజసేవకు ఓ యువకుడు ముందడుగు వేసి ఎంతో మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చిన్ననాటి నుంచే సేవాభావం అలవరుచుకున్న ఆ యువకుడు సమాజానికి తన తోచిన సాయం చేస్తున్నాడు. అంతేకాకుండా తనతోటి స్నేహితులను తానుచేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం కోసం ‘గమ్యం అసోసియేషన్'ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలను ముందుకుతీసుకెళ్తున్నాడు. హత్నూర మండలం చందాపూర్ గ్రామానికి చెందిన బక్కన్నగారి సురేందర్‌రెడ్డి. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తల్లి సంరక్షణలో పెరిగాడు. తమకు ఉన్నదాంట్లో ఎంతోకొంత సేవాకార్యక్రమాలకు ఉపయోగించాలని తన తల్లి సూచించడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. కరోనా సమయంలో ఎంతో మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశాడు. హత్నూర మండలంతో పాటు నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని వివిధ గ్రామాల్లో అనాథలు, దివ్యాంగులు, వృద్ధాప్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారిని గుర్తించి నెల రోజులకు సరిపడా సరుకులను అందజేశాడు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కుర్చీలు, ఫ్యాన్లు, వీల్చేర్స్, ఆట వస్తులతో పాటు నగదును అందజేశాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ సమాజసేవకు యువత ముందుకురావాలని కోరుతున్నారు.