గురువారం 28 జనవరి 2021
Medak - Nov 26, 2020 , 00:15:52

కేంద్రం ఏమిచ్చిందని బీజేపీకి ఓటేయాలి..?

కేంద్రం ఏమిచ్చిందని బీజేపీకి ఓటేయాలి..?

  • బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలి
  • బాధితులకు సాయం చేస్తుంటే అడ్డుకుంది వారే..
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అవ్వగానే ప్రజలకు వరద సాయం అందజేస్తాం
  • జీవన ప్రమాణాల మెరుగుదలలో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌ 
  • తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌ను కేంద్రం రద్దు చేసింది
  • కేంద్రం బెంగళూరుకు   రూ.600కోట్లు, గుజరాత్‌కు రూ.400 కోట్ల వరద సాయం..
  • తెలంగాణకు ఎందుకు  సాయం చేయలేదు?
  • కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయాలని చూస్తున్నది..
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి 
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

రామచంద్రాపురం : వరదలు వస్తే కేంద్రం బెంగళూరుకు రూ.600 కోట్లు, గుజరాత్‌కు రూ.400కోట్లు ఇచ్చిందని, తెలంగాణకు ఎందుకు వరద సహాయం చేయలేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నాయని కేంద్ర మంత్రులు ఇక్కడికి వస్తున్నారని, ముందు తెలంగాణకు వరద సహాయం ఏమైందో చెప్పిన తర్వాతనే రావాలని మంత్రి అన్నారు. బుధవారం ఆర్సీపురం 112 డివిజన్‌లోని జ్యోతినగర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణకు ఐటీఆర్‌ ప్రాజె క్ట్‌ మంజూరైతే, దానిని కేంద్రం రద్దు చేసిందన్నారు. 

  ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌ వస్తే మన యువతకు 2లక్షల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. తెలంగాణకు ఇస్తామని ట్రైబల్‌ యూనివర్సిటీ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు. వరంగల్‌లో వ్యాగన్‌ ఫ్యాక్టరీ, కోచ్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. బీహెచ్‌ఈఎల్‌, ఆర్డినెన్స్‌ తదితర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదన్నారు. లక్షల ఉద్యోగాలను రోడ్డు పాలు చేసే ప్రయత్నం చేస్తుందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేంద్రం విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్‌ 24శాతానికి పడిపోయిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం 16శాతం గ్రోత్‌రేట్‌తో ముందు వరుసలో ఉందన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం, ఆరేండ్ల కాలంలో 6 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. దేశంలో 17 రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉందని , ఆయా రాష్ర్టాల్లో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నారా, రూ.2,016 పింఛన్లు అందజేస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ సోషల్‌ మీడియాలో కన్పిస్తుందని, కానీ.. పనుల్లో కన్పించదని తెలిపారు. మతం పేరిట ప్రజల్లో చిచ్చుపెట్టడమే పనిగా బీజేపీ పెట్టుకుందని విమర్శించారు. జీవన ప్రమాణాల విషయంలో దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌గా ఉందని మంత్రి తెలిపారు. 

పెద్ద ఎత్తున పరిశ్రమల రాక...

రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీలోని ఉస్మాన్‌నగర్‌లో 400 ఎకరాల్లో ఐటీ పార్క్‌, సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైస్‌ పార్క్‌, శివనగర్‌లో ఎల్‌ఈడీ పార్క్‌లను ఏర్పాటు చేశామని, వేలాది మంది యువతకు ఉద్యోగవకాశాలు వస్తాయని తెలిపారు. 

6.60లక్షల మందికి వరద సాయం..

రాష్ట్ర ప్రభుత్వం 6.60 లక్షల మందికి వరద సాయం అందజేసిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరద సాయం అందని వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించామని, దరఖాస్తు చేసుకున్న వారికి వరద సాయం అందజేస్తుంటే టీఆర్‌ఎస్‌కు మంచి పేరు వస్తుందని బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. కేంద్రం వరద సహాయం చేయకున్నా, పండుగ పూట వరదల కారణంగా ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రూ.10 వేలు అందజేస్తుంటే, దానికి అడ్డుపడింది బీజేపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తవ్వగానే 5వ తేదీ నుంచి వరద సాయం అందజేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసే బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ఆయన అన్నారు. ఓట్లడగడానికి వచ్చే బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని అన్నారు. మూడేం డ్లు టీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలో ఉంటుందని, టీఆర్‌ఎస్‌కి చెందిన కార్పొరేటర్‌ ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలకు సూచించారు. 

ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బిందెలు, కందిళ్లు తీసుకోచ్చేటోళ్లు..

గత ప్రభుత్వాల హయాంలో అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు బిందెలతో వచ్చి ధర్నా చేసేటోళ్లని, ఎండకాలం వస్తే కందిళ్లు పట్టుకోని వచ్చేటోళ్లని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మిషన్‌ భగీరథతో అదిలాబాద్‌ జిల్లా గొండుగూడెం నుంచి ఖమ్మం జిల్లా కోయగూడెం వరకు ఇంటింటికీ స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీటిని అందజేస్తున్నామని తెలిపారు. 24గంటల నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేస్తుండడంతో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా సప్పుడు చేస్తలేడని తెలిపారు. ఎన్నో మంచి పనులు చేశాం. ఇంక చేయాల్సినవి చాలా ఉన్నవి, ప్రజలు బాగా ఆలోచన చేసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, 112 డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి పుష్పానగేశ్‌, అంజయ్య, పరమేశ్‌యాదవ్‌, ప్రమోద్‌గౌడ్‌, యాదయ్యగౌడ్‌, ఖదీర్‌ తదితరులు పాల్గొన్నారు.


  


Previous Article A Dog at the Well

తాజావార్తలు


logo