మంగళవారం 01 డిసెంబర్ 2020
Medak - Oct 24, 2020 , 00:45:57

నేడు సద్దుల బతుకమ్మ

నేడు సద్దుల బతుకమ్మ

మెదక్‌ రూరల్‌ : సద్దుల బతుకమ్మకు జిల్లా కేంద్రంతో పాటు మెదక్‌ మండలంలోని గ్రామాలు సిద్ధమయ్యాయి. ఆడపడచులంతా కలిసి చేసుకునే పండుగ నేటి సద్దుల బతుకమ్మతో పరిసమాప్తం కానున్నది. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లు, ఆలయాల్లో బతుకమ్మలు ఆడే ప్రాంతాల్లో మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం చేసే  పిట్లం చెరువు, మల్లం చెరువు, బంగ్లా చెరువు, గోసంద్రం చెరువుతో పాటు ఎంఎన్‌ కాల్వ వద్ద మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్‌ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నది. విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. బతుకమ్మలు నిమజ్జనం చేసే చెరువుల వద్ద ఏర్పాట్లను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి పరిశీలించారు. మండలంలో ఆయా గ్రామాల్లోని బతుకుమ్మలు ఆడే కూడళ్లలో పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించి చర్యలు తీసుకుంటున్నారు.  

రద్దీగా మారిన మార్కెట్‌..

సద్దుల బతుకమ్మ సందర్భంగా శుక్రవారం మెదక్‌ మార్కెట్‌ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఉదయం నుంచే క్రయవిక్రయదారులతో కిటకిటలాడింది.  పూలు అమ్మే వారితో మార్కెట్‌ పరిసరాలు సందడి మారాయి.