సోమవారం 30 నవంబర్ 2020
Medak - Oct 27, 2020 , 00:04:07

వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

320 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

ఐకేపీ ఆధ్వర్యంలో 117, పీఏసీఎస్‌ల ద్వారా 203 కేంద్రాలు 

జిల్లాలో 54 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ 

మెదక్‌ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి . వానాకాలం వరి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పంట దిగుబడి అంచనాలకు అనుగుణంగా జిల్లాలో 320 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఐకేపీ ఆధ్వర్యంలో 117 కేంద్రాలు ఏర్పాటు చేయగా పీఏసీఎస్‌ ల ద్వారా 203 కొనుగోళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత శనివారం నాటికి జిల్లాలో  175 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభయ్యాయి. నాలుగైదు రోజుల్లో మిగతా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల చివరి వారం నుంచి ధ్యానం కొనుగోలు ఉపందుకోనున్నాయి. దసరా పండుగ, సెలవుల కారణంగా రెండు మూడు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు మందకోడిగా సాగాయి. జిల్లాలో 1,87,080 ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. పంట దిగుబడి అంచనాలకు అనుగునంగా 3.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా అధికార యంత్రాంగం 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 175  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా నేటి వరకు 54 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు డీఎస్‌వో శ్రీనివాస్‌ తెలిపారు.  ప్రతి ధాన్య కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. 

54 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ 


జిల్లాలో 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. నాలుగైదు రోజుల్లో మొత్తం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం.  శనివారం వరకు జిల్లాలో ఆయా కేంద్రాల ద్వారా 54 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం.

- శ్రీనివాస్‌,జిల్లా పౌర సరాఫరాల అధికారి

 కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి


హవేళిఘనపూర్‌  : వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఫరీద్‌పూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ జువాజీ బ్రహ్మం అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఫరీద్‌పూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ బ్రహ్మం మాట్లాడుతూ రైతులు పండించిన వరిధాన్యం మద్దతు ధర కల్పించేందుకు  ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్య్నా విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగమాధురి, ఎంపీటీసీ రాజయ్య, మాజీ సర్పంచ్‌లు బ్రహ్మం, మాజీ చైర్మన్‌ సిద్దాగౌడ్‌, చిన్న బ్రహ్మం,ఉప సర్పంచ్‌ వెంకటి, వార్డు సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, ఏఈవో విజృంభన తదితరులు పాల్గొన్నారు.