ఆదివారం 24 జనవరి 2021
Medak - Nov 29, 2020 , 00:13:34

అభివృద్ధికి ఓటేయండి

అభివృద్ధికి ఓటేయండి

  • మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

రామచంద్రాపురం : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం 112 ఆర్సీపురం డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్‌ షాపింగ్‌ సెంటర్‌ ఏరియాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూరుగడ్డ పుష్పానగేశ్‌కు మద్దతుగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ అభివృద్ధిలో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. ఎన్నో సాప్ట్‌వేర్‌ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని తెలిపారు. అమెజాన్‌ కంపెనీ రూ.21వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్‌లో పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. యువతకు ఉద్యోగవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఆరేండ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో బీజేపీ మతం అనే చిచ్చు పెడుతుందని విమర్శించారు. ప్రజల మధ్య విద్వేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ప్రజలు బాగా ఆలోచించి బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి డివిజన్‌లో కోట్లాది రూపాయాలు వ్యచ్చించి అభివృద్ధి చేశామన్నారు. పింఛన్లు, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభివృద్ధి నిరోధకులుగా మారారన్నారు. కార్యక్రమంలో 112 ఆర్సీపురం కార్పొరేటర్‌ అభ్యర్థి పుష్పానగేశ్‌, అంజయ్య, పరమేశ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఐల్లేష్‌, గఫర్‌, ఖదీర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo