మంగళవారం 19 జనవరి 2021
Medak - Nov 18, 2020 , 00:11:35

ధాన్యం డబ్బులు రూ.వంద కోట్లు జమ

ధాన్యం డబ్బులు రూ.వంద కోట్లు జమ

ఇప్పటివరకు   89,566 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు

72 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ

జిల్లాలో 123 రైస్‌ మిల్లులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి

మూడు కేంద్రాల ద్వారా 550 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు

జిల్లా  ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

మెదక్‌ కలెక్టరేట్‌ : జిల్లాలో ఇప్పటివరకు 89,566 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.వంద కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ధరణి పోర్టల్‌, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అంతకుముందు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకంతో పాటు సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం అభినందనీయమని, ఇందుకు సహకరిస్తున్న రైస్‌ మిల్లుల యాజమాన్యాలకు   ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రోజూ సుమారు ఐదు నుంచి ఆరు మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తున్నదని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించి ట్యాబ్‌ ఎంట్రీ చేసి, ట్రక్‌ షీట్‌ తెప్పించుకొని ఓపీఎంఎస్‌ ద్వారా 72 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో మూడు వేల మెట్రి క్‌ టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. అధికారులు రైస్‌మిల్లర్లతో సంప్రదింపులు జరుపుతూ సన్న రకాలు కోత కోసిన దగ్గర రైతులను చైతన్యపర్చి   కొనుగోలు కేంద్రాలకు ధాన్యా న్ని తీసుకెళ్లేలా చూడాలని అన్నారు. జిల్లాలో 123 రైస్‌ మిల్లులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయని , పది మిల్లులు మాత్రం సన్నరకం ధాన్యాన్ని తీసుకొనుటకు అభ్యంతరం తెలుపగా నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో 80 నుంచి 90 శాతం వారి కోత ముగిసిందని, ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 30 శాతం మేర పంటలను కొనుగోలు చేశామని అన్నారు. జిల్లాలో మూడు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 550 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశామని తెలిపారు. 

  స్లాట్‌ రీ షెడ్యూల్‌ చేయడం భావ్యం కాదు..

ధరణి పోర్టల్‌ గురించి సమీక్షిస్తూ రిజిస్ట్రేషన్‌లకై స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాటిలో 48 మంది రీ షెడ్యూల్‌ పెట్టుకున్నారని ఇది శోచనీయమని, చిన్న చిన్న కారణాలతో రీ షెడ్యూల్‌కై పెట్టుకున్న వారితో మాట్లాడి డాక్యుమెంటేషన్‌ అయ్యేలా చూడాలని కలెక్టర్‌ ఆర్డీవోలను ఆదేశించారు. సాక్షి లేరని, దాత రాలేదని, కొనుగోలుదారుడు రాలేదని  ఇలాంటి చిన్న చిన్న సాకులతో స్లాట్‌ రీ షెడ్యూల్‌ చేయడం భావ్యం కాదని, పోర్టల్‌ లాగిన్‌ ఉన్న సంబంధిత తహసీల్దార్లు ఖచ్చితంగా హాజరై ఏ రోజు స్లాట్‌ ఆ రోజు డాక్యుమెంటేషన్‌ అయ్యేలా చూడాలని అన్నారు. ఆర్డీవోలు సంబంధిత తహసీల్దార్లు, డీటీలతో సమావేశమై ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఒక మాసంలోగా ధరణి పోర్టల్‌ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని సూచించారు. మెదక్‌ మున్సిపాలిటీలో 12 కిలోమీటర్ల మేర మున్సిపల్‌ పరిధి ఉందని, ఇందులో ఆరు కిలోమీటర్ల మేర పనులు జరిగాయని అన్నారు. కాగా ఈ పన్నెండు కిలోమీటర్ల రోడ్ల వెడల్పు, సెంటర్‌ మీడియాన్‌, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికతో పాటు అంచనా వ్యయం రూపొందించి నాలుగు రోజుల్లోగా తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఈ పట్టణాన్ని కూడా సిద్దిపేటలాగే సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మెదక్‌, తూప్రాన్‌ ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రసాద్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీసీఎస్‌వో శ్రీనివాస్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరశురాంనాయక్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.