గురువారం 28 జనవరి 2021
Medak - Nov 26, 2020 , 00:15:32

అభివృద్ధి చేశాం..ఓట్లడుగుతున్నాం

అభివృద్ధి చేశాం..ఓట్లడుగుతున్నాం

  • బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రయోజనం ఉండదు
  • పనిచేసే ప్రభుత్వానికే ఓటు వేసి ఆశీర్వదించండి
  • 112 ఆర్సీపురం డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

రామచంద్రాపురం : పటాన్‌చెరు నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం 112 డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి బూరుగడ్డ పుష్పానగేశ్‌తో కలిసి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజీపడకుండా పనిచేస్తున్నామని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందజేస్తున్నట్లు తెలిపారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని అన్నారు. బల్దియా ఎన్నికల వేళ పట్టణ ప్రజలపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారని అన్నారు. సెలూన్లకు, రజకులకు, దోబీఘాట్‌ నిర్వహించే వారికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. 20వేల లీటర్ల వినియోగం ఉన్న వారికి ఇకమీదట నల్లా బిల్లులు ఉండవన్నారు. రూ.15వేల వరకు ఉన్న ఇంటి పన్ను 50శాతం మాఫీ చేసినట్లు తెలిపారు. సీనియర్‌ సిటిజన్స్‌కు బస్‌పాస్‌లను ఉచితం చేసినట్లు తెలిపారు. బీహెచ్‌ఈఎల్‌ వరకు మెట్రో రైల్‌ని విస్తరించనున్నట్లు తెలిపారు. మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని, ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే ఓటు వృథా అవుతుందే తప్ప ప్రయోజనం శూన్యమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల దొంగ మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ప్రజలు బాగా ఆలోచించి అభివృద్ధివైపు నిలిచి 112 డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి పుష్పానగేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు పరమేశ్‌యాదవ్‌, అంజ య్య, కృష్ణమూర్తి, ఐలేశ్‌, ఖధీర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo