శనివారం 23 జనవరి 2021
Medak - Dec 04, 2020 , 00:15:30

సర్కారు దవాఖానల్లో..మధ్యాహ్న భోజనం

సర్కారు దవాఖానల్లో..మధ్యాహ్న భోజనం

మెదక్‌ కలెక్టరేట్‌ : సర్కారు దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకునే గర్భిణులకు మెదక్‌ జిల్లాలో నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మెదక్‌ జిల్లాలో నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా, 10,500 మంది గర్భిణులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 

గర్భిణుల ఇబ్బందులు తొలిగించడానికే..

మూడో నెల నుంచి గర్భిణులు పరీక్షల కోసం దవాఖానలకు రెగ్యులర్‌గా వెళ్తారు. వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికి మధ్యాహ్నం అవుతుంది. దీంతో వారు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సర్కారు అంగన్‌వాడీ కేంద్రాల్లో లంచ్‌ ఏర్పాటు సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం కింద గర్భిణులకు ఆకుకూరలతో పాటు పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, అన్నం ఇస్తున్నారు. కరోనా నేపథ్యంలో నెలకు సరిపడే బియ్యం, పప్పు, మంచినూనె తదితర వస్తువులను గర్భిణుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంగన్‌వాడీ టీచర్లు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారు. 

అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం తయారీ..

గర్భిణులకు అందించే లంచ్‌ బాక్స్‌లు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే తయారు చేస్తారు. ముందుగా గ్రామాల్లో ఉండే ఆశ కార్యకర్తలు ఒక రోజు ముందే గర్భిణుల వివరాలను అంగన్‌వాడీ టీచర్లకు అందిస్తారు. గర్భిణుల సంఖ్య ఆధారంగా అన్నం, కూరతో కూడిన పప్పు, ఉడకబెట్టిన గుడ్డు సిద్ధం చేస్తారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ భోజనం తీసుకెళ్లి బాక్సుల్లో పంపిణీకీ సిద్ధంగా ఉంచుతారు. గర్భిణులు వైద్య పరీక్షలు చేయించుకున్నాక అందజేస్తారు. దీంతో జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 10,500 మంది గర్భిణులకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా గర్భిణులకు లంచ్‌ బాక్స్‌లను అందించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ అధికారులు సిద్ధమయ్యారు. 

గర్భిణులకు మంచి అవకాశం..

ప్రభుత్వ దవాఖానల్లో వైద్య పరీక్షలు చేయించుకునే గర్భిణులకు లంచ్‌ బాక్సులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గర్భిణులకు ఇది మంచి అవకాశం. ఈ నెల 4వ తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భోజనం తయారు చేసి ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లేలా చూస్తాం. మెదక్‌ ల్లాలో 1076 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 

-రసూల్‌ బీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి, మెదక్‌logo