సోమవారం 08 మార్చి 2021
Medak - Jan 09, 2021 , 00:22:23

ఐదేండ్ల తర్వాత మురవనున్న ఆయకట్టు

 ఐదేండ్ల తర్వాత మురవనున్న ఆయకట్టు

  • ఘనపూర్‌ వనదుర్గా ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదల 
  • ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు నిర్ణయం 
  • 12 దఫాలుగా 4.06 టీఎంసీల నీటి విడుదలకు అధికారుల సన్నాహాలు 
  • 21,625 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు 
  • మంజీరా నదికి ఇరువైపులా 50వేల ఎకరాలసాగుకు అవకాశం 
  • ఈ నెల 10 నుంచి నీటి విడుదల 
  • ఇప్పటికే తుకాలు పోసుకున్న ఆయకట్టు రైతులు 

వర్షాభావ పరిస్థితులతో ఐదేండ్లుగా నీటి విడుదల లేక ఘనపూర్‌ వనదుర్గా ప్రాజెక్టు ఆయకట్టు భూములు బీడుగా మారాయి. కాగా, ఈ వానకాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తారు. దీంతో వనదుర్గా ఆయకట్టుకు భరోసా ఏర్పడింది. ఈ యాసంగి సాగుకు గాను ఆయకట్టు రైతులకు ఈనెల 10 నుంచి 12 దఫాలుగా 4.06 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు మురిసిసో తున్నారు. నీటి విడుదలతో 21,625 ఎకరాల్లో పంటలు పండనున్నాయి. దీంతో పాటు మంజీరా నదికి ఇరువైపులా ఉన్న భూములు సాగులోకి రానున్నాయి.తుకాలు, నాట్లు వేసే పనుల్లో ప్రస్తుతం ఆయకట్టు రైతాంగం బిజీగా ఉంది?

- మెదక్‌, జనవరి 8 

మెదక్‌, జనవరి 08  : వర్షాభావ పరిస్థితుల కారణంగా గత నాలుగైదు ఏండ్ల నుంచి సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో ఘనపూర్‌ వనదుర్గా ప్రాజెక్టు ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగుకు నోచుకోలేదు. ఈ వానకాలంలో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది.దీంతో ఘనపూర్‌ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలతో నీటి విడుదలకు బోర్డు ఆమో దం తెలిపింది. దీంతో ఘనపూర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ ఏసయ్య ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులు సన్నాహా లు చేస్తున్నారు. ఈ యాసంగిలో మంజీరా నదికి ఇరువైపులా భూములన్నీ సాగులోకి రానున్నాయి. ఇప్పటికే రైతులకు తుకాలు పోసుకొని, దుక్కులు దున్ని వరినాట్లకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. బోరుబావులు ఉన్న రైతులు నాట్లు వేయడం ప్రారంభించారు. 

4 మండలాలు.. 21,625 ఎకరాల ఆయకట్టు... 

మెదక్‌ జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్‌ వనదుర్గా ఆయకట్టు 21,625 ఎకరాలుగా స్థిరీకరించారు. ప్రాజెక్టుకు ఎడుమ, కుడి కాలువలు ఫతేనహర్‌, మహబూబ్‌నహర్‌ కాలువల ద్వారా మెదక్‌, పాపన్నపేట, కొల్చారం, హవేళి ఘనపూర్‌ మండలాలకు సాగునీరు అందుతుంది. అప్పట్లో కాలువలు గొలుసుకట్టు ఆకారంలో గ్రామాలను కలుపుతూ చెరువులను నింపే విధంగా ఎడుమ, కుడి కాలువలను నిర్మించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఎడుమ, కుడి కాలువలకు సిమెంట్‌ లైనింగ్‌కు నిధులు మంజూ రు చేసి నిర్మించారు. ఇంకా కొంత దూరం సిమెంట్‌ లైనింగ్‌ పనులు కావాల్సి ఉంది. అయినప్పటికీ ఆయకట్టు చివరి భూముల వరకు నీరందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  

ముందే నాట్లు వేసుకుంటున్నాం...

వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఘనపూర్‌ వనదుర్గా ప్రాజెక్టు పొంగి పొర్లింది. మం జీర నది నిండుగా పారింది. వాగు మడుగుల్లో నీటి నిల్వలు ఉండడంతో వరినాట్లు వేసుకుంటున్నాం. నీటి విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తుకం పోసుకొని భూమిని సిద్ధం చేశాం.        

- ఆత్మకూరి విఠల్‌, రైతు, పేరూర్‌ 

సీఎం, మంత్రికి కృతజ్ఞతలు..

ఘనపూర్‌ వనదుర్గా ప్రాజెక్టు ఆయకట్టు రైతులను దృష్టిలో పెట్టుకొని యాసంగి సాగుకు సింగూరు నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత 4,5 ఏండ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయకట్టు కింద పంటలు సాగుకు నోచుకోలేదు. ఈసారి 12 దఫాలుగా 4.06 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించాం. నీటి విడుదలకు సహకరించిన సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. 

-పద్మాదేవేందర్‌ రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే   

నీటిని విడుదల చేస్తాం...

ఘనపూర్‌ వనదుర్గా ప్రాజెక్టు ఆయకట్టుకు 12 దఫాలుగా 4.06 టీఎంసీల నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి విడుదల చేసేందుకు ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈనెల 10 నుంచి నీటిని విడుదల చేస్తాం. ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలి. నీటిని వృథా చేయరాదు. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు.                         

-ఏసయ్య,ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ,మెదక్‌ 

VIDEOS

logo