శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 29, 2020 , 00:08:40

అధికారులతో మాట్లాడిన కలెక్టర్‌ హనుమంతరావు

అధికారులతో మాట్లాడిన కలెక్టర్‌ హనుమంతరావు

నాణ్యతా లోపం లేకుండా నిర్మించాలని సూచన

మెదక్‌ కలెక్టరేట్‌ : జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, ఆయా గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో అధికారులు ఎలా పని చేస్తున్నారు..? పనులు ఎంత వరకు వచ్చాయి... అనే వివరాలను బుధవారం కలెక్టరేట్‌లోని చాంబర్‌ నుంచి కలెక్టర్‌ హనుమంతరావు అధికారులకు వీడియో కాల్‌ చేసి తెలుసుకున్నారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 76 రైతు వేదికలను నిర్మిస్తుండగా, వీటన్నింటినీ నాణ్యతా లోపం లేకుండా నిర్మించాలన్నారు. రైతు వేదికలతో రైతులంతా సంఘటితం కావాలన్నదే దీని ఉద్దేశమన్నారు. పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రైతులు ఏ సీజన్‌లో ఏ పంట సాగు చేయాలి, గిట్టుబాటు ధర కల్పించడం, సాగుకు సంబంధించిన అనుభవాలు, వాటిలో లాభనష్టాలపై చర్చించుకునేందుకు రైతువేదికలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక భవనాన్ని మంజూరు చేశామన్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు ఎక్కువ మంది కూలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌, రైతులతో అధికారులు సమన్వయంతో ఉంటూ నిర్ణీత గడువులోగా రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

నాణ్యత లోపిస్తే చర్యలు..

కొల్చారం : మెదక్‌ జిల్లావ్యాప్తంగా చేపడుతున్న రైతువేదికల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌  హనుమంతరావు అన్నారు. బుధవారం మండలంలోని రంగంపేటలో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గడువులోగా రైతువేదిక నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. పనుల్లో నిర్యక్ష్యం వహించిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.