మంగళవారం 01 డిసెంబర్ 2020
Medak - Oct 24, 2020 , 00:45:59

ముమ్మరంగా వరికోతలు

ముమ్మరంగా వరికోతలు

వర్షాలతో అన్నదాతలకు తిప్పలు

జాగ్రత్తలు పాటించాలంటున్న 

వ్యవసాయాధికారులు

కొల్చారం : కొల్చారం మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వానకాలం సీజన్‌లో ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయం చేయాలని సూచించడంతో రైతులు ప్రభుత్వ ఆదేశాల మేరకు మెట్ట భూముల్లో పత్తి, కంది పంటలు విత్తగా, వరిసాగులో సన్నరకం, దొడ్డురకం సాగుచేశారు. మండల వ్యాప్తంగా ఈసారి పుష్కలంగా వానలు కురవడంతో వరిపంట విస్తీర్ణం భారీగా పెరిగింది. మండలవ్యాప్తంగా  10వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేయగా, అయిదున్నర ఎకరాల్లో దొడ్డురకం వరిని సాగు చేశారు. దొడ్డురకం  ముందుగానే నాటడంతో వరిపంటకోత దశకు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలతో వరికోతలు కోసేందుకు ఇబ్బందులు తలెత్తాయి.  

ధరలు పెంచిన వరికోత మిషన్‌ యజమానులు

కూలీల కొరతతో వరికోత మిషన్లకు  గిరాకీ బాగా పెరిగింది. వానలతో టైర్ల మిషన్లు నడవకపోవడంతో చైన్‌ మిషన్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది. రైతుల అవసరాలను ఆసరా చేసుకుని మిషన్ల యజమానులు ధరలు పెంచేశారు. టైర్ల మిషన్లు గంటకు రూ.1800 నుంచి 2500 లకు పెంచారు. చైన్‌ మిషన్లు రూ. 3500 నుంచి 4000ల వరకు అదును చూసి వసూలు చేస్తున్నారు. ఇప్పటికే   సంగాయిపేట, చిన్నా ఘనపూర్‌ గ్రామాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

రైతులు ఆందోళన పడవద్దు

వరికోత విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. జాగ్రత్తలు పాటిస్తూ వరికోతలు కోయాలి. మిషన్ల విషయంలో ఫ్యాన్లను తొలిగించకుండా మెళకువలు పాటించాలి. దీంతో నాణ్యమైన ధాన్యం వస్తుంది. - బాల్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి

సన్నాలను ప్రభుత్వం కొనాలి

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సన్న రకం వరిపంటను సాగు చేశాం. దొడ్డురకం విషయంలో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నది. సన్నరకం వరిసాగుకు పెట్టుబడులు పెరిగాయి. సన్నరకం వరిధాన్యానికి క్వింటాల్‌ రూ.2500 చెల్లించి కొనుగోలు చేయాలి. - సంగన్న బసప్ప, రైతు, తుక్కాపూర్‌

వానలతో ఇబ్బందులు ఏర్పడ్డాయి

ఇటీవల కురిసిన వానలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. వరికోత యంత్రాల ధరలు పెంచేసినారు. వరికోత యం త్రాల ధరలు పెంచేసిన వారి పై  చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలి. - గూడెం నర్సింహారెడ్డి, రైతు, పైతర