శనివారం 05 డిసెంబర్ 2020
Medak - Oct 28, 2020 , 00:05:27

రైతు వేదికలు, ప్రకృతి వనాలు పూర్తి చేయండి

రైతు వేదికలు, ప్రకృతి వనాలు పూర్తి చేయండి

ప్రత్యేకాధికారులు, ఇంజినీర్లు, ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలి

మెదక్‌ కలెక్టర్‌ హనుమంతరావు 

మెదక్‌ కలెక్టరేట్‌ : మెదక్‌ జిల్లావ్యాప్తంగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులతో కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం విషయంలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రత్యేకాధికారులు, వ్యవసాయాధికారులు, డీఈలు, ఏఈలు గ్రామాల్లో పర్యటించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన రైతు వేదికలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయనే వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల నిర్మాణ పనుల్లో  కాంట్రాక్టర్లు  నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించి రికార్డు చేయాలన్నారు. రైతు వేదికల్లో  విశాలమైన సమావేశ మందిరం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు  వివరించారు. నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను తొలిగించి బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు వేరే వారికి పనులను అప్పగించాలన్నారు. ప్రతి రోజూ జరిగే పనులను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు  ఏఈలు గ్రామాలకు వెళ్లి రైతు వేదికలకు అవసరమైన సామగ్రిని ఎంత మేర ఉంది.. ఇంకా ఏమైనా అవసరమా.. పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు.  గ్రామాల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత, ఇతర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి రోజూ ఒక పద్ధతి ప్రకారం గ్రామాలకు వెళ్లి పనులు జరుగుతున్న తీరును అధికారులు పర్యవేక్షించాల్సిందిగా సూచించారు. ఈ విషయంలో తాను సైతం ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తానని, అలాగే అధికారులకు వీడియో కాల్‌ చేసి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందని అధికారులకు వివరించారు. ఇసుకకు ఎలాంటి ఇబ్బంది లేదని సంబంధిత ఆర్డీవోలు, ఎంపీడీవోలు, అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల వారు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు ఏఏ దశలో ఉన్నాయనే వివరాలను సంబంధిత ఎంపీడీవోలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం చేపట్టే పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిని తొలిగించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పీఆర్‌ ఈఈ రాంచంద్రారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీఏవో పరశురాంనాయక్‌, మెదక్‌, తూప్రాన్‌ ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్‌, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు శ్రీనివాసులు, దేవయ్య, జయరాజ్‌, యేసయ్య, గంగయ్య, రసూల్‌బీ, ఆయా శాఖల డీఈలు, ఆయా మండలాల ఏఈలు, ఎంపీడీవోలు, ఏవోలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.