శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 29, 2020 , 00:08:35

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల అరెస్టు

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల అరెస్టు

రూ.లక్షా ఐదు వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, రెండు కంఫ్యూటర్లు స్వాధీనం

రెండున్నర తులాల బంగారం, తొమ్మిదిన్నర తులాల వెండి గొలుసులు రికవరీ

టేక్మాల్‌, పాపన్నపేట, యూసూఫ్‌పేట బ్యాంకులో చోరీకి యత్నించిన దొంగల రిమాండ్‌

టేక్మాల్‌ : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. టేక్మాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. మండలంలోని మెర్గోనికుంట తండాకు చెందిన దేవసోత్‌ రాజు అలియాస్‌ బుట్టా, దేవసోత్‌ రాజు ఇద్దరు వరుసకు బాబాయ్‌, కొడుకులు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం  చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని బ్యాంకులు, వైన్స్‌, ఫర్టిలైజర్స్‌, కిరాణా దుకాణాల గోడలకు కన్నం వేసి చోరీలు చేశారు. గతేడాది నవంబర్‌ 22న పెద్దశంకరంపేట ఎస్బీఐ బ్యాంకులో రూ.25వేలు చోరీ చేశారు. ఈ ఏడాది జూన్‌ 10న టేక్మాల్‌ వైన్స్‌లో రూ.30 వేలు, జూలై 8న నారాయణఖేడ్‌ వైన్స్‌లో రూ.12వేలు, జూలై 11న హత్నూరలోని కిరాణా షాపులో రూ.73 వేలు, జూలై 20న నర్సాపూర్‌ వైన్స్‌లో రూ.3వేలు, నర్సాపూర్‌లోని ఫర్టిలైజర్‌ షాపులో రూ.98,200, జూలై 30న వట్టిపల్లిలోని ఫర్టిలైజర్‌ షాపులో రూ.15వేలు, ఆగస్టు 17న మెదక్‌లోని ఆటోమోబైల్‌ షాపులో రూ.50వేలు, అక్టోబర్‌ 7న జోగిపేటలో మూడున్నర తులాల బంగారు నగలను చోరీ చేశారు. జూన్‌ 25న టేక్మాల్‌లోని ప్రాథమిక సహకార కేంద్ర బ్యాంకులో, జూలై 13న పాపన్నపేట ప్రాథమిక సహకార బ్యాంకు, సెప్టెంబర్‌ 28న పాపన్నపేట మండలం యూసూఫ్‌పేటలోని గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చోరీకి యత్నించారు. పాపన్నపేటలోని బ్యాంకు నుంచి కంఫ్యూటర్‌ మానిటర్లను తస్కరించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బుధవారం ఉదయం 5గంటల సమయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి రూ.1,05,000 నగదు, రెండున్నర తులాల బంగారం, తొమ్మిదిన్నర తులాల వెండి గొలుసులు, రెండు సెల్‌ఫోన్లు, రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో అల్లాదుర్గం సీఐ రవి, టేక్మాల్‌ ఎస్సై లింబాద్రి, పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు ఉన్నారు. ఎస్సైలను, సాంకేతిక విభాగం ఎస్సై కమలాకర్‌ను డీఎస్పీ అభినందించారు.