సోమవారం 25 జనవరి 2021
Medak - Dec 01, 2020 , 01:02:22

అందరం ఓటేద్దాం..ప్రజాస్వామ్యన్ని పరిరక్షిద్దాం..

అందరం ఓటేద్దాం..ప్రజాస్వామ్యన్ని పరిరక్షిద్దాం..

  • ఓటు వజ్రాయుధం.. నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అస్త్రం  
  • నేడు వేతనంతో కూడిన సెలవు ప్రకటన..
  • ఇంట్లో ఉండకుండా పోలింగ్‌లో పాల్గొందాం
  • ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌
  • గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్‌ నమోదు
  • ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ఓటర్లు ముందుకు రావాలి
  • విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన యంత్రాంగం

రామచంద్రాపురం: ప్రజాస్వామ్య దేశంలో ఓటు మన హక్కు. ఓటు ద్వారానే మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఐదేండ్లు మనకు మంచి సేవ చేసే నాయకుడిని ఎన్నుకుంటే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుంటే అది మనకే కాదు, మన చుట్టూరా ఉన్న సమాజానికి కూడా కీడు చేస్తోంది. ప్రతి ఓటరూ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతీసారి హైదరాబాద్‌ నగరంలో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతున్నది. నగర జనం పోలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరనే భావన అందరిలోనూ ఉంది. గ్రామాల్లో 90 శాతం పోలింగ్‌ నమోదవుతుంటే, హైదరాబాద్‌లో మాత్రం 50శాతానికి మించదు. ఈ ఎన్నికలో ఆ విధంగా జరుగకుండా ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాలి. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. మనం ఒక్కరమే ఓటు వేయకపోతే ఏమవుతుందులే అని అనుకోవడం తప్పు. ఎన్నికలు ప్రతి ఐదేండ్లకు ఒకసారి వచ్చేవి. ఎన్నికలు వచ్చినప్పుడే మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోగలుగుతాం. ఇప్పటికే అధికారులు ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఓటర్లకు ఎప్పుడు వీలైతే అప్పుడు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి రావాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎక్కువ శాతం ఉద్యోగులు, విద్యావంతులే ఉంటారు. అం దరూ ఓటింగ్‌లో పాల్గొని ఓటింగ్‌ శాతం పెరిగేలా చూడాలి.

నేడు వేతనంతో కూడిన సెలవు..

జీహెచ్‌ఎస్‌సీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు వేతనంతో కూడిన సెలవును ప్రకటించారు. పటాన్‌చెరు, ఆర్సీపురం, భారతీనగర్‌ డివిజన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలు ఉంటారు. పోలింగ్‌ సందర్భంగా మంగళవారం పరిశ్రమలకు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సెలవు ఇచ్చారు. ఎలక్షన్‌ హాలీడేను జాలిడేగా భావించకుండా ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి. వేతనంతో కూడిన సెలవుని ప్రకటించిన నేపథ్యంలో, ఉద్యోగులు, కార్మికులు వారి బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో సరదాగా బయటకు వెళ్లాలనుకున్నా.. జాలీగా గడపాలనుకున్నా.. అది ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాతనే అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనకు అభివృద్ధి జరుగాలన్నా.. నిత్యం మనకు అండగా ఉండి సేవ చేసే మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నా అది ఓటుతోనే సాధ్యమవుతుంది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.29 పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొని పోలింగ్‌ శాతం పెరిగేలా చూడడం మన బాధ్యత.

ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌..

నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉద యం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించనున్నారు. పోలింగ్‌ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తీసుకువచ్చేందుకు ఆటోలు, నడవలేని స్థితిలో ఉన్న వారికోసం పోలింగ్‌ కేంద్రం వద్ద స్ట్రెచర్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు సంబంధించి అని ఏర్పా ట్లు పూర్తిచేసినట్లు బల్దియా ఉప కమిషనర్‌ బాలయ్య తెలిపారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆయన కోరారు. 


logo