శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 23, 2020 , 01:14:32

నాయిని తో కార్మికుల అనుబంధం

నాయిని తో కార్మికుల అనుబంధం

కోహీర్‌ : హిందుస్తాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కోహీర్‌ మండలంతో విడదీయరాని అనుబంధం ఉంది. దిగ్వాల్‌ పిరమల్‌ పరిశ్రమతో పాటు కవేలి రాక్‌వూల్‌ పరిశ్రమలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేసి కార్మికులకు విశేష సేవలందించారు. దిగ్వాల్‌ గ్రామంలో పరిశ్రమ ఏర్పడిన 1991 నుంచి 20 సంవత్సరాల వరకు నెలకు కేవలం రూ.7,500 వేతనంతో కార్మికులు పని చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని గుర్తించి వారికి నాయిని అండగా నిలిచారు. 2009 నుంచి 2014 వరకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ.22వేలకు పెంచేందుకు పరిశ్రమ యాజమాన్యాన్ని ఒప్పించి కార్మికులపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి సరిపడా వేతనాన్ని పెంచేందుకు పట్టుదలతో కృషి చేశారు. రాక్‌వూల్‌ పరిశ్రమలో కూడా ఆరు సార్లు వేతన ఒప్పందం చేసి కార్మికులకు అండగా నిలిచారు. 2018 నుంచి కార్మికులకు నెలనెలా రూ.30వేల వేతనం వచ్చేలా కృషి చేశారు. దిగ్వాల్‌ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు, చోరీలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు తమ గ్రామంలో పోలీస్‌ ఔట్‌ పోస్టును మంజూరు చేయించాలని గత సర్పంచ్‌, జడ్పీటీసీ రాందాస్‌ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి విన్నవించారు. ఇందుకు స్పందించిన హోం మంత్రి వెంటనే మంజూరు చేయించారు. పిరమల్‌ సహాయంతో భవన నిర్మాణం కూడా పూర్తయ్యింది. పోలీసులు ఇక్కడ నుంచి తమ సేవలందిస్తున్నారు. కాగా, కోహీర్‌ పట్టణంలో పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ప్రారంభించారు. ఓంకారేశ్వరాలయ పీఠాధిపతి సద్గురు డాక్టర్‌ ప్రతాప దక్షిణామూర్తి దీక్షితుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. మాజీ హోం మంత్రి మృతికి మండల ప్రజలందరూ నివాళులర్పిస్తున్నారు.  

‘నాయిని’యాదిలో...బీహార్‌ కూలీలకు విముక్తి

పుల్కల్‌ : దివంగత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్వారీలో పని చేసే బీహార్‌ కూలీలను రక్షించి అందరి మదిలో నిలిచారు. 2017లో జరిగిన ఈ సంఘటనలో తెలంగాణ తొలి హోం మంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డి కంకర క్వారీలో బందీలుగా ఉన్న బీహార్‌ కూలీలను రక్షించి అపద్బాంధవుడయ్యారు. బీహార్‌కు చెందిన 50 కుటుంబాల కూలీలు పుల్కల్‌ మండల సూరెడ్డి ఇటిక్యాల, నాదులపూర్‌ శివారుల్లో ఉండే కంకర క్వారీల్లో కూలీలుగా పని చేస్తున్నారు. కంకర తీసే యజమాని, రోడ్డు కాంట్రాక్టర్‌ కలిసి బీహార్‌ కూలీలను తెచ్చి క్వారీల వద్దే గుడిసెలు వేసి నిర్బంధంగా కూలీ డబ్బులు కూడా ఇవ్వకుండా పని చేయించుకున్నారు. పండుగలు పబ్బాలు అని చూడకుండా నిరంతరం పని చేయించుకోవడమే కాకుండా కూలీలకు సరైన కూలీ చెల్లించకుండా కూలీలను ఇబ్బందులకు గురి చేసేవారు. డబ్బులు ఇవ్వకపోవడంతో కాలేకడుపుతో పని చేయలేక ఎదురు తిరిగిన కూలీలను బంధించి చిత్ర హింసలకు గురి చేసేవారు. మహిళలని చూడకుండా చిత్రహింసలకు గురి చేసేవారు. దీంతో కూలీల్లో కొందరు యువకులు తప్పించుకుని హైదరాబాద్‌లోని సన్నిహితుల ద్వారా అప్పటి హోం, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డికి విషయాన్ని చేరవేశారు. స్పందించిన మంత్రి నాయిని  రాష్ట్ర స్థాయి కార్మిక, పోలీసు అధికారులతో కలిసి సూరెడ్డిఇటిక్యాల, నాదులపూర్‌ శివారుల్లోని క్వారీల్లో పని చేసే కూలీల వద్దకు ముందస్తు సమాచారం లేకుండా వచ్చి బీహార్‌ కూలీలను బంధ విముక్తుల్ని చేశారు. కొందరు కూలీలను స్వయంగ ఆయన కాన్వాయిలోని హైదరాబాద్‌కు తీసికెళ్లి షెల్టర్‌ ఇచ్చారు. అంతే కాకుండా క్వారీ నడిపించే యజమానిపై, రోడ్డు కాంట్రాక్టర్‌పై. కూలీలను తరలించే ముఠాపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి కటకటాల పాలు చేయించారు. రాష్ట్ర మంత్రిగా ఉండి గుట్టు చప్పుడు కాకుండా మండలంలోని క్వారీల వద్దకు స్వయంగా వచ్చి బీహార్‌ కూలీలకు బంధ విముక్తి చేయించిన సంఘటన అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం రేపింది. కొందరైతే ‘దటీజ్‌  నాయిని’ అని పేర్కొనగా, మరికొందరు పేద కూలీలపై, కార్మికులపై మంత్రికి ఉన్న ‘కమిట్‌మెంటు’ను కొనియాడారు.